కిసాన్ క్రాఫ్ట్ సంస్థ వారు వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ పరిశ్రమను జిల్లాలోని ప్రభగిరిపట్నంలో నెలకొల్పడం మనందరికీ గర్వకారణం


నెల్లూరు, జనవరి 8 (ప్రజా అమరావతి) : దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన కిసాన్ క్రాఫ్ట్ సంస్థ వారు వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ పరిశ్రమను జిల్లాలోని ప్రభగిరిపట్నంలో నెలకొల్పడం మనందరికీ గర్వకారణం, శుభ పరిణామంగా జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 

 శనివారం ఉదయం పొదలకూరు మండల పరిధిలోని ప్రభగిరిపట్నంలో నూతనంగా ఏర్పాటుచేసిన కిసాన్ క్రాఫ్ట్ వ్యవసాయ యంత్ర పరికరాల తయారీ కర్మాగారాన్ని తిరుపతి పార్లమెంటుసభ్యులు శ్రీ గురుమూర్తి, సర్వేపల్లి శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంత పెద్ద పరిశ్రమ మన జిల్లాలో నెలకొల్పడం వల్ల ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని చెప్పారు. స్థానికంగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని మన ప్రభుత్వం చట్టం చేసిందని, దీంతో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఇలాంటి చట్టం దేశంలో మరెక్కడా కూడా అమలులో లేదన్నారు. యువతీ యువకులు బాగా విద్యనభ్యసించి ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కృష్ణపట్నం, ముత్తుకూరు, మేనకూరు, తడ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే అనేక పరిశ్రమల ద్వారా జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. గడిచిన రెండేళ్లలో జిల్లాలో 20 భారీ పరిశ్రమలు, 300కు పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటయ్యాయన్నారు. వీటి ద్వారా ఇప్పటికే సుమారు 20 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఈ ఏడాదిలో మరో 18 భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, చెన్నై-బెంగళూరు, వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా పూర్తవుతాయని పేర్కొన్నారు. గత సంవత్సరం ప్రకృతి వైపరీత్యాల వల్ల అన్నదాతలు చాలా నష్టపోయారని, వారందరూ ఈ సంవత్సరం పంటలు పుష్కలంగా పండించి ఆర్థికంగా లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. ఇటీవల సంభవించిన వరదలకు నష్టపోయిన రైతాంగానికి 30 వేల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై సరఫరా చేసి అన్ని విధాల ఆదుకున్నామని, త్వరలోనే ఇసుక మేటలు వేసిన పొలాలకు సంబంధించి నష్ట పరిహారం రైతుల ఖాతాలకు జమ చేస్తామన్నారు. ఈ కిసాన్ క్రాఫ్ట్ పరిశ్రమ మరింత విస్తరించి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. 

  తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ చిన్న చిన్న పరికరాలకు చైనా వంటి దేశాలపై ఆధారపడుతున్న మనకు మన ప్రాంతంలో పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో వ్యవసాయ యంత్ర పరికరాలను తయారుచేయడం, స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక్కడ తయారైన యంత్ర పరికరాలను ఇతర దేశాలకు సరఫరా చేయడం వల్ల విదేశీ మారక ద్రవ్యం కూడా ఆర్జించవచ్చన్నారు. ఈ సంస్థ యంత్ర పరికరాలతో పాటు నాణ్యమైన విత్తనాల తయారీ పై కూడా దృష్టి పెడతామని చెప్పడం శుభ పరిణామంగా పేర్కొన్నారు. ఇప్పటికే ఇక్కడ 189 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించారని, మరో 300 మందికి ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉందని యాజమాన్యం చెప్పడం సంతోషదాయకమన్నారు.  శాసనసభ్యులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ 46 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతో కిసాన్ క్రాఫ్ట్ కర్మాగారాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంతో రైతులకు, యువకులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఇక్కడ ఇంటర్ కల్టివేటర్లు, డీజల్, పెట్రోల్ ఇంజన్లు, వాటర్ పంపులు మొదలైన యంత్ర పరికరాలు తయారు చేస్తారన్నారు. ముందుగా కిసాన్ క్రాఫ్ట్ ఎండి శ్రీ రవీంద్ర కుమార్ అగర్వాల్ సంస్థ ఉద్దేశాలను, ప్రయోజనాలు క్లుప్తంగా వివరించారు.

  ఈ కార్యక్రమంలో పొదలకూరు పిఎసిఎస్ అధ్యక్షులు శ్రీ గోపాల్ రెడ్డి, కిసాన్ క్రాఫ్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర కుమార్ అగర్వాల్, సీఈవో అంజి ప్రకాష్ చితారియా, సి ఎఫ్ ఓ శ్రీ అజయ్ కుమార్, ప్రాజెక్ట్ మేనేజర్ కుమారస్వామి, ఇంచార్జ్ ఎండిఓ శ్రీ నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


Comments