*పంచాయతీల్లో వాలంటీర్ల పెత్తనమేంటి*
చంద్రబాబునాయుడు.
విజయవాడ (ప్రజా అమరావతి)
గ్రామ సచివాలయాలు అంటే జగన్ రెడ్డి ఆఫీసులు కాదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. పంచాయతీల్లో వాలంటీర్ల పెత్తనమేంటని ప్రశ్నించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో సర్పంచ్‌లతో సదస్సు నిర్వహించిన ఆయన.. వాలంటీర్లు అజమాయిషీ చేస్తే సహించవద్దని సూచించారు. ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలే సర్పంచ్‌కు కూడా ఉంటాయనే విషయం గుర్తించాలన్నారు. 14, 15వ ఆర్థిక సంఘం పంచాయతీలకు ఇచ్చిన నిధులను ప్రభుత్వం మళ్లించడం దారుణమన్న చంద్రబాబు.. ఈ అంశంపై పోరాడాలని సర్పంచ్‌లకు పిలుపునిచ్చారు. ఈ పోరాటంలో తెలుగుదేశం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చెత్త పన్ను వసూలు చేయబోమంటూ గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయాలని తెలుగుదేశం సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల విషయంలో ప్రభుత్వ తీరును తప్పు పడుతూ దిల్లీ స్థాయిలో పోరాటానికి తెదేపా ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. రాజ్యాంగం కల్పించిన పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఆర్థికసంఘం నిధులు మళ్లించటానికి ఈ ముఖ్యమంత్రి ఎవరు అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసిన ఎన్నో అరాచకాలపై పోరాడి గెలిచిన సర్పంచ్ లు నిజమైన హీరోలని కొనియాడారు.
addComments
Post a Comment