అమరావతి (ప్రజా అమరావతి);
*చేపల పెంపకంలో శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం*
ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలోని వారికి, మత్స్యకార యువకులకు, జాలర్లకు, సహకార సంఘాల సభ్యులకు, చేపల పెంపకంనందు ఆసక్తి కలిగిన ఇతరులు, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన వారు చేపల పెంపకంలో శిక్షణ పొందడానికి దరఖాస్తులు చేసుకోవాలని పశ్చిమ గోదావరి జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ కె.ఎస్.వి. నాగలింగాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల మత్స్యకారులు ఈనెల 29వ తేదీలోగా బాదంపూడిలోని దేశీయ జల, మత్స్య సంవర్థన శిక్షణ కేంద్రానికి దరఖాస్తులు పంపాలన్నారు. అభ్యర్థులు తమ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, విద్యార్హతలు, అనుభవం మొదలైన వివరాలు తెలుపుతూ మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి, ఉంగుటూరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా.. చిరునామాకు పంపాలన్నారు. ఉపకార వేతనం లేకుండా 20 సీట్లు మాత్రమే ఉన్నాయని, ఈనెల 30వ తేదీన 11 గంటలకు బాదంపూడి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ప్రకటనలో తెలిపారు.
ఎంపికైన అభ్యర్థులను అదేరోజు సాయంత్రం 4 గంటలకు ప్రకటిస్తామన్నారు. శిక్షణ మూడునెలలు ఉంటుందని, ఎటువంటి ఉపకార వేతనం ఉండదన్నారు. 2022 సంవత్సరంలో జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు శిక్షణను ఇస్తామన్నారు. శిక్షణా కాలంలో మత్స్యక్షేత్రములు, రిజర్వాయర్లలో చేపల పెంపకం గురించి బోధన, ప్రాక్టికల్స్ నిర్వహిస్తామన్నారు. అనంతరం పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారికి సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. అభ్యర్థులు కనీసం 5వ తరగతి చదివి తెలుగులో చదవడం, రాయడం తెలిసి ఉన్నవారికి అవకాశం ఇస్తామన్నారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. దరఖాస్తుతో పాటు గతంలో మత్స్యశాఖ అధికారుల నుంచి పొందిన అనుభవం సర్టిఫికెట్లు జతపరచాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకురావాలన్నారు. ఇతర వివరాలకు మత్స్యశాఖ సహాయ సంచాలకులు, బాదంపూడి సెల్ నెంబరు 9573337484, మత్స్యశాఖ అభివృద్థి అధికారి, సెల్ నెంబర్ 9618008588లో కార్యాలయ పనివేళలో సంప్రదించాలని ఆయన తెలిపారు.
addComments
Post a Comment