*ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లను వర్చువల్ విధానంలో క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించి ప్రజలకు అంకితం చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*రాష్ట్రవ్యాప్తంగా రూ.426 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 93,600 ఎల్‌పీఎం సామర్ధ్యం గల 144 పీఎస్‌ఏ ప్లాంట్లతో సహా క్రయోజనిక్ ఆక్సిజన్ కంటైనర్లు, ఎల్‌ఎంఓ ట్యాంకులు, ఆక్సిజన్ పైపులైన్లు ఇతర మౌలిక సదుపాయాలను ప్రారంభించిన సీఎం*
అమరావతి (ప్రజా అమరావతి);
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే....:*
ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి దేవుడి దయతో శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 144 ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్‌ఏ) ప్లాంట్లను అంటే సొంతంగా ఆక్సిజన్ తయారు చేసుకునే ప్లాంట్లను ఇవాళ ప్రారంభోత్సవం చేస్తున్నాం.
*247 సొంత ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్లు*
కేంద్ర ప్రభుత్వ సహకారంతో 32 పీఎస్‌ఏ ప్లాంట్లను జాతికి అంకితం చేశాం. ఈ 144 ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నెలకొల్పి జాతికి అంకితం చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఆక్సిజన్ మనమే సొంతంగా జనరేట్ చేసే పరిస్థితుల్లోకి మనం తీసుకున్న చర్యలు ఫలాలనిస్తున్నాయి. ఇవికాక 100 పడకల పైగా ఉన్న మరో 71 ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా ఆక్సిజన్ సొంతంగా ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగించే విధంగా పీఎస్‌ఏ ప్లాంట్లు నెలకొల్పడానికి ప్రభుత్వమే 30 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ ఈ ఆసుపత్రులకు చేయూతనిస్తున్నాం.
ఇవన్నీ పూర్తైతే.. అక్షరాల 247 చోట్ల సొంతంగా ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఉన్నట్టు అవుతుంది.
*ఇది గొప్ప కార్యక్రమం
*
కోవిడ్ సమయంలో ఇది చాలా గొప్ప కార్యక్రమం. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఆక్సిజన్ కొరత వల్ల ఎలా ఇబ్బంది పడ్డామో మనం చూశాం. కోవిడ్ కారణంగా వైరస్ శ్వాసమీద, ఊపిరి తిత్తులమీద ప్రభావం చూపింది, దేశం మొత్తం మీద ఆక్సిజన్ కొరత ఏర్పడినప్పుడు ఏ రకమైన పరిస్థితులు వచ్చాయో మనం చూశాం.
సెకండ్‌వేవ్‌లో నేర్చుకున్న పాఠాలనుంచి తీసుకున్న చర్యల కారణంగా ఈ రోజు ఈ మెరుగైన పరిస్థితిలోకి వచ్చాం. గతంలో సెకండ్ వేవ్ కోవిడ్‌లో ఏకంగా ఆక్సిజన్ ట్యాంకర్లను విమానాల్లో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. దూర ప్రాంతాల నుంచే కాకుండా విదేశాలనుంచి కూడా ఆక్సిజన్‌ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్రయోజనిక్ ట్యాంకుల్లో విదేశాల నుంచి షిప్పుల్లో కూడా తరలించాల్సి వచ్చింది.
*నిమిషానికి 44 వేల లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి...*
అలాంటి పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని సన్నద్ధంగా ఉంచేందుకు ప్రతి ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ కొరత రాకుండా తగిన చర్యలను తీసుకున్నాం. రూ.426 కోట్లు ఖర్చు చేసి.. నిమిషానికి 44వేల లీటర్ల మెడికల్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే 144 ప్లాంట్లను ఈ రోజు ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నాం. దీంతో మొత్తం 176 పీఎస్‌ఏ ప్లాంట్లను ప్రారంభించుకున్నట్లవుతుంది.
కోవిడ్‌వచ్చిన 2 ఏళ్లకాలంలోనే.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతున్నప్పటికీ ప్రజలు ఇబ్బంది పడకూడదు, మంచి జరగాలన్న ఆరాటంతో వారికి సంక్షేమాన్ని అందిస్తూ, నాడు – నేడు ద్వారా ఆస్పత్రులను, స్కూళ్లను బాగు చేసుకుంటున్నాం.
దీంతోపాటు గ్రామ స్ధాయిలో ఆర్బీకేలతో వ్యవసాయంలోనూ విప్లవాత్మక చర్యలు చేపట్టాం. వైద్య రంగంలో చూస్తే... కొత్తగా నెలకొల్పే పీఎస్‌ఏ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు ఆస్పత్రిలో సివిల్, ఎలక్ట్రికల్ పనులు, ఇతర మరమ్మత్తులు చేశాం.
*వైద్య రంగం– సమూల మార్పులు*
లిక్విడ్‌మెడికల్ ఆక్సిజన్ రవాణా, నిల్వకోసం రూ.15 కోట్ల వ్యయంతో 20 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న 25 క్రయోజనిక్ ట్యాంకర్లను కూడా కొనుగోలు చేశాం. అవన్నీ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులలో దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో 24,419 బెడ్లకు నేరుగా ఆక్సిజన్‌పైపులైన్లు కూడా ఏర్పాటు చేశాం. రూ.31 కోట్ల వ్యయంతో 399 కిలోలీటర్ల సామర్ధ్యం గల 35 ఎల్‌ఎంఓ ట్యాంకులు, 390 కిలోలీటర్ల సామర్ధ్యం గల 39 ఎల్‌ఎంఓ ట్యాంకులు మొత్తంగా 74 ఎల్‌ఎంఓ ట్యాంకులు కొనుగోలు చేసి కోవిడ్‌ను ఎదుర్కునేందుకు వాటిని అందుబాటులో పెట్టాం.
ఎలాంటి వేవ్‌వచ్చినా సన్నద్ధంగా ఉండేందుకు వీలుగా ఈ పనులు చేపట్టాం. మరో రూ.64 కోట్లతో 183 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశాం.
*20 పీడీయాట్రిక్ కేర్ సెంటర్లూ...*
ఆక్సిజన్ సపోర్ట్ బెడ్స్‌తో కూడిన... చిన్నపిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు 20 పడకల పీడియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశాం.
చిన్నపిల్లలకు ఇంకా అవసరం వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మరికొన్ని లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకర్లను ఏర్పాటు చేస్తున్నాం. దీనికోసం రూ.8 కోట్ల మంజూరు చేసి, 230 కిలోలీటర్ల సామర్ధ్యం గల 23 ఎల్‌ఎంఓ ట్యాంకులు కావాలంటే అవి కూడా మంజూరు చేశా. ఇవి ప్రస్తుతమున్న 74 ఎల్‌ఎంఓ ట్యాంకులకు అదనంగా వస్తాయి.
*రోజుకు లక్ష మందికి పరీక్ష చేసే విధంగా...*
గతంలో ఒక్క వీఆర్‌డీఎల్‌ల్యాబ్ కూడా మనకు ఉండేది కాదు.
టెస్టులకోసం హైదరాబాద్, పుణేలకు శ్యాంపిల్స్ పంపించాల్సిన పరిస్థితి ఉండేది. అలాంటిది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీపీసీఆర్ టెస్టుల సైతం చేయగలిగే 20 ఆధునిక వైరల్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం.
దీనికి అదనంగా మరో 19 ల్యాబ్‌లు కూడా సిద్ధం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ట్రూనాట్ ల్యాబ్‌లతో కలిపితే మొత్తం 150 ల్యాబ్‌లు సేవలందిస్తున్నాయి. రోజుకు లక్షమందికి టెస్టులు చేసే పరిస్థితి ఉంది.
*జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్*
వీటన్నింటితో పాటు ఒమిక్రాన్ నిర్ధారణకు కోసం మనదగ్గర మరింత అప్‌గ్రేడ్ ల్యాబ్ ఉంటేనే చేయగలుగుతామని చెపితే... జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం. దేశంలో కేరళ తర్వాత విజయవాడలోనే ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేశాం. ఇది కూడా గొప్ప ముందడుగు.
*వ్యాక్సినేషన్*
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడ్డ వారిలో 4,21,13,722 మందికి అంటే 100 శాతం వ్యాక్సినేషన్ చేశాం. ఇందులో రెండు డోసులు 3,14,01,740 మందికి వ్యాక్సినేషన్ చేశాం. అంటే రెండుడోసులు కూడా దాదాపు 80శాతం మందికి ఇచ్చాం.
*15–18 ఏళ్లు ఉన్నవారికి కూడా వ్యాక్సినేషన్* కేంద్రం సూచనలతో 15 నుంచి 18 సంవత్సరాల వయస్సున్నవారికి కూడా వ్యాక్సినేషన్ చేస్తున్నాం. అందులో 24.4 లక్షల మందికి వ్యాక్సిన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే 20.02 లక్షల మందికి అంటే దాదాపు 82శాతం మందికి వ్యాక్సినేషన్ చేశాం.
దేశంలోనే అగ్రగామిగా ఉన్నాం.
*చివరిగా రెండు మాటలు..*
విభజన వల్ల హైదరాబాద్‌ను కోల్పోవడంతో రాష్ట్రంలో అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం ఉన్న సంస్థలు లేకుండా పోయాయి.
దేవుడి దయతో బ్రహ్మాండమైన వ్యవస్థ రాష్ట్రంలో ఉంది.
వాలంటీర్లు, గ్రామ, వార్డు, సచివాలయ వ్యవస్థ, ఆశా వర్కర్లు, అక్కడే రిపోర్టు చేసే విలేజీ క్లినిక్‌లు ఉన్నాయి. వీటి వల్ల ఇప్పటివరకూ
ఇంటింటికీ సర్వేలే దాదాపు 33 సార్లు జరిగాయి.
ఎవరికి లక్షణాలు ఉన్నా.. వారికి పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నాం.
ఎర్లీ ట్రేసింగ్.. ఎర్లీ టెస్టింగ్.. ఎర్లీ ట్రీట్మెంట్ ఆధారంగానే 33 సార్లు ఇంటింటికీ సర్వే ద్వారా లక్షణాలున్నవారికి చికిత్స అందిండం ద్వారా
కోవిడ్ మేనేజ్‌మెంట్లో మన రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇదొక విప్లవాత్మక మార్పు.
*ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్*
గ్రామ స్థాయిలోనే వైయస్సార్ హెల్త్‌క్లినిక్స్ కడుతున్నాం. 80 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకు వస్తున్నాం. కొత్తగా పీహెచ్‌సీలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రులు ఇవన్నీ కూడా నాడు – నేడు కార్యక్రమాలతో ఆధునీకరిస్తున్నాం. కొత్త 104,108లు మన కళ్లముందే తిరుగుతున్నాయి.
ప్రభుత్వ రంగంలోనే మరో 16 వైద్యకళాశాలలు, నర్సింగ్‌కాలేజీలు కడుతున్నాం.
ఇందులో 4 చోట్ల వేగంగా పనులు జరుగుతున్నాయి.
ఆరోగ్యశ్రీ పరిధిని పూర్తిగా పెంచాం. గతంలో 1000 వ్యాధులున్న పరిస్థితి నుంచి ఏకంగా 2434 వ్యాధులకు వైయస్సార్‌ఆరోగ్యశ్రీని వర్తింపు జేస్తూ... వైద్యం కారణంగా ఏ ఒక్కరూ కూడా అప్పులుబారిన పడాల్సిన అవసరం లేకుండా చూస్తున్నాం. దీంతో పాటు వైయస్సార్ ఆరోగ్య ఆసరాని కూడా తీసుకొచ్చాం. వైద్యం అయిపోయిన తర్వాత రెస్ట్ పీరియడ్‌లో పేషెంట్‌కు నెలకు రూ.5 వేలు చొప్పున ఇస్తూ తోడుగా నిలుస్తున్నాం. ఈ రకంగా వైద్య, ఆరోగ్య రంగంలో విపరీతమైన మార్పులు తీసుకొస్తున్నాం.
*39 వేల మంది వైద్య సిబ్బంది నియామకం*
ప్రతి ఆస్పత్రిలో ఉండాల్సిన సిబ్బందిని పెడుతున్నాం.
ఈ ఫిబ్రవరి చివరినాటికి 39 వేలమందిని పెడుతున్నాం. డాక్టర్లు, పారామెడిక్స్, నర్సులును పెడుతున్నాం. అందులో భాగంగా ఇప్పటికే 23 వేల మందిని పెట్టాం. 15వేల మంది ఏఎన్‌ఎంలు గ్రామ సచివాలయాల్లో విలేజీ క్లినిక్స్‌లలో కనిపిస్తున్నారు. టీచింగ్ ఆస్పత్రులలో 10 వేల మంది వైద్యులు, నర్సుల పోస్టులు రిక్రూట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మిగిలిన పోస్టులన్నీకూడా త్వరలోనే భర్తీచేస్తాం. ప్రతి ఆస్పత్రిలో కూడా ఎంతమంది డాక్టర్లు ఉండాలో ? ఎంత మంది నర్సులు ఉండాలో ? అంతమందినీ పెడుతూ వైద్య ఆరోగ్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇవ్వాలని... దేవుడి దయ ప్రజలందరి చల్లనీ దీవెనలు, ఆశీస్సులు మన ప్రభుత్వానికి ఎల్లకాలం ఉండాలని మనసారా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం వర్చువల్ విధానంలో 144 పీఎస్‌ఏ ప్లాంట్లను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి ఉపముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్(నాని), పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి(కోవిడ్ మేనేజిమెంట్ అండ్ వ్యాక్సినేషన్) ఎం రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జీ యస్ నవీన్ కుమార్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, ఏపీఐఐసీ వీసీ అండ్ ఎండీ జె వి యన్ సుబ్రమణ్యం, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
addComments
Post a Comment