శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏకాంతంగా అంకురార్ప‌ణ‌

 శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఏకాంతంగా అంకురార్ప‌ణ‌


తిరుప‌తి,  ఫిబ్ర‌వ‌రి 19 (ప్రజా అమరావతి): శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను పుర‌స్క‌రించుకుని శనివారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ జ‌రిగింది. కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరగనున్నాయి.

అంకురార్ప‌ణం సందర్భంగా సాయంత్రం 6 నుండి మృత్సంగ్ర‌హ‌ణంలో భాగంగా పుట్టమన్ను సేకరణ, శ్రీ విష్వక్సేనులవారికి సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్ప‌ణ కార్య‌క్రమాలు శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.

ఫిబ్ర‌వ‌రి 20న ధ్వ‌జారోహ‌ణం

శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్ర‌హ్మోత్స‌వాలకు ఆదివారం ఉద‌యం 9 నుండి 9.20 గంట‌ల మ‌ధ్య మీన ల‌గ్నంలో శాస్త్రోక్తంగా ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టం జ‌రుగ‌నుంది. అంత‌కుముందు తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హిస్తారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు పెద్ద‌శేష వాహ‌న‌సేవ జ‌రుగ‌నుంది.

 బ్ర‌హ్మోత్స‌వాల్లో ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఆల‌య ప్రాంగ‌ణంలో వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి విఆర్.శాంతి, వైఖానస ఆగమ సలహాదారు శ్రీ వేదాంతం విష్ణుభట్టాచార్యులు, ఏఈఓ శ్రీ గురుమూర్తి, కంకణభట్టార్ శ్రీ శేషాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ ముని చెంగల్రాయులు, ఎవిఎస్వో శ్రీ విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు.

Comments