తోట‌ప‌ల్లికి మ‌హ‌ర్ధ‌శ‌.

 


తోట‌ప‌ల్లికి మ‌హ‌ర్ధ‌శ‌.
* రూ.63.63 కోట్ల అంచ‌నాతో ప్యాకేజీ -2లో మిగులు ప‌నులు

* ప్రారంభించ‌నున్న‌ నీటిపారుద‌ల శాఖ మంత్రి అనిల్ కుమార్


విజ‌య‌న‌గ‌రం, ఫిబ్ర‌వ‌రి 19 (ప్రజా అమరావతి) ః ఉమ్మ‌డి జిల్లాల‌కు సంబంధించిన స‌ర్దార్ గౌతు లచ్చ‌న్న తోట‌ప‌ల్లి బ్యారేజీ ప్రాజెక్టుకు మ‌హ‌ర్ధ‌శ వ‌చ్చింది. ఇది వ‌ర‌కే రూ.59.58 కోట్ల‌తో కొన్ని మిగులు ప‌నుల‌కు ప్రారంభోత్స‌వం జ‌ర‌గ్గా.. మ‌రో రూ.63.63 కోట్ల‌తో ప్యాకేజీ -2లో మిగులు ప‌నులు ప్రారంభానికి నోచుకోనున్నాయి. విజ‌య‌నగ‌రం, శ్రీకాకుళం జిల్లాల్లోని మొత్తం 1.95 ల‌క్ష‌ల ఎక‌రాల‌ ఆయక‌ట్టుకు నీరందించే తోట‌ప‌ల్లి బ్యారేజీ ప్రాజెక్టు ప్యాకేజీ -2లో మిగిలిన ప‌నుల‌కు నేడు ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. పూస‌పాటిరేగ మండ‌లం గుండ‌పురెడ్డిపాలెం వ‌ద్ద రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ సంబంధిత ప‌నుల‌కు ఆదివారం శంకుస్థాప‌న చేయ‌నున్నారు. ఈ మేర‌కు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు ప‌రిధిలోకి రాజాం డివిజ‌న్‌, పార్వ‌తీపురం డివిజ‌న్‌లు వ‌స్తాయి. ఈ పనుల‌కు సంబంధించి బొబ్బిలి మండ‌లం పిరిడి వ‌ద్ద బ్రాంచి కాలువ‌ల నిర్మాణ‌ ప‌నుల‌కు మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ ఇటీవ‌ల కాలంలో శంకుస్థాప‌న చేశారు. రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ రూ.58.59 కోట్ల‌ను ఈ ప‌నుల కోసం మంజూరు చేసింది. నేడు ప్రారంభం కాబోయే రాజాం డివిజ‌న్ ప‌రిధిలో మిగిలిన ప‌నుల‌కు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ప్రారంభోత్స‌వం చేయ‌నున్నారు. 


రెండు జిల్లాల్లో క‌లిపి తోట‌ప‌ల్లి ఆయక‌ట్టు సుమారు 1,95,221 ఎక‌రాలు కాగా ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌కాకుళం జిల్లాలో ఏడు మండ‌లాల్లోని 42,399 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సంబంధించి ప‌నులు పూర్త‌య్యాయి. అలాగే విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఏడు మండలాల్లోని 30,454 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సంబంధించిన ప‌నులు కూడా పూర్తయ్యాయి. ప్రాజెక్టు మొత్తం వ్య‌యం రూ.1127.58 కోట్లు కాగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ.853.89 కోట్లు వెచ్చించి వివిధ ప‌నులు పూర్తి చేశారు. కుడి ప్రధాన కాలువ‌, బ్రాంచి కాలువ‌ల ప‌నులు పూర్తయ్యాయి. సాంకేతిక కారణాల వ‌ల్ల ప్యాకేజీ -2 రాజాం డివిజ‌న్ ప‌రిధిలో మిగిలిపోయిన ప‌నుల‌కు రూ.63.63 కోట్ల అంచ‌నా వ్యయంతో ప‌నులు చేప‌ట్టేందుకు అధికార యంత్రాంగం చ‌ర్య‌లు చేప‌ట్టింది. దానిలో భాగంగా పార్వ‌తీపురం డివిజన్‌లో ప‌నుల‌కు సంబంధించి పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్రారంభోత్స‌వం చేయ‌గా రాజాం డివిజ‌న్ పరిధిలో మిగులు ప‌నుల‌కు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్ చేతుల మీదుగా అట్ట‌హాసంగా ప్రారంభోత్స‌వం జ‌ర‌గ‌నుంది. 


*పెర‌గ‌నున్న ఉమ్మ‌డి ఆయ‌క‌ట్టు*


శ్రీ‌కాకుళం జిల్లాలో ప్యాకేజీ -2లో ఇప్ప‌టి వ‌ర‌కు 42,399 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సంబంధించిన ప‌నులు పూర్తి కాగా ఇప్పుడు మిగులు ప‌నుల్లో భాగంగా 21,534 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సంబంధించిన పనులు చేస్తారు. అలాగే విజ‌య‌న‌గ‌రం జిల్లాకు వ‌చ్చే స‌రికి ఇప్ప‌టి వ‌ర‌కు 30,454 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సంబంధించిన ప‌నులు పూర్తికాగా ఇప్పుడు చేప‌ట్టే వాటిలో 16,313 ఎక‌రాల ఆయ‌క‌ట్టుకు సంబంధించిన ప‌నులు జ‌రుగుతాయి. ఈ ప్యాకేజీ -2లో ప‌నులు పూర్త‌యితే శ్రీ‌కాకుళం జిల్లా రేగ‌డి ఆముదాల వ‌ల‌స‌, వంగ‌ర‌, సంత‌కవిటి, రాజాం, జి. సిగ‌డాం, లావేరు, ర‌ణ‌స్థ‌లం మండ‌లాల్లోని 170 గ్రామాల్లో 63,933 ఎక‌రాల‌కు, విజ‌య‌న‌గ‌రం జిల్లా తెర్లాం, బ‌లిజిపేట‌, చీపురుప‌ల్లి, గ‌రివిడి, నెల్లిమ‌ర్ల‌, గుర్ల‌, పూస‌పాటిరేగ మండ‌లాల పరిధిలో 124 గ్రామాల్లోని 46,767 ఎక‌రాల‌కు సాగు నీరు అందుతుంది.


నేడు పూస‌పాటిరేగ మండ‌లం గుండ‌పురెడ్డిపాలెం వ‌ద్ద జ‌రిగే కార్య‌క్ర‌మానికి రాష్ట్ర నీటిపారుద‌ల శాఖ మంత్రి పి. అనిల్ కుమార్, పుర‌పాల‌క శాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఉప ముఖ్య‌మంత్రి పాముల పుష్ప శ్రీ‌వాణి, జిల్లా ప‌రిష‌త్ ఛైర్మ‌న్ మ‌జ్జి శ్రీ‌నివాస‌రావు, ఎంపీ బెల్లాన చంద్ర‌శేఖ‌ర్‌, స్థానిక ఎమ్మెల్యే బ‌డ్డుకొండ అప్ప‌ల‌నాయుడు, రెండు జిల్లాల‌కు చెందిన ప్రజాప్ర‌తినిధులు, అధికారులు హాజ‌రుకానున్న‌ట్లు జిల్లా నీటిపారుద‌ల శాఖ అధికారులు తెలిపారు.