*ఆర్బీకేల పనితీరుపై రైతుల్లో అవగాహన కల్పించండి : జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి*
*పశు గ్రాసం పక్క రాష్ట్రాలకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలి: ప్రభుత్వ విప్ కాపు రామ చంద్రా రెడ్డి*
అనంతపురము, డిసెంబరు 17 (ప్రజా అమరావతి);
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు భరోసా కేంద్రాల పనితీరుపై రైతుల్లో అవగాహన కల్పించాలని జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు సబ్సిడీ ధరల్లో అందించే ఆశయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యవస్థను తీసుకువచ్చారని, కియోస్కుల ద్వారా తమకు కావాల్సిన వాటిని ఆర్డర్ చేసుకుని పొందే వెసులుబాటు గురించి రైతులందరికీ తెలిసేలా చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఆర్బీకే కేంద్రాలు మరింత ప్రో యాక్టివ్ గా పని చేయాలని, వ్యవసాయ సీజన్ ఆరంభానికి ముందే రైతులు వేసిన పంటలకు అనుగుణంగా తర్వాతి రోజుల్లో డిమాండ్ ఉండే ఎరువులు, పురుగుమందులకు ముందుగానే ఇండెంట్ కోరాలన్నారు.
శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశానికి రాజశేఖర్ రెడ్డి చైర్మన్ గా, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి వైస్ చైర్మన్ గా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ మరియు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.
కాపు రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పశుగ్రాసం కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతోందని.. కర్ణాటక తరహాలో మన రైతులకు లబ్ది చేకూర్చేలా ఇక్కడే పశు గ్రాసానికి అధిక ధర అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో పశువులకు గ్రాసం దక్కాలని, అదే సమయంలో కర్ణాటకలో గడ్డికి అధిక ధర ఎలా దక్కుతోందో అధ్యయనం చేసి అదే లబ్ది జిల్లాలోని రైతులకు కలిగేలా చూడాలన్నారు. అదే సమయంలో భైరవాని తిప్ప ప్రాజెక్టు నిండుకుండలా మారినప్పటికీ కాల్వల్లో పూడిక కారణంగా రైతులకు నీరు అందించడం ఇబ్బందిగా మారనుందని, ఉపాధి హామీ పనుల కింద పూడిక తీత పనులు చేపట్టి చేపట్టాలని కోరారు.
జిల్లా కలెక్టర్ మరియు జిల్లా అగ్రి అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ ఎస్.నాగలక్ష్మి మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం విషయమై ప్రభుత్వానికి నివేదికలు పంపామన్నారు. జిల్లాలో ఏర్పడ్డ ప్రత్యేక పరిస్థితులపై ప్రజా ప్రతినిథులు, రైతుల అభిప్రాయాలను సైతం ప్రభుత్వానికి తెలిపి రైతులకు న్యాయబద్ధమైన పరిహారం దక్కేలా చూస్తామన్నారు.
జిల్లాలో పెరిగిన నీటి వసతి కారణంగా రైతులు వరి పండించేందుకు మొగ్గు చూపే అవకాశం ఉందని.. వరి తప్ప మరో పంట వేయలేని భూముల్లో మాత్రమే వరి పంటను పరిమితం చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ చంద్రానాయక్, విద్యుత్ శాఖ ఎస్ఈ నాగరాజు, నాబార్డ్ ఏజీఎం ఉషా మధుసూదన్, లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట రాజు, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, మండల స్థాయి అగ్రి అడ్వైజరీ బోర్డు చైర్మన్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment