జిల్లా అభివృద్దికి సమన్వయంతో కృషి చేద్దాం
మార్చి నెలాఖరుకి రూ.440 కోట్లు ఖర్చు చేయాలి
జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపు
ఒక్క రూపాయి కూడా లేప్స్ అవ్వకూడదు
డ్వామాలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి
ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనులపై సమీక్ష
విజయనగరం, జనవరి 08 (ప్రజా అమరావతి) ః
ప్రభుత్వ శాఖలన్నీ పరస్పరం సహకరించుకుంటూ, జిల్లా అభివృద్దికి సమన్వయంతో కృషి చేద్దామని జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. అందుబాటులో ఉన్న ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులు రూ.440 కోట్లను మార్చి నెలాఖరునాటికి ఖర్చు చేసేవిధంగా ప్రణాళికను రూపొందించాలని ఆయన కోరారు. అందుబాటులో ఉన్న మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్లో ఒక్క రూపాయి కూడా లేప్స్ అవ్వకూడదని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎ.సూర్యకుమారి స్పష్టం చేశారు. కన్వర్జెన్సీ పనులకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వడానికి, సందేహాలను నివృత్తి చేయడానికి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేయాలని డ్వామాను కలెక్టర్ ఆదేశించారు.
ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధుల వినియోగంపై కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ముందుగా డ్వామా పిడి జి.ఉమాపరమేశ్వరి మాట్లాడుతూ, జిల్లాలో ఉపాది వేతనదారులకు ఈ ఏడాది 2.68 కోట్ల పనిదినాలను కల్పించాలన్నది లక్ష్యం కాగా, లక్ష్యాన్ని అధిగమించి 111 శాతం పనిదినాలను కల్పించినట్లు తెలిపారు. కన్వర్జెన్సీ పనులకు సంబంధించి జిల్లాలో ఈ ఏడాది రూ.440 కోట్లు వరకు నిధులను వినియోగించుకొనే అవకాశం ఉందని, ఇప్పటివరకు సుమారు రూ.78కోట్ల విలువైన పనులను నిర్వహించడం జరిగిందని చెప్పారు. మార్చిలోగా మరో రూ.360 కోట్లను ఖర్చు చేయాల్సి ఉందన్నారు. మారిన కొత్త సాఫ్ట్‌వేర్ గురించి వివరించారు. అందుబాటులో ఉన్న నిధుల వినియోగంపై సుదీర్ఘంగా చర్చించారు.
జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ, ఈ ఏడాది ఎట్టిపరిస్థితిలోనూ కన్వర్జెన్సీ నిధులు మురిగిపోవడానికి వీల్లేదని ఆదేశించారు. ఒక్క రూపాయి లేప్స్ అయినా, సంబంధిత అధికారులదే బాధ్యత అని, వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిధుల వినియోగానికి సంబంధించి ఏ సమస్య ఉత్పన్నమైనా, తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి, సందేహాల నివృత్తి కోసం జిల్లా స్థాయిలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలని డ్వామా పిడిని ఆదేశించారు. పాత పనులను తక్షణమే ప్రారంభించాలని, కొత్త పనుల ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. జగనన్న ఇళ్ల నిర్మాణాన్ని కూడా పర్యవేక్షించాలని, ఉపాధినిధులతో కాలనీలకు త్వరగా రహదారులు వేయాలని చెప్పారు. మండల స్థాయిలో అధికారులు పరస్పరం సమన్వయంతో ముందడుగు వేయాలని సూచించారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా, వేక్సినేషన్‌పై ఎంపిడిఓలు ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.
జెడ్‌పి ఛైర్మన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉపాధిహామీ కన్వర్జెన్సీ నిధులను సకాలంలో, సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా, జిల్లాను అభివృద్ది పథాన నడపాలని కోరారు. గత రెండేళ్లు కోవిడ్ కారణంగా సమయం, నిధులు వృథా అయ్యాయని, ఈ సారి అలా జరగకుండా, ఇప్పటినుంచే పనులను యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మన విజ్ఞప్తి మేరకు, పాత పనులను కొనసాగించుకొనేందుకు ప్రభుత్వం అనుమతించిందని, అలాగే కొత్త ప్రతిపాదనలకు కూడా ఆమోదం లభించిందని చెప్పారు. సంబంధిత ప్రజాప్రతినిధులను సంప్రదించి, ఈ పనులను ప్రాధాన్యతలకు అనుగుణంగా పూర్తి చేయాలని సూచించారు. అన్ని రకాల పనులనూ పర్యవేక్షించాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అసిస్టెంట్లపై ఉందని, వీరికి అవగాహనా కార్యక్రమాలను నియోజకవర్గాల వారీగా నిర్వహించాలని సూచించారు. ఈ ఏడాది మార్చిలోగా జిల్లాలోని అన్ని సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. సిమ్మెంటు, ఇసుక తదితర నిర్మాణ సామగ్రికి కొరత రాకుండా చూస్తామని, పనులను వేగంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. నిధులు కూడా అందుబాటులో ఉన్నాయని, వీటిని వినియోగించుకోవడంలో జాప్యం చేయవద్దని కోరారు. గ్రామ పంచాయితీల్లో నామినేటెడ్ పనులకు కూడా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే సిమ్మెంటు సరఫరా చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని, అధికారులకు ఛైర్మన్ సూచించారు.
ఈ సమావేశంలో జెడ్‌పి సిఇఓ టి.వెంకటేశ్వర్రావు, పంచాయితీరాజ్ ఎస్ఇ గుప్త, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్ఇ కెవి శివానందకుమార్, ఎంపిడిఓలు, పిఆర్ ఇఇలు, డిఇలు, ఏఈలు, డ్వామా ఎపిఓలు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment