ప్రతి ఒక్కరిలోనూ నిగూఢమైన శక్తి ఉంటుందని, యువత గా ఉన్నప్పుడే ఆ శక్తిని తెలుసువాలి

 


నెల్లూరు, జనవరి 12 (ప్రజా అమరావతి) :-


              ప్రతి ఒక్కరిలోనూ నిగూఢమైన శక్తి ఉంటుందని, యువత గా ఉన్నప్పుడే  ఆ శక్తిని తెలుసుకొని


   పట్టుదల, క్రమశిక్షణ తో ఎవరైతే కృషి చేస్తారో వారే జీవితంలో  విజయం సాధిస్తారని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరేందర్ ప్రసాద్ తెలిపారు.


      బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా యువజన సంక్షేమ శాఖ , సెట్నెల్  నెల్లూరు వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తోలుత జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్రీ హరేందర్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, వివేకానందుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వివేకానందుని జయంతి రోజున జాతీయ యువజన దినోత్సవం జరుపుకోవటం ఎంతో సంతోషదాయకమన్నారు. దేశ భవిష్యత్తు అంతా యువత చేతిలోనే ఉందన్నారు. యువత తమ శక్తియుక్తులను క్రోడీకరించి కేవలం వ్యక్తిగతంగానే కాకుండా సామాజిక హితంగా ఆలోచించాలన్నారు. వివేకానందుని జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. వారి స్ఫూర్తితోనే బాపూజీ, నేతాజీ వంటి నేతలు మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టారన్నారు. వారి త్యాగాలను ఎన్నటికీ మరువరాదన్నారు. యువత ఎల్లప్పుడూ పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఏదైనా సందర్భంలో  ఓడిపోవచ్చుగానీ, అందులో నుండి పాఠాలు నేర్చుకున్నవారే విజయతీరాలకు  చేరతారన్నారు.  ఇందుకు  యుక్తవయసులో ఆటలు ఎంతో నేర్పిస్తాయన్నారు. ప్రతి ఓటమి రాబోయే గెలుపుకు సూచికగా భావించాలన్నారు.


       జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీ విదేహ్ ఖరే మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారు కొద్దికాలంపాటే జీవించినా ప్రపంచంలో ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారన్నారు.  ప్రతి ఒక్క యువత జీవితంలో లక్ష్యం పెట్టుకొని అది సాధించే వరకూ పోరాడాలన్నారు.


        జిల్లా సంయుక్త కలెక్టర్ శ్రీమతి రోజ్ మాండ్ మాట్లాడుతూ స్వామి వివేకానందుల వారి జీవితం ప్రతి ఒక్కరికి గొప్ప ఆదర్శమన్నారు. వారు సమాజానికి ఉపయోగపడే ఎన్నో ప్రబోధాలు చేశారన్నారు. పడిలేచే కెరటంలా ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు.  బలమే జీవితం బలహీనమే మరణమనే వారి ప్రబోధం అందరికీ ఆదర్శనీయమన్నారు. మానసిక బలమే మనల్ని ముందుకు నడిపిస్తోందన్నారు.


 


        జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు మాట్లాడుతూ స్వామి రామానంద తీర్థ శిష్యరికం తో నరేంద్రుడు వివేకానందుడిగా మారారని, వారు గొప్ప తాత్వికులని, జీవితంలో అపజయాలు ఎదురైనా కుంగిపోకుండా ముందుకు సాగాలని యువతను కోరారు. నెహ్రూ యువ కేంద్ర నెల్లూరు జిల్లా కో ఆర్డినేటర్ శ్రీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ యువత కోసం పరితపించిన వ్యక్తి వివేకానందుల వారని, యువత తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అని కలలుగన్న వ్యక్తని కొనియాడారు.


           ఈ కార్యక్రమంలో సెట్నెల్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి శ్రీ డి. పుల్లయ్య , సెట్నెల్ మేనేజర్ శ్రీమన్నారాయణ పాల్గొన్నారు. అనంతరం   ఈనెల 6, 7 తేదీలలో ఏసీ సుబ్బారెడ్డి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన కబడ్డీ, కోకో ,వాలీబాల్ పోటీలలో విజేతలకు జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందచేశారు.  


 


(

Comments