స్వయం ఉపాధి రంగంలో ఎక్కువమంది

 

అమరావతి (ప్రజా అమరావతి);


*వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు*


*రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల సంక్షేమం కోసం శ్రీ వైయస్‌.జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న కానుక*


*జగనన్న చేదోడు– షాపులున్న రజకులు, నాయీబ్రహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్దిక సాయం* 


*రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.285.35 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.*


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


*స్వయం ఉపాధి రంగంలో ఎక్కువమంది



*

ఈ రోజు దేవుడి దయతో మరోమంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే స్వయం ఉపాధిరంగంలో అత్యంత ఎక్కువ మంది ఉన్నరంగం ఇది. దాదాపుగా 2.85లక్షల మంది ఈ రంగంపై ఆధారపడి ఉన్నారు. 

ఇటువంటి చేతివృత్తుల పనులు చేసుకుంటూ... వీళ్లు బ్రతకలేని పరిస్థితులలోకి నెట్టివేయడబడితే.. వ్యవస్ధలే  కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. వీరందరికీ తోడుగా నిలవాల్సిన అవసరం ఉంది. వీరికి మంచిచేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు. 


*అమూల్యమైన సేవలు అందిస్తున్నారు*

తాము వివక్షకు గురైన కూడా మన సమాజంలో ఇంటింటికీ వందలు, వేలు సంవత్సరాలుగా అమూల్యమైన సేవలు వీరు అందిస్తున్నారు. నిజంగా వృత్తిపరంగా రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్లుగా సేవలు అందిస్తున్న షాపులున్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు.. వీరందరి సంక్షేమం కోసం ప్రతియేటా సంవత్సరానికి రూ10వేలు చొప్పున, వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడేటట్టుగా, వారికి తోడుగా ఉండేందుకు ఈ ఆర్దిక సాయం చేస్తున్నాం. ఇలా వరుసగా రెండో ఏడాది వీరికి తోడుగా నిలుస్తున్నాం. 


*అక్షరాలా రూ.285.35 కోట్లు జమ*

2,85,350 మంది అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు అక్షరాలా రూ.285.35 కోట్లు వీరికి నేరుగా వాళ్ల అకౌంట్లలోకి జమ చేస్తున్నాం. షాపులున్న దాదాపు 1,46,103 మంది టైలర్లకు రూ.146.10 కోట్లు బటన్‌ నొక్కి వారి అకౌంట్లలోకి బదిలీ చేస్తున్నాం.

షాపులున్న 98,439 మంది రజక సోదరులకు, అక్కచెల్లెమ్మలకు రూ.98.44 కోట్లు బదిలీ చేస్తాం. షాపులున్న 40,808 మంది నాయీ బ్రాహ్మణ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు రూ.40.81 కోట్లు వారి అకౌంట్లో బదిలీ చేస్తాం.


*మంచి చేయాలన్న తపనతోనే*

వీరంతా కష్టజీవులు. కారణమేమిటంటే ప్రతి ఒక్కరూ కూడా పండగ చేసుకుంటున్న సమయంలో కూడా వీళ్లు తమ కుటుంబాలతో ఆ పండగలో ఉండే దానికన్నా వీరంతా పరులకు మంచి చేసే కార్యక్రమాల్లో నిమగ్నులై ఉంటారు. ఇటువంటి శ్రమకు తగిన ఆదాయం లేని పరిస్థితులు.

 స్వయం ఉపాధి రంగంలో కూడా వీళ్లకి చేయూత ఇవ్వకపోతే మొత్తం వ్యవస్ధలే కుప్పకూలిపోయే ప్రమాదకర పరిస్ధితులను మనం గుర్తించాలి. ఇదే విషయాన్ని నా పాదయాత్రలో నేను గుర్తించాను. పాదయాత్ర చేస్తున్నప్పుడు, వీరి కష్టాన్ని విన్నప్పుడు, ఆ పరిస్థితులను చూసిప్పుడు, మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జగనన్న చేదోడు అనే కార్యక్రమం తీసుకు వచ్చాం. ఈ కార్యక్రమంలో కూడా ఎలాంటి లంచాలకు, వివక్షకు తావు లేకుండా, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం ఎవరికీ లేకుండా,  అత్యంత పారదర్శకంగా గ్రామ వార్డు సచివాలయంలో అర్హుల జాబితాను ప్రదర్శించి, సోషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తున్నాం.  ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకొమ్మని చెప్పి.. అత్యంత పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం.  

ఈ రెండున్నర సంవత్సరాలలో జగనన్న చేదోడు పేరుతో ఈ కార్యక్రమాన్ని రెండోసారి మన ప్రభుత్వం చేస్తోంది.  

వీరికి ఈ రెండు సంవత్సరాలలో మొత్తంగా రూ.583.78 కోట్లు ఇవ్వగలిగాం. 


*గతంలో కమిషన్లు కొట్టేసే పరిస్థితి*

ఇస్త్రీ పెట్టలు, కత్తెరలు వంటివి అందిస్తున్నామని.. అందులో కూడా కమిషన్లు కొట్టేసి ఏ కొందరికో మాత్రమే ఇచ్చి, అవి కూడా నాణ్యతలేని సామాన్లు ఇచ్చే పరిస్థితి, ఉపయోగపడని పరిస్థితులు మనం గత ప్రభుత్వంలో చూశాం. వీళ్లు బీసీలకు మంచి చేస్తున్నామని మాటల్లో చెప్పడమే కానీ, వాళ్లకు అత్యంత మంచి చేసే గొప్ప కార్యక్రమం  ఫీజు రీయింబర్స్‌మెంట్‌.. ఈ పథకాన్ని కూడా నీరుగార్చిన పరిస్థితి గత ప్రభుత్వంలో మన కళ్లెదుటనే చూశాం. ఇదే బీసీలకు గొప్ప సామాజిక న్యాయం అని చెప్పి.. చెడే చేసిన గత ప్రభుత్వానికి... మనసుతో వారందరికీ కూడా నిజమైన చేదోడు అందిస్తున్న మన ప్రభుత్వానికి మధ్య తేడా ఎంతుందో గమనించమని కోరుతున్నాను. 


*బీసీలు అంటే బ్యాక్ బోన్‌ క్లాసు*

బీసీలంటే కేవలం పనిముట్లు కాదు.. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాసులు కాదు... సమాజానికి.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని నిండు మనస్సుతో నమ్మి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరించాం. 

ఈ వృత్తులు అవలంభిస్తున్న కులాల వారి జీవితాల్లో మార్పులు రావాలి. వీరు రాజకీయంగానూ, ఆర్ధికంగానూ, సామాజికంగానూ  మిగతా పోటీ ప్రపంచంతో పోటీపడి ఎదగాలి.. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని క్రియేట్‌ చేయాలని చెప్పి... ఈ రెండున్నర సంవత్సరాల కాలంగా మనసా, వాచా తపించాం. కాబట్టే మత్స్యకార భరోసా, నేతన్ననేస్తం వంటి పథకాలతో పాటు నవరత్నాలతో ప్రతి ఒక్క పథకానికి కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు కూడా అత్యంత పెద్దపీట వేస్తూ వర్తింపజేసేలా ప్రతిఅడుగులో కూడా తోడుగా నిలబడ్డాం. 


వైయస్సార్‌ ఆసరా, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ సున్నావడ్డీ, వైయస్సార్‌ రైతు భరోసా, వైయస్సార్‌ పెన్షన్‌ కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, వైయస్సార్‌ వాహనమిత్ర ఇలా అనేక పథకాలను తీసుకువచ్చాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అండగా నిలిచాం. 


ఇవే కాకుండా ఇంగ్లిషు మీడియం చదువులు, 30  లక్షల కుటుంబాలకు మేలు చేస్తూ ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఇలా ఏది తీసుకున్నా...  ఎన్నికల ముందు ఏలూరులో నేను ఇచ్చిన మాట ప్రకారం వారిని వెన్నుముక కులాలగా మార్చేందుకు నిండు మనస్సుతోనే ఈరెండున్నర సంవత్సరాలలో గట్టిగా ప్రయత్నం చేశాను. 


*రెండున్నరేళ్లలో...*

ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో దేవుడి చల్లని దీవెనలతో మన ప్రభుత్వం కొన్ని పనులు ఏం చేశామన్నది జ్ఞాపకం చేసుకుందాం. 


బీసీ కమిషన్‌ను శాశ్వత ప్రాతిపదికన నియమించిన మొట్టమొదట రాష్ట్రం మనదే. కేబినెట్‌ కూర్పులోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం మంత్రి పదవులుచ్చిన ప్రభుత్వం మనదే. ఐదుగురు డిప్యూటీ సీఎంలకు గానూ... నలుగురు డిప్యూటీ సీఎంలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినవారే. 


శాసనసభ స్పీకర్‌ పదవి సైతం బీసీలకే ఇచ్చామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 32 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తే... అందులో 18 ఎమ్మెల్సీ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. నలుగురిని మనం రాజ్యసభకు పంపిస్తే అందులో సగం అంటే రెండు బీసీలకే ఇచ్చాం.  


మొన్న జరిగిన స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మొత్తం 650 మండలాలలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  636 మండలాల్లో మనం క్వీన్‌ స్లీప్‌ చేస్తే..  అందులో 427 మండల అధ్యక్ష పదవులు అంటే 67 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే  ఇచ్చాం. 13 జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే 9 పదవులు అంటే 69 శాతం ఇచ్చాం. 


13 నగర కార్పొరేషన్‌ ఛైర్మన్లకు ఎన్నికలకు పోయి దేవుడి దయతో 13 మనమే గెలిచాం. ఆ పదవుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు 12 అంటే 92 శాతం ఈ వర్గాల వారికే ఇచ్చాం.


87 మున్సిపాల్టీలలో 84 వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గెలిస్తే అందులో 61 ఛైర్మన్‌ పదవులు అంటే 73 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకే ఇచ్చాం.


196 వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లో 118 అంటే 60 శాతం ఛైర్మన్‌ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే.

నామినేటెడ్‌ కింద కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవులు 137 ఇస్తే... వీటిలో 79 పదవులు అంటే 58 శాతం ఎస్సీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. 

484 నామినేటెడ్‌ డైరెక్టర్ల పోస్టులో 281 పోస్టులు అంటే 58 శాతం ఈ వర్గాలకే ఇచ్చాం.


*1.25 లక్షల శాశ్వత ఉద్యోగాలు...*

ఈ మధ్య కాలంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 1.25 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉధ్యోగాలిస్తే.. ఇందులో 83 శాతం ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాల వారికే ఇవ్వగలిగాం.  ఇలా నామినేటెడ్‌ పదవుల్లో కానీ, పనుల్లో కానీ దేశంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ... ఏకంగా చట్టాన్నే చేసిన ప్రభుత్వం మనదే. 


*మిమ్నల్ని గమనించమని కోరుకుంటున్నాను.* 

ఒకవైపున ఇంత మంచి చేశామని చెప్పి మీ బిడ్డగా తెలియజేసే పరిస్థితి ఉంటే...


*మరోవైపు...*

 మరోవైపు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అన్న దిగజారుడు వ్యక్తి ఈ రోజు మన రామోజీరావుగారికి అంటే మన ఈనాడుకు ముద్దుబిడ్డగా ఉన్నాడు.


*బీసీల తోకలు కత్తిరిస్తానని..*

బీసీల తోకలు కత్తిరిస్తానన్న అహంకారి మన  ఏబీయన్, టీవీ5 వీరికి ముద్దుబిడ్డ ఈరోజు. 

బీసీలు జడ్జీలుగా పనికిరారని ఏకంగా కేంద్రానికి లేఖలు రాసిన వ్యక్తి ఈ రోజు మన ఎర్రజెండాల వారికి ఆత్మీయ కామ్రేడ్‌గా తయారైన వ్యవస్ధ ఈరోజుమనం చూస్తున్నాం. ప్రపంచ కమ్యూనిస్టు చరిత్రలో బహుశా ఎప్పుడూ కనీవినీ ఎరుగని విధంగా  బాబు బినామీ భూముల రియల్‌ ఎస్టేట్‌ ధరల కోసం ఈ రోజు కామ్రేడ్‌ సోదరులు జెండాలు పట్టుకునే పరిస్థితి.  


*డెమోగ్రాఫిక్ ఇంబేలన్స్‌ అని*

ఎవరైనా అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వడం కోసం.. ఆ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు  స్ధలాలు కేటాయిస్తే.. ఏకంగా వీళ్లకు ఇళ్ల స్దలాలు అక్కడ కేటాయిస్తే డెమోగ్రాఫిక్‌ ఇంబేలన్స్‌ అంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులకు వెళ్లి పిటిషన్లు వేసిన చంద్రబాబు గారికి మద్ధతు పలుకుతున్న మహానుభావులు కూడా ఇక్కడ మన కామ్రేడ్‌లు ఉన్నారంటే ఏ స్ధాయిలో వ్యవస్ధ దిగజారిపోయిందో గమనించమని కోరుతున్నాను. 


ఇక్కడ మరో విషయం ఆలోచించమని సవియనంగా కోరుతున్నాను.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె ప్రారంభించాలని ఎవరు కోరుకుంటారు?  ప్రజలు, ప్రభుత్వం, ఉద్యోగులు కూడా కోరుకోరు.  నేను ఇంతగా ప్రేమించే నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులు కూడా కోరుకోరు. 


దాదాపుగా ఈ రెండున్నర సంవత్సర కాలంలో నేరుగా బటన్‌ నొక్కి డీబీటీ పద్ధతి ద్వారా, అంటే ఎటువంటి లంచాలకు, వివక్షకు తావులేకుండా అక్షరాలా రూ.1.27 లక్షల కోట్లు అందుకున్న ఏ కుటుంబమూ కోరుకోదు. ఏ ఒక్క సామాజిక వర్గం కోరుకోదు.


*సమ్మె ఎవరికి కావాలంటే ?*

మరి కోరుకునేదెవరో తెలుసా ? సమ్మె ఎవరికి కావాలో ? ఆందోళనలు ఎవరికి కావాలో తెలుసా? ఎవరికి కావాలని అని అంటే ?.... చంద్రబాబు సీఎం కాలేదన్న బాథ, కడుపుమంట ఉన్నవారికి మాత్రమే కావాలి. పార్టీల పరంగా ఎర్రజెండాల వారికి కావాలి. బాబు దత్తపుత్రుడికి కావాలి. వ్యక్తుల పరంగా మీడియా ముసుగులో నడుపుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లకే కావాలి. కాబట్టే

ఉద్యోగుల సమ్మె జరుగుతుందంటే వీళ్లకు పండగ. 

సంధి జరిగింది, ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదు అని అంటే... ఏడుపు మొహం పెట్టారు. వీళ్లకు అది నచ్చలేదు.


*ఎదర ఎర్రజెండా.. వెనుక పచ్చ ఎజెండా...*

 రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె విరమించారు అని తెలియగానే...కమ్యూనిస్టు సోదరులను ముందుకు తోశారు.  పచ్చ జెండాలు మోస్తున్న పచ్చబాబు... పచ్చజెండాల ముసుగులో ఉన్న ఎర్రసోదరులను ముందుకు తోశారు. ఎదర ఎర్రజెండా.. వెనుక పచ్చ ఎజెండా. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. 


ఈ రోజు ఈనాడులో మొదటి పేజీలో చూస్తే ఆశాలు రోడ్డుమీదకువచ్చారని చెప్పి ఫోటో వేశారు. వాళ్లను ఈడుస్తున్నట్టుగా ఫోటో వేశారు. ఆశ అక్కచెల్లెమ్మల మీద ఇంత ప్రేమ ఉంది అని చూపించే ఒక అభూత కల్పన. 

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్, మున్సిపల్‌ ఉద్యోగులు ఆందోళన చేపట్టారని చెప్పి ఈనాడు గుండెలు బాదుకోవడం, వెనకాల నుంచి కమ్యూనిస్టుల ప్రోద్భలం. ఎజెండా పచ్చ ఎజెండా.

 

నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని ఎల్లో ఛానెళ్ల బాధ అంతా ఇంతా కాదు. ఎవరో ఒకరు, ఎదోఒక చోట ఆందోళన చేయండి, మీకు మంచి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయండి, మా బాబు పాలనే బాగుందని చెప్పండి. మీకు మెరుగైన జీతాలు ఇచ్చే 

ప్రభుత్వానికి వ్యతిరకంగా నాలుగు జెండాలు పట్టుకొండి అన్న స్లోగన్స్‌.


*ముఖ్యమంత్రిని తిడితే మంచి కవరేజ్‌*

ముఖ్యమంత్రిని కనుక తిడితే ఇంకా బాగా కవరేజ్‌ ఇస్తాం. ఇంకా బాగా హైలెట్‌ చేస్తాం. సోషల్‌ మీడియాలో ఎవరైనా రాస్తే.. దాన్ని ప్రధాన వార్తగా కూడా ప్రచురిస్తాం.  టీవీలలో చూపిస్తాం. ఇది ఈనాడు రాష్ట్రంలో ఉన్న ఈనాడు,ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలా ఎల్లో మీడియా ధోరణి. నిజంగా ఇవి వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు చాలా బాధ కలిగినా కూడా... ఇంత దిగజారిపోయిన పరిస్థితి చూస్తున్నప్పుడు ఆ బాధలోనుంచి నవ్వు కూడా వస్తుంది. నిజంగా ఈస్ధాయికి వీళ్లు దిగజారిపోయేలా దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పి సంతోషంగా ఉంటుంది.


*మీ ద్వారా అందరికీ కొన్ని విషయాలు చెప్పాలి*

  కొన్ని విషయాలు మీ ద్వారా మీకే కాకుండా రాష్ట్రంలో ఉన్నవారందరికీ చెప్పాలి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మొన్న 2019 వరకు అంటే మన ప్రభుత్వం రానంత వరకు మన రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు 3.97 లక్షల మంది ఉన్నారు. ఈ రెండున్నర సంవత్సరకాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనమిచ్చిన ఉద్యోగాలు.. మన కళ్లెదుటనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.25 లక్షల మంది కనిపిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు దశాబ్దాలుగా కన్న కలను నెరవేరస్తూ... దాదాపుగా 51 వేల మందిని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. ఇక మిగిలినవాటిని కలుపుకుంటే.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,84,264 కొత్త ప్రభుత్వఉద్యోగాలను ఇచ్చాం. అంటే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన ప్రభుత్వం రానంత వరకు 3.97లక్షల ఉద్యోగాలు ఉంటే.. ఈ రెండేళ్లలో 1,84,264 ఉద్యోగాలు ఇచ్చామంటే.. ఏకంగా 50 శాతంపై చిలుకు ఉద్యోగాల పెరుగుదల కనిపించడం లేదా అని చెప్పి... నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారని పెద్ద, పెద్ద అక్షరాలు రాస్తున్న వీళ్లకి , మాట్లాడుతున్న వీళ్లకి కనిపించడం లేదా అని అడుగుతున్నాను ? 


*మెరుగైన, మంచి జీతాల కోసం- ఆప్కాస్‌*

ఈ రోజు అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎక్కడ కూడా వాళ్లు మోసపోకూడదు, జీతాలిచ్చేటప్పుడు లంచాలిచ్చే పరిస్థితి రాకూడదు, దళారీల బెడద ఉండకూడదు, కమిషన్లు లేకుండా వారికి మెరుగైన, మంచి జీతాలు ఇచ్చే పరిస్థితి రావాలని వారికి ఆప్కాస్‌ ఆని ఒక కార్పొరేషన్‌  క్రియేట్‌ చేసి, దాదాపు లక్షమందికి పైగా ఉద్యోగులకు ఈపీఎఫ్, ఈఎస్‌ఐ బెనిఫిట్స్‌ అందిస్తున్న ప్రభుత్వం మనది. 


ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం కాబట్టే... ఈ రోజు రాష్ట్ర ఖజానా మీద సంవత్సరానికి రూ.3600 కోట్లు అదనపు భారం పడుతున్నా చిరునవ్వుతో తీసుకుంటున్న ప్రభుత్వం మనది. పక్కనే తెలంగాణా, ఇతర రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డెక్కి ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా మమ్నల్ని విలీనం చేసుకొండి అని అడిగితే ఒక్క ప్రభుత్వం అయినా పట్టించుకుందా? అని అడుగుతున్నాను. గుండెల మీద చేతులు వేసుకుని ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండని అడుగుతున్నాను. 


*బాబు గారి  ఐదేళ్ల పాలనలో...*

చంద్రబాబు నాయుడు గారి ఐదు సంవత్సరాల పాలన చూసారు. 

కాంట్రాక్ట్‌ఉద్యోగులకు టైం స్కేల్‌ ఇస్తామని చెప్పి ఆశ చూపించారు తప్ప ఒక్కరికైనా చేయలేదు. కానీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్ట్‌ఉద్యోగులందరికీ కూడా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ అమలు చేస్తున్న ప్రభుత్వం మనది. అధికారంలోకివచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు అమలు చేస్తున్న ప్రభుత్వం మనది కాదా ఆలోచన చేయండి ? 


2019 ఎన్నికలకు మూడు నెలల ముందు వరకు కూడా.. ఏయే ఉద్యోగులకు ఎంతెంత జీతం ఇచ్చారో.. ఇప్పుడు మనందరి ప్రభుత్వం ఎంతెంత జీతం ఇస్తుందో వారికి, ప్రజలందరికి తెలుసు. అయినా  ఒక్కసారి జ్ఞా్పకం  చేస్తున్నాను.


*జీతాలు గతంలో- మన ప్రభుత్వంలో....*

ఇదే అంగన్వాడీ వర్కర్లకు గతంలో బాబుగారి హయాంలో రూ.7వేలు జీతం ఇస్తే... మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.11,500 చేశాం.

అంగన్వాడీ మినీ వర్కర్లకు బాబుగారి హయాంలో జీతం రూ.4500 అయితే మనం వచ్చిన తర్వాత దాన్ని రూ.7వేలు చేశాం. 

సంఘమిత్రలకు, యానిమేటర్లకు రూ.3వేలు బాబు హయాంలో ఇస్తే.. మనం వచ్చిన తర్వాత దాన్ని రూ.10వేలు చేశాం. 

మున్సిపల్, పారిశుద్ధ్య కార్మికులకు బాబు గారి హయాంలో రూ.12వేలు అయితే మనం రూ.18వేలు చేశాం. 


ఈ రోజు పేపర్లో ఆశావర్కర్లవి రామోజీరావుగారు పెద్ద, పెద్ద ఫోటోలు వేశారు. ఇదే ఆశావర్కర్లకు బాబు గారి హయాంలో ఎంతిచ్చేవారు అంటే..  కేవలం రూ.3వేలు. మనం ఇవాళ ఇస్తున్నది రూ.10 వేలు కాదా ? ఒక్కసారి మనస్సాక్షిని అడగండి.


గిరిజన సంక్షేమ హెల్త్‌ వర్కర్లకు బాబు గారి హాయంలో కేవలం రూ.400 ఇచ్చిన పరిస్థితి. ఈరోజు మనం రూ.4వేలు ఇస్తున్నాం. 

హోంగార్డులకు బాబుగారి హయాంలో జీతం రూ.18వేలు ఇస్తే మనం దాన్ని పెంచి రూ.21,300 ఇస్తున్నాం.  


108 ఫోన్‌ నంబరు కొడితే తోడుగా నిలబడే ఆ వ్యవస్ధలో డ్రైవర్లకు బాబు గారి హయాంలో నెలకు రూ.13వేలు జీతం అయితే ఇవాళ వాళ్లు తీసుకుంటున్న జీతం రూ.28వేలు. ఇది నిజం కాదా ? అని ఆలోచన చేయమని అడుగుతున్నాం.


 ఇలా 3.07 లక్షల మందికి మన ప్రభుత్వం రాకముందు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి అయ్యే ఖర్చు రూ.1198 కోట్లు అయితే ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్న ఖర్చు రూ.3187 కోట్లు. ఎక్కడ రూ.1198 కోట్లు. ఎక్కడ రూ.3187 కోట్లు. ఇంత పెద్ద ఎత్తున ఇస్తుంటే ఈరోజు ఆందోళన బాట పట్టించేందుకు, రెచ్చగొట్టేందుకు ఎర్ర జెండాలు, పచ్చ జెండాలు ఇద్దరూ కలిసి, రాజకీయాలనే కల్మషం చేసి, రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేయాలన్న ప్రయత్నం జరుగుతుంది. 


సామరస్యంగా పరిష్కారం- అయినా ఆందోళన

ఈ రోజు ఉద్యోగుల సమస్యలు సామరస్యంగా పరిష్కారం అయ్యాక... ఆ ప్రక్రియలో కూడా భాగస్వామ్యలు కూడా అయిన కొన్ని వామపక్షాలకు సంబంధించిన సంఘాలు.. అక్కడేమో  సంతకాలు పెట్టి, సంతోషాన్ని వెలబుచ్చారు. మరుసటి రోజు కేవలం వామపక్షాలకు సంబంధించిన కొన్ని యూనియన్లు, పచ్చ పార్టీలకు సంబంధించిన యూనియన్స్‌.. పోరుబాట పడతామని, రోడ్డెక్కుతామని కొంతమంది టీచర్లు అంటుంటే బాధనిపిస్తుంది. 


కోవిడ్‌ వల్ల గత రెండు సంవత్సరాలుగా మనం పిల్లకు పరీక్షలు పెట్టలేదు. కేవలం పాస్‌ చేస్తూ పోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో, ఇది మూడో సంవత్సరం. పరీక్షల సమయం సమీపిస్తున్న పరిస్థితుల్లో ఇలా కొంతమంది కేవలం ప్రభుత్వం మీద రెచ్చగొట్టాలని.. కొంతమంది టీచర్లతో రోడ్డెక్కిస్తే.. పిల్లల చదువులేం కావాలి ? ఆ తల్లిదండ్రులకేం సమాధానం చెబుతారు? మూడో సంవత్సరం కూడా పిల్లల చదువులు గాలికొదిలేసే పరిస్థితి తీసుకునిరావడానికి వీళ్లు చేసే ప్రయత్నం చూస్తుంటే...  ఈ రెచ్చగొట్టే ఈ  నాయకులు కానీ, ఇలా రెచ్చిపోయేటట్టు తాపత్రయ పడుతున్న ఈ ఎల్లో మీడియా కానీ?  వీళ్లంతా మనుషులేనా అని చెప్పి మనం అందరం కూడా ఆలోచించాలి ? ఇలా చేయడం ధర్మమేనా ? అని మనం కూడా ఆలోచన చేయాలి.



ఇన్ని మంచి పనులు చేస్తున్నా...

 ఇన్ని మంచి పనులు చేస్తున్నా బురద జల్లడం పరిపాటి అయింది. ఈరోజు ఇన్ని జరుగుతున్నా దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ ఇంకా మంచి చేసే ప్రయత్నం చేస్తాడు. ఇంకా మంచి చేసే బలం దేవుడు ఇవ్వాలని.. మీ అందరి చల్లని దీవెనలు తోడుగా ఉండాలని ఆకాంక్షిస్తూ... ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తన ప్రసంగం ముగించారు. 


అనంతరం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2,85,350 మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు రూ.285.35 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. 


ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, గ్రామ,వార్డు సచివాలయాల స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, రజక, నాయీ బ్రాహ్మణ, టైలర్‌ కార్పొరేషన్ల ఛైర్మన్లు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Comments