నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.

 కర్నూలు జిల్లా (శ్రీశైలం) (ప్రజా అమరావతి);


నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు.


శ్రీశైల మహాక్షేత్రంలో నేటి నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.


- 11 రోజులపాటు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి.


 బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లను అధికారులు విడుదల చేశారు.


 శ్రీశైల మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. 


 లక్షలాదిగా తరలిరానున్న భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేపట్టారు. 


 ఆలయం, వీధులన్నీ విద్యుద్దీపకాంతుల శోభతో అలరారుతున్నాయి.


 భక్తులకు దర్శనం, వసతి, పార్కింగ్‌ తదితర ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 


 జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులతో శ్రీగిరి చందనశోభిత వర్ణంతో నేత్రశోభితంగా మారింది.


 బ్రహ్మోత్సవాల్లో భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లును అధికారులు విడుదల చేశారు.


 అతి శీఘ్ర దర్శనం టికెట్లు రూ.500, శీఘ్ర దర్శనం రూ.200, ఉచిత దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచారు.


నేడు సకల దేవతల ఆహ్వానం_


 బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా నేటి ఉదయం తొమ్మిది గంటలకు శ్రీకారం చుట్టనున్నారు. 

 సకల దేవతలను ఆహ్వానిస్తూ రాత్రి ఏడుగంటలకు ప్రధాన ధ్వజస్తంభంపై ధ్వజారోహణం, ధ్వజపటావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.


కీలక ఘట్టాలు_


 దేవస్థానాల తరఫున శ్రీస్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. 24న విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ, 25న కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, అదే రోజు కలియుగదైవం తిరుమల వెంకన్న(టీటీడీ) తరఫున దేవదేవులైన శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.


 మార్చి 1న ప్రభోత్సవం, నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం వైభవంగా నిర్వహించనున్నారు.


 2న రథోత్సవం, తెప్పోత్సవం.


మొదలైన శివభక్తుల రాక_


 శ్రీశైలానికి శివదీక్షా భక్తుల రాక మొదలైంది. మండల, అర్ధమండల దీక్షలు ఆచరించి, జ్యోతిర్ముడి ఉన్న శివదీక్షా భక్తులు తరలొస్తున్నారు.

 వెంకటాపురం, బైర్లూటి, నాగులూటి నుంచి పెచ్చెరువు, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా పాదయాత్రగా శ్రీగిరికి తరలివస్తుంటారు. శివయ్యపై భక్తితో కఠోరపాదయాత్రకే ప్రాధాన్యమిసూ ఆచరిస్తున్నారు.


వర్ణకాంతుల్లో శ్రీగిరి_

 భూలోక కైలాసంగా పేరొందిన శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయం, ప్రాంగణాలన్నీంటినీ విద్యుత్తు దీపకాంతులతో ముస్తాబు చేయడంతో వర్ణశోభితంగా మారింది. 

 ఆలయం వెలుపల ప్రధాన పురవీధుల్లో దుర్గామాత, శివలింగం, నటరాజరూపం, శ్రీభ్రామరీ సమేత మల్లన్న రూపాలు, నంది మండపానికి విద్యుత్తు దీపాలంకరణను భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.  ఇందుకు రూ.40 లక్షలు వెచ్చించారు.


వాహనాలు నిలిపేందుకు_


 వాహనాలు నిలిపేందుకు 28 ఎకరాల్లో పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. 

 కారు పార్కింగ్‌ హెలిప్యాడ్‌ ఏరియా, వాసవి-2 సత్రం వద్ద, ఆగమపాఠశాల, యజ్ఞవాటిక వద్ద కేటాయించారు. 

 ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ, కేఎస్‌ఆర్టీసీ బస్సులు యజ్ఞవాటిక ఔటర్‌ రింగ్‌రోడ్డు వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లు చేశారు.మొత్తం 8వేల వాహనాలు నిలుపుకొనేందుకు సదుపాయాలు ఉన్నాయి. పార్కింగ్‌ ప్రదేశాల్లో టవర్లు ఏర్పాటు చేసి విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు.


_ప్రత్యేక ‘వసతు’లు_


 భక్తులకు శివదీక్ష శిబిరాలు, గంగాసదన్‌ వెనుక, బసవ వనం, బాలగణేషవనం, ఆలయ దక్షిణమాడవీధి, మల్లమ్మ కన్నీరు వద్ద పైప్‌పెండాల్స్‌తో తాత్కాలిక వసతి ఏర్పాటు చేశారు. పాతాళగంగమార్గంలోని ఐదు డార్మెంటరీల్లో భక్తులు వసతి పొందవచ్చు. లాకర్, దిండు, దుప్పట్లు, మంచం సదుపాయాలు కల్పిస్తున్నారు.


మంచినీటి సదుపాయం_


 భక్తులకు నిరంతరం తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు. క్షేత్ర పరిధిలో 17 చోట్ల శివగంగ జల ప్రసాదం, మంచినీటి సదుపాయాలు ఉన్నాయి. 

రోజుకు 27 లక్షల గ్యాలన్ల నీరు సరఫరా చేయనున్నారు. 

కాలిబాట వచ్చే భక్తులకు కూడా కైలాసద్వారం వద్ద నుంచి భీముని కొలను వరకు తాగునీటి సదుపాయాలు కల్పించారు.


వైద్యశిబిరాలు_


 శ్రీశైల మహాక్షేత్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పక్కన తాత్కాలికంగా 30 పడకల వైద్యశాల ఏర్పాటు చేశారు. 


 వీటితో పాటు నాగలూటి, పెచ్చెరువు, భీముని కొలను, కైలాసద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ స్నానఘాట్ల వద్ద, దేవాలయం వద్ద, బస్‌పార్కింగ్‌ ప్రదేశాల వద్ద శిబిరాలు నిర్వహించి వైద్యసేవలు అందిస్తారు.

Comments