విద్యపై ఖర్చు...భవష్యత్తుకు పెట్టుబడి
పిల్లలందరికీ చదువు అందించాలన్నదే సిఎం లక్ష్యం
రాష్ట్ర పురపాలక శాఖామంత్రి బొత్స సత్యనారాయణ
గజపతినగరంలో బాలికల వసతిగృహాన్ని ప్రారంభించిన మంత్రి
గజపతినగరం, (విజయనగరం), ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి)
ః
విద్యకోసం ఖర్చు పెట్టే ప్రతీపైసా, మన రాష్ట్ర, దేశ భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిదని, రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖామంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పురిటిపెంటలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రూ.1.94కోట్లు ఆర్ఎంఎస్ఏ నిధులతో నిర్మించిన బాలికల వసతి గృహాన్ని ఆదివారం మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అందరికీ చదువునందించాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహనరెడ్డి, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో విద్యకోసం కోట్లాది రూపాయలను కేటాయిస్తూ తండ్రిని మించిన తనయుడిగా పేరు సంపాదించారని చెప్పారు. నాడూ-నేడు కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలను సంపూర్ణంగా మార్చివేశారని అన్నారు. ప్రతీ పేద విద్యార్థి కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో, డ్రాపౌట్స్ నివారణకు అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. జగనన్న విద్యాకానుక, వసతి కానుక, విద్యాదీవెన, ఆంగ్లమాధ్యమ భోదన తదితర ఎన్నో పథకాలను విద్యార్థులకోసం అమలు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం కల్పిస్తున్నఅవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా, బాగా చదువుకొని ముఖ్యమంత్రి ఆశయాన్ని నెరవేర్చాలని మంత్రి పిలుపునిచ్చారు.
తమపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, వారి సమస్యలను పరిష్కరిచేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని మంత్రి స్పష్టం చేశారు. తమ పదవిని ఒక బాద్యతగా నిర్వర్తిస్తామని అన్నారు. త్వరలో గజపతినగరం డిగ్రీ కళాశాలకు భవనాన్ని మంజూరు చేస్తామని, హాస్టల్ కూడా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బాలికోన్నత పాఠశాలలో అదనపు గదులను, ప్రహరీ గోడను నిర్మిస్తామని, పాఠశాలలో బోధన, బోధనేతర సిబ్బందిని పూర్తిగా నియమిస్తామని హామీ ఇచ్చారు. స్థానికుల ఇళ్ల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
విజయనగరం పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, వసతిగృహంలో వసతుల కల్పనకు తన ఎంపి నిధులనుంచి రూ.8లక్షలను కేటాయించనున్నట్లు ప్రకటించారు. పునాదుల స్థాయి నుంచే విద్యను బలోపేతం చేసేందుకు, ముఖ్యమంత్రి ఎన్నో సంస్కరణను అమలు చేస్తున్నారని చెప్పారు. గజపతినగరంలో రైల్వే అండర్‌పాస్ నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు.
గతజపతినగరం ఎంఎల్ఏ బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, నియోజకవర్గంలో అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా విద్యాపరంగా ఎన్నో అభివృద్ది కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. కెజిబివి పాఠశాల, డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. హాస్టల్ నిర్మాణాన్ని చాలా తక్కువ సమయంలోనే పెద్దల కృషితో పూర్తి చేయడం జరిగిందన్నారు. రూ.18లక్షలతో ప్రహరీ గోడను నిర్మిస్తామని చెప్పారు. పేదలకు కూడా నాణ్యమైన చదువును అందించాలన్న సదాశయంతో, ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి ఇంగ్లీషు మాధ్యమాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. గజపతినగరంలో కొత్త బ్రిడ్జి నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేస్తామన్నారు. రూ.40కోట్లతో బైపాస్ రోడ్డుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు.
ఎంఎల్‌సి డాక్టర్ పి.సురేష్‌బాబు, జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ ఆర్.మహేష్ కుమార్ మాట్లాడారు. జెడ్‌పిటిసి గార తవుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపిపి బెల్లాన జ్ఞానదీపిక, డిఇఓ పి.బ్రహ్మాజీరావు, డిబిసిడబ్ల్యూఓ డి.కీర్తి, ఎంపిడిఓ కె.కిశోర్ కుమార్, తాశీల్దార్ అరుణకుమారి, ఎంఇఓ ఎస్.విమలమ్మ, సర్పంచ్ విజయలక్ష్మి, పలువురు ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment