విజయవాడ (ప్రజా అమరావతి);
- 2014-19 మధ్యకాలంలో సుద్దపల్లి గ్రామపరిధిలో భారీగా అక్రమ క్వారీయింగ్
- గ్రావెల్ మాఫియా కారణంగా ఏర్పడిన 19 ప్రమాదకరమైన గోతులు
- ఈ కాలపరిధిలో కేవలం 16,399 క్యూబిట్ మీటర్ల అక్రమ క్వారీయింగ్‌కు రూ.33,28,769 జరిమానా
- 2019 నుంచి గ్రావెల్ మాఫియాపై ఉక్కుపాదం
- ప్రతిజిల్లాలకు విజిలెన్స్ స్క్వాడ్ ఏర్పాటు
- అక్రమాలు జరగకుండా ఎప్పటికప్పుడు ఆకస్మిక తనిఖీలు
- అక్రమ మైనింగ్ రవాణా అరికట్టేందుకు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ
- 2019-22 మధ్య అక్రమ క్వారీయింగ్‌కు బాధ్యులైన అయిదుగురిపై చర్యలు
- అక్రమంగా క్వారీయింగ్ చేసిన 56,834 క్యూబిక్ మీటర్లకు రూ.2,06,63,127 జరిమానా
- గతంలో నిబంధనలకు విరుద్దంగా జరిగిన క్వారీయింగ్‌ను గుర్తించేందుకు సర్వే
- అక్రమ క్వారీయింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు
: డైరెక్టర్ ఆఫ్ మైనింగ్ &జియాలజీ శ్రీ వి.జి.వెంకటరెడ్డి
గుంటూరుజిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామపరిధిలో అక్రమ గ్రావెల్ క్వారీయింగ్‌ను నియంత్రించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే శ్రీ దూళిపాల నరేంద్ర ఆధ్వర్యంలో స్థానికులు నిర్వహించిన ఆందోళనల నేపథ్యంలో మైనింగ్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా గురువారం ఈ ప్రాంతంలో పర్యటించి, గ్రావెల్ క్వారీలను పరిశీలించారు. ఈ తనిఖీల్లో 2014-19 మధ్య కాలంలో ఇష్టారాజ్యంగా జరిగిన మైనింగ్ కారణంగా ప్రజలకు ప్రమాదం కలిగించేలా 19 భారీ గోతులు ఉన్నట్లు గుర్తించారు. గతంలో మైనింగ్ మాఫియా విచ్చలవిడిగా గ్రావెల్ తవ్వకాలు జరపడం వల్ల అటు ప్రజలకు, ఇటు పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలా క్వారీ గోతులు ఏర్పడినట్లు అధికారులు నిర్ధారించారు.
2014-19 మధ్యకాలంలో జరిగిన అక్రమ మైనింగ్:
గుంటూరుజిల్లా చేబ్రోలు మండలంలోని సుద్దపల్లి, వడ్లమూడి, వేజెండ్ల, సేకూరు, శ్రీరంగపురం తదితర గ్రామల పరిధిలో రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన నాణ్యమైన గ్రావెల్ ఖనిజ నిల్వలు ఉన్నాయి. 2014-19 మధ్య కాలంలో ఈ ప్రాంతంలో మైనింగ్ నిబందనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా గ్రావెల్ క్వారీయింగ్ చేయడం వల్ల స్థానిక గ్రామాల ప్రజలకు ప్రమాదకరంగానూ, భూగర్భ జలాలు ఎండిపోయేలా, పర్యావరణానికి విఘాతం ఏర్పడే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకంగా సుద్దపల్లి గ్రామ పరిధిలో ఇటువంటి ప్రమాదకరమైన గోతులు 19 వరకు 2014-19 కాలంలో క్వారీయింగ్ వల్ల ఏర్పడ్డాయని గత ఏడాది ఆగస్టు నెలలోనే మైనింగ్ అధికారులు జరిపిన తనిఖీల్లో గుర్తించడం జరిగింది. సుద్దపల్లి గ్రామ పరిధిలోనే 2014-19 మధ్య కాలంలో 3వేల క్యూబిక్ మీటర్ల కోసం ఒక్క గ్రావెల్ క్వారీకి తాత్కాలిక అనుమతి ఇచ్చారు. అక్రమ క్వారీయింగ్ చేస్తున్న ఇద్దరికి మాత్రమే నోటీసులు జారీ చేసి, కేవలం 16,399 క్యూబిక్ మీటర్ల కు రూ.33,28,769 జరిమానా విధించారు.
