కేసులు పెరుగుతున్నాయ్.....అప్రమత్తంగా ఉండండి
ప్రతీఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించాలి
జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి
విజయనగరం, జనవరి 12 (ప్రజా అమరావతి) ః జిల్లాలో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి సూచించారు. ప్రతీఒక్కరూ కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఒక ప్రకటనలో కోరారు.
జిల్లాలో బుధవారం ఒక్కరోజే 212 కోవిడ్ కేసులు నమోదవ్వడంపట్ల కలెక్టర్ ఆందోళన వెలిబుచ్చారు. ముఖ్యంగా పండుగ వేళ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. విజయనగరం, కొత్తవలస, ఎస్‌కోట, గరుగుబిల్లి మండలాల్లో కేసులు ఎక్కువగా నమోదయ్యాయని, ఒక్క కేసు కూడా లేని మండలాల సంఖ్య తక్కువగానే ఉందని చెప్పారు. దాదాపు ప్రతీ మండలంలో కరోనా కేసులు నమోదవుతున్నాయని, ప్రజలంతా నిర్లక్ష్యాన్నివిడిచిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. ముక్కు, నోరు పూర్తిగా మూసి ఉంచేలా, తప్పనిసరిగా మాస్కును ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని, తరచూ చేతులను శానిటైజర్‌తో గానీ, సబ్బుతో గానీ శుభ్రం చేసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు, వృద్దులు, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడేవారు, హృద్రోగులు జన సమూహాలకు దూరంగా ఉండాలన్నారు. ఎంతో అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయవద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో, తగిన జాగ్రత్తలను తీసుకొని ప్రయాణించాలని సూచించారు.
జిల్లాలో ప్రస్తుతం జోరుగా వేక్సినేషన్ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. 15 ఏళ్లు నుంచి 17 ఏళ్ల లోపు వారిలో, ఇంకా చాలామంది మొదటి డోసును వేయించుకోవాల్సి ఉందన్నారు. ఇప్పటికే మొదటి డోసును వేసుకున్న ప్రతీఒక్కరూ, త్వరగా రెండో డోసును కూడా వేసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పైబడినవారికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, హెల్త్‌కేర్ సిబ్బందికి ఈ నెల 10 వ తేదీ నుంచి ప్రికాషన్ డోసును వేయడం జరుగుతోందని, దీనిని ప్రతీఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఎవరికైనా జ్వరం, దగ్గు, జలుబు ఉంటే ఆందోళన చెందకుండా, ఎఎన్ఎం లేదా ఆశావర్కర్‌కు సమాచారాన్ని ఇవ్వాలన్నారు. కోవిడ్ నిర్ధారణ అయినట్లయితే, ఆందోళన చెందకుండా వైద్య నిపుణుల సూచనల మేరకు హోమ్ ఐసోలేషన్లో ఉండి, తగిన వైద్యసహాయాన్ని పొందాలని, లేదా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం పొందాలని సూచించారు. భయపడి పొరుగు జిల్లాలోని పెద్దపెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేదని, వైద్యాన్ని అందించేందుకు జిల్లాలోనే తగిన ఏర్పాట్లను చేయడం జరిగిందని, ఆసుపత్రులు సిద్దంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.
addComments
Post a Comment