కృష్ణదేవిపేట అల్లూరి స్మారక ప్రాంతాల సుస్ధిర అభివృద్ధికి చర్యలు



   కృష్ణదేవిపేట అల్లూరి స్మారక ప్రాంతాల సుస్ధిర అభివృద్ధికి చర్యలు

*  పార్కు ఆవరణలోని భవనాల స్థితిగతులను పరిశీలించిన ప్రభుత్వ ఉన్నతాధికార కమిటీ

*  సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరిన  జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం సభ్యులు

*  పటిష్ట భవనాల నిర్మాణానికై ప్రభుత్వానికి త్వరలో నివేదిక.

*  వివరాలు వెల్లడించిన ఉన్నతాధికార కమిటీ సభ్యులు


 నర్సీపట్నం,  జనవరి 5 (ప్రజా అమరావతి);


      విశాఖ జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవి పేట లోని అల్లూరి స్మారక ప్రాంతాన్ని పటిష్ట భవనాలతో సుస్థిర అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి త్వరలో నివేదిక పంపుతామని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నతాధికార కమిటీ వెల్లడించింది.

        జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు కృష్ణదేవిపేట  అల్లూరి స్మారక పార్కులో   గతంలో నిర్మించిన భవనాల  దుస్థితి పై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి,  కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి పంపిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తగు విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాల్సిందిగా ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

         ఆ మేరకు గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ మండలి ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాసరావు, పర్యాటక శాఖ జిల్లా  సీనియర్ మేనేజర్ జి దాసు, పురావస్తు శాఖ సహాయకుడు కే నరసింహ నాయుడు, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ చాణుక్య, అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్బారావు, టిసీఆర్టీఎం   అధికారి ఎన్. సీతారామయ్య తదితరులు బుధవారం కృష్ణదేవిపేట లోని అల్లూరి స్మారక ప్రాంతాన్ని సందర్శించారు.

ఈ ప్రాంగణంలో   కొద్ది నెలల క్రితం  నేలకూలిన సమావేశ మందిరం సీలింగ్ ను, అల్లూరి, గంటందొర సమాధుల పై కప్పు నుంచి పెచ్చులూడి పడుతున్న ప్రాంతాన్ని ప్రభుత్వ ఉన్నతాధికార కమిటీ సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందుకు దారితీసిన కారణాలను అల్లూరి సీతారామరాజు యువజన సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు, జాతీయ ఉపాధ్యక్షుడు పీవీ సత్యనారాయణ రావు తదితరులు అధికారులకు వివరించారు సుమారు ఐదెకరాల విస్తీర్ణంలో గల పార్క్ ప్రాంతాన్ని అధికారులు పరిశీలించి,అల్లూరి అభిమానులు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేయాల్సిన సదుపాయాల గురించి కూడా సంఘ సభ్యులతో చర్చించారు.


 ప్రభుత్వానికి త్వరలో నివేదిక.


   ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము కృష్ణదేవిపేట అల్లూరి స్మారక ప్రాంతాన్ని పరిశీలించామని,ఈ ప్రాంతంలో శిధిలమవుతున్న భవనాలు కల్పించాల్సిన సదుపాయాలు తదితర అంశాలను గుర్తించి ప్రభుత్వానికి త్వరలో నివేదిక అందజేస్తామని  గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.చాణుక్య తెలిపారు. కమిటీ సభ్యులు వెలిబుచ్చిన అభిప్రాయాలు అందజేసిన సూచనలను కూడా నివేదికలో పొందుపరిచి ప్రభుత్వానికి సమర్పిస్తామన్నారు.

      అల్లూరి స్మారక ప్రాంతాల సుస్థిర అభివృద్ధికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఇందుకోసం పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి తమ సంస్థ ద్వారా అందజేస్తామని గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ మండలి కి చెందిన ప్రొఫెసర్ ఎన్. శ్రీనివాసరావు తెలిపారు పర్యాటకులకు ఈ ప్రాంతంలో తగిన సదుపాయాలు కల్పించేందుకు కూడా ప్రాధాన్యత ఇస్తామని పర్యాటక శాఖ సీనియర్ మేనేజర్ జి దాసు అన్నారు పురావస్తు శాఖ  అల్లూరి స్మారక ప్రాంతాలను స్వాధీనం చేసుకోవాలంటే ప్రభుత్వం మరికొన్ని జీవోలను జారీ చేయాల్సి ఉంటుందని ఆ శాఖ సాంకేతిక సహాయకుడు కే నరసింహ నాయుడు తెలిపారు టిసీఆర్టీఎం  ద్వారా కేంద్ర నిధులతో అల్లూరి స్మారక ప్రాంతాల అభివృద్ధికి తగు చర్యలు తీసుకుంటున్నామని ఆ సంస్థ ప్రతినిధి ఎన్. సీతారామయ్య తెలిపారు.

         ఈ సందర్భంగా పార్క్ ఆవరణలో గల అల్లూరి సీతారామరాజు తల్లి సూర్యనారాయణమ్మ విగ్రహానికి ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ సహకారంతో ఏర్పాటుచేసిన షెల్టర్ ను  సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు లాంఛనంగా ప్రారంభించారు ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ లో సభ్యులైన అధికారులకు అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున జ్ఞాపికలు విజ్ఞాపన పత్రాలను పడాల వీరభద్రరావు వారికి అందించారు ఈ కార్యక్రమంలో సంఘ కార్యవర్గ ప్రతినిధులు లక్కాకుల బాబ్జి, శ్యామల వరలక్ష్మి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు

Comments