2019-22 మధ్యకాలంలో అక్రమ మైనింగ్‌పై చేపట్టిన చర్యలు:
రాష్ట్ర వ్యాప్తంగా మైనింగ్ అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక మైనింగ్ విజిలెన్స్ స్వ్కాడ్‌ను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా మైనింగ్ అక్రమ రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను రూపొందించింది. మైనింగ్ వ్యవహారాలపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించడం, అక్రమాలను నియంత్రించేందుకు ఆకస్మిక దాడులు చేయడం ద్వారా మైనింగ్ మాఫియాకు ముక్కుతాడు వేసింది. దీనిలో భాగంగానే గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం పరిధిలో అక్రమ క్వారీయింగ్‌లపై గనుల శాఖ పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. గతంలో మైనింగ్ మాఫియా ఈ ప్రాంతంలో నాణ్యమైన గ్రావెల్‌ను నిబంధనలకు విరుద్దంగా మైనింగ్ చేయడం ద్వారా అటు పర్యావరణానికి, ఇటు స్థానిక ప్రజలకు మైనింగ్ వల్ల ఏర్పడిన గోతులు ప్రమాదాలకు కారణమయ్యాయి. దీనిపై 2019 నుంచే గనులశాఖ అధికారులు పూర్తిస్థాయిలో అక్రమ మైనింగ్ వ్యవహారాలను నియంత్రించే చర్యలు చేపట్టారు. 2019-22 మధ్యకాలంలో రహదారులు, ఇతర నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ ను అందించేందుకు సుద్దపల్లి గ్రామ పరిధిలో కేవలం 4 గ్రావెల్ క్వారీల ద్వారా 31,515 క్యూబిక్ మీటర్ల మేరకు మాత్రమే తాత్కాలిక పర్మిట్‌లను జారీ చేయడం జరిగింది. అలాగే అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించి అయిదుగురికి నోటీసులు జారీ చేశాం. మొత్తం 56,834 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ అక్రమంగా క్వారీయింగ్ చేసినట్లు గుర్తించి, బాధ్యులైన వారికి రూ.2,06,63,127 జరిమానా విధించడం జరిగింది.
ప్రజలకు ప్రమాదకరంగా క్వారీల్లో తవ్వకాలు చేసిన వారిపై కఠిన చర్యలు:
2014-19 మధ్యకాలంలో మైనింగ్ అనుమతులకు విరుద్దంగా పలు క్వారీల్లో భారీగా గ్రావెల్ ను వెలికితీయడం వల్ల దాదాపు 19 చోట్ల ప్రమాదకరమైన గోతులు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. ఈ క్వారీల్లో మైనింగ్ జరిగిన మైనింగ్‌ను కూడా శాస్త్రీయంగా గనులశాఖ అధికారులు లెక్కించి, దీనికి బాధ్యులైన వారిపై జరిమానాలు విధించడంతో పాటు చట్టప్రకారం అన్ని చర్యలు తీసుకుంటాం.
చేబ్రోలు మండలంలో 2014-19 కాలంలో 3,46,716 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వెలికితీసేందుకు 14 క్వారీలకు తాత్కాలిక అనుమతి ఇవ్వడం జరిగింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.1,21,05,272 ఆదాయం సమకూరింది. అలాగే 1,38,200 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తవ్వకాల కోసం 4 లీజులకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనిద్వారా రూ.42,05,070 ఆదాయం ప్రభుత్వానికి లభించింది. ఇదే క్రమంలో ఈ అయిదేళ్ళలో అక్రమంగా గ్రావెల్ తరలింపుపై 661 కేసులు నమోదు చేసి, మొత్తం రూ.1,08,24,898 జరిమానా విధించడం జరిగింది. అలాగే అక్రమ క్వారీయింగ్ పై 12 కేసులు నమోదు చేసి రూ. 5,39,17,924 జరిమానాగా విధించడం జరిగింది.
2019-22 కాలంలో చేబ్రోలు మండలంలో 4,00,684 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వెలికితీసేందుకు 48 తాత్కలిక అనుమతులు ఇవ్వడం జరిగింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.1,62,27,994 ఆదాయం లభించింది. అలాగే 42,198 క్యూబిక్ మీటర్ల గ్రావెల్ వెలికితీసేందుకు 4 లీజులకు అనుమతి ఇవ్వడం జరిగింది. దీనిద్వారా ప్రభుత్వానికి రూ.30,28,860 ఆదాయంగా సమకూరింది. ఇదే క్రమంలో 2019-22 మధ్యకాలంలో అక్రమ క్వారీయింగ్, గ్రావెల్ రవాణాలపై గనుల శాఖ దృష్టిసారించింది. అక్రమంగా గ్రావెల్ ను తరలిస్తున్న వారిపై 665 కేసులు నమోదు చేసి రూ.1,02,37,112 జరిమానా విధించడం జరిగింది. అలాగే అక్రమ క్వారీయింగ్‌కు పాల్పడుతున్న వారిపై 23 కేసులు నమోదు చేసి రూ.8,13,05,703 జరిమానాగా విధించడం జరిగింది.
addComments
Post a Comment