సున్నా నుండి ఆరు సంవత్సరాల లోపు వయస్సు గల ఆరోగ్యవంతమైన బాల బాలికల మధ్య పోటి

                       

నెల్లూరు (ప్రజా అమరావతి);


దేశవ్యాప్తంగా త్వరలో నిర్వహించబోతున్న "స్వస్థ బాలక్ బాలిక స్పర్ధ" క్యాంపెయిన్ ను విజయవంతం చేయుటకు ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు  కలిసి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ  కె.వి.యన్ చక్రధర్ బాబు కోరారు. 


     గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో  సి డి పి వో లు సూపర్వైజర్లు తో పోషన్ అభియాన్ ముందస్తు సమావేశం నిర్వహించారు. ముందుగా కార్యక్రమ ఉద్దేశాలను జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి రోజ్ మాండ్   వివరించారు. ఈ సమావేశంలోజిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సున్నా నుండి ఆరు సంవత్సరాల లోపు  వయస్సు గల ఆరోగ్యవంతమైన బాల బాలికల మధ్య పోటినిర్వహిస్తారని తెలిపారు. ఆయా సంవత్సరాల వయస్సు గల బాలబాలికల అందరి ఎత్తు-బరువుల ను " పోషన్  ట్రాకర్ మొబైల్ యాప్ " ద్వారా నమోదు చేయవలసి ఉంటుందని తెలిపారు. ఇందుకుగానూ జిల్లాలోని ఆరు సంవత్సరాల వయసు లోపు పిల్లలందరినీ గుర్తించి రిజిస్టర్ చేయించటం లో అంగన్వాడి వర్కర్లు తోపాటు వివిధ స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. గ్రామ ,వార్డు సచివాలయాల ద్వారా, వాలంటీర్ల సేవలను కూడా ఉపయోగించుకొని వందశాతం పిల్లలను గుర్తించాలన్నారు. కేవలం అంగన్వాడీ లలో నమోదైన పిల్లలనే కాకుండా వీధి బాలలు ను కూడా గుర్తించి రిజిస్టర్ చేయించాలన్నారు. అవగాహన గల తల్లిదండ్రులు తమకు తాముగా వారి పిల్లల యొక్క గ్రోత్ వివరాలను ఆ యాప్ లో నమోదు చేయవచ్చన్నారు.  పిల్లలలో పోషకాహార లోపాలను ఎంత ముందస్తుగా గమనిస్తే వారిని ఆరోగ్యవంతులుగా తయారుచేయటానికి అవకాశం ఉంటుందన్నారు. బాలబాలికలకు సమాన స్థాయిలో  పోషకాహారం అందించవలసిన బాధ్యత ప్రతి తల్లిదండ్రుల పైన ఉందన్నారు. బాలికలకు చిన్ననాటినుంచే మంచి పోషకాహారం అందజేస్తే,  తదనంతరం తల్లులు గా ఆరోగ్యంగా ఉంటారని, తద్వారా సమాజమంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. మంచి ఆహారపు అలవాట్లు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలకు ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ కూడా జారీ చేయబడుతుందని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలలో ఉన్నటువంటి గ్రోత్ మానిటరింగ్ స్కేల్స్ కు ఏవైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వెంటనే చేయించి పిల్లలకు ఖచ్చితమైన గ్రోత్ లను నమోదు చేయాలని తెలిపారు. అర్బన్ ఏరియా, రూరల్ ఏరియా, తాండా లలో గ్రోత్ మానిటరింగ్ చేయుటకు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.  స్వస్థ బాలక్ బాలిక స్పర్ధ క్యాంపెయిన్ లో  భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు , హెల్పర్స్ కు ఇన్సెంటివ్స్ తో పాటు  జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి లలో ఉత్తమ అవార్డులు కూడా అందజేస్తారని తెలిపారు. 

  ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ శ్రీ గణేష్ కుమార్, ఇతర అధికారులు వివిధ స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు పాల్గోన్నారు.