సిపిఐ ఆద్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు...



సిపిఐ ఆద్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు...



జగ్గయ్యపేట (ప్రజా అమరావతి):  73వ భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కోదాడ రోడ్డులో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ( సీపీఐ) కార్యాలయంలో  సిపిఐ పట్టణ కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది జూనెబోయిన శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అన్నింటిలో కెల్లా భారత రాజ్యాంగం చాలా గొప్పదని అభివర్ణించారు. అటువంటి రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన రోజునే గణతంత్ర దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్  బి. ఆర్.అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి వివరించారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహోన్నతమైన వ్యక్తులను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలని సూచించారు. భారత దేశ భవిష్యత్ మొత్తం యువత చేతుల్లోనే ఉందని, కేవలం సంపాదనే ధ్యేయంగా గాకుండా భారత దేశ ఉన్నతికి పాటుపడాలని కోరారు. సోషల్ మీడియాలో వస్తున్న పలు అంశాలకు ఆకర్షితులై నేటి యువత తమ భవిష్యత్ ను పాడుచేసుకోవటం ఆందోళన కరంగా ఉందని అన్నారు. సెల్ ఫోన్లకు, లాప్ టాప్ లకు అంకితమైన యువకులకు జాతీయ నాయకుల గురించి తెలియక పోవటం, దేశ భవిష్యత్ గురించి పట్టించుకోక పోవటం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా యువత మేల్కొని రాజ్యాంగ స్ఫూర్తితో, భారత దేశ చరిత్రను తెలుసుకోవాలని, జాతీయ నాయకుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అనంతరం కార్యక్రమం లో పాల్గొన్న వారికి స్వీట్లు పంచిపెట్టారు. మండల కార్యదర్శి అంబోజి శివాజి ఎఐటియుసి జగ్గయ్యపేట నియోజక వర్గ అధ్యక్ష కార్యదర్శులు మాశెట్టి రమేష్ బాబు, పోతుపాక వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు బోగ్యం నాగులు, ఎఐటియుసి నాయకులు చిట్యాల మల్లయ్య, బుర్రి మస్తాన్, ఏపురి భాస్కర్, వుప్పల వాసు, అన్నేపాగ శ్రీను, షరీఫ్, గాదే నాగేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

Comments