విజయవాడ (ప్రజా అమరావతి);
• ముఖ్యమంత్రి క్యాంప్ కార్యలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు
• సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సతీమణి శ్రీమతి భారతి
• గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా ఏర్పాట్లు
• రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలి.. ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి..
సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ప్రక్కన ఉన్న గోశాల వద్ద శుక్రవారం సంక్రాంతి సంబరాలు వైభవంగా జరిగాయి. రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతితో కలిసి ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని సంక్రాంతి సంబరాలను తిలకించారు. తెలుగుదనం ఉట్టిపడే విధంగా జరిగిన ఈ వేడుకలలో ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి సతీమణితో కలిసి గోశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టారు. ముఖ్యమంత్రి దంపతులకు మేళ తాళాలు వేదపండితులు ఆశీర్వచనాలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు. ముఖ్యమంత్రి గోపూజ, గోసేవలు చేసారు. వేద పండితులు శాలువతో ముఖ్యమంత్రిని సత్కరించి చిత్రపటాన్ని అందజేశారు.
గ్రామీణ వాతావరణం ఉట్టిపడే విధంగా గోశాల వద్ద ఎం ఎల్ ఏ చెవిరెడ్డి భాస్కర రెడ్డి చిన్న గ్రామాన్ని నిర్మించారు. ఆ గ్రామ వాతావరణంలో తులసి కోట, ధాన్యపు రాశులు, చెరుకు గడలు, రంగవల్లులు, ముత్యాల ముగ్గులు, భోగిమంటలు, గొబ్బెమ్మలు, డోలువాద్యాలు, కోలాటాలు, హరిదాసులు, గంగిరెద్దులు, అరిసెలు వండడం తదితర అంశాలను ఏర్పాటు చేసారు. కోలాటం, డోలు విన్యాసాలు, గంగిరెద్దుల విన్యాసాలు, నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంగ్లీ ఆలపించిన సంక్రాంతి గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతికి గుర్తుగా హరిదాసుకు ముఖ్యమంత్రి దంపతులు బియ్యం అందజేశారు. ప్రదర్శన ఇచ్చిన చిన్నారులు, కళాకారులను ఆశీర్వదించి ముఖ్యమంత్రి ఫోటోలు దిగారు.
ఈసందర్భంగా ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నానన్నారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. చెవిరెడ్డి భాస్కర రెడ్డి ముఖ్యమంత్రికి (జగన్) చిత్ర పటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖా మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, శాసన సభ్యులు మల్లాది విష్ణు, జోగి రమేష్, ఎం ఎల్ సి లేళ్ల అప్పి రెడ్డి, ఐ ఏ ఎస్ అధికారులు ప్రవీణ్ ప్రకాష్, పూనమ్ మాల కొండయ్య, వాణి మోహన్, పలువురు అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment