భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.


న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);


కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియాను కలిసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌:

భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలని కేంద్ర మంత్రిని కోరిన ముఖ్యమంత్రి.



ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, ప్రధానమంత్రితో సమావేశం అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సిందియాను కలిశారు. భోగాపురంలో నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధికి సహకరించాలంటూ ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రికి వినతి పత్రం సమర్పించారు.


పౌర విమానయాన శాఖ మంత్రికి ముఖ్యమంత్రి నివేదించిన అంశాలు: 


– దేశంలో విమానయాన రంగం అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక చొరవ, చేస్తున్న కృషికి నా అభినందనలు. 

– విభజన తర్వాత విమానయానంతో సహా, అన్ని రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం పదేళ్ల పాటు సహకరిస్తామని 2014–రాష్ట్ర పునర్విభజన చట్టంలో నాడు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అటు ఆర్థికపరంగానూ, ఇటు అనుమతుల విషయంలో కూడా తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు.

– భౌగోళిక  పరిస్థితుల దృష్ట్యా (పక్కనే తూర్పు నావికాదళం కేంద్రం ఉండడం) ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం విస్తరణకు అవకాశం లేకపోవడంతో, భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్న విషయం మీకు తెలిసిందే.

– రాష్ట్రానికి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. రాష్ట్రంలో అతి పెద్ద నగరం విశాఖపట్నంతో పాటు, పరిసర ప్రాంతాల అభివృద్ధిలో ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమైంది.


భోగాపురం వద్ద గ్రీన్‌ఫీల్డ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్ణీత వ్యవధి (3 ఏళ్లు)లో పూర్తి చేసే విధంగా సహాయ, సహకారాలు అందించాలని కోరుతున్నాను... అని సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు.

Comments