డైక్ పనులకు ప్రతిపాదనలు పంపాలి - జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

 


డైక్ పనులకు ప్రతిపాదనలు పంపాలి

- జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్


  శ్రీకాకుళం,డిశంబరు 4 (prajaamaravati): డైక్ వద్ద కోతకు గురైన నదీ పరీవాహక ప్రాంతం వద్ద పనులకు ప్రతిపాదనలు సిద్దం చేసి పంపాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధికారులను ఆదేశించారు.  శనివారం డైక్  పనులు జరుగుతున్న ప్రాంతంలో నాగావళి నది కోతకు గురి అవుతున్న పరిస్థితిని మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలసి పరిశీలించారు. కోతకు గురి అవుతున్న ప్రాంతానికి తక్షణం రక్షణ గోడ నిర్మించి శ్రీకాకుళం పట్టణానికి భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం లేకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. డైక్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గులాబ్ తుఫాన్ సమయంలో నాగావళి లో ఎక్కువ వరద రావడం వలన డైక్ వద్ద కోతకు గురైందన్నారు.  ప్రస్తుతం జవాద్ తుఫాన్ సందర్భంగా మడ్డువలన రిజర్వాయర్, నారాయణపురం ఆనకట్ట నుండి నీరు విడుదల చేయడంతో కోత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని తుఫానులకు వరదలు వచ్చే ప్రమాదం ఉందని, ఎక్కువ నీరు వచ్చి శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు. డైక్ ను ఆనుకొని ఒక రక్షణ గోడ తప్పనిసరిగా నిర్మించాల్సి ఉందని పేర్కొన్నారు.  ఇందుకు సంబంధించి ఒక డిపిఆర్ తయారు చేయాల్సిందిగా ఇరిగేషన్ ఎస్.ఇ సుధాకర రావును ఆదేశించారు. 


 ఈ పర్యటనలో శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ సి హెచ్. ఓబులేసు, వంశధార ఎస్. ఇ డోలా తిరుమల రావు., తహసిల్థార్ వెంకటరావు, మునిసిపల్ ఇంజనీరు రమణ మూర్తి, ఇరిగేషన్ ఇంజినీర్ డి.శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.