- గుడివాడ నియోజకవర్గ చరిత్రలో సువర్ణధ్యాయం ఫ్లైఓవర్ నిర్మాణం
- నెరవేరుతున్న మంత్రి కొడాలి నాని దశాబ్దాల నాటి కల
- ఐకాన్ బ్రిడ్జ్ తరహాలో ఫ్లైఓవర్ ను తీర్చిదిద్దుతాం
- ఏడాదిన్నరలో నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు
- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)
గుడివాడ, ఫిబ్రవరి 17 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో భీమవరం, మచిలీపట్నం రైల్వే లైన్ లను కలుపుతూ నిర్మించే ఫ్లైఓవర్ గుడివాడ నియోజకవర్గ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలవనుంది.
రూ.317.22 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) దశాబ్దాల నాటి కల నెరవేరనుంది. దీన్ని ఐకాన్ బ్రిడ్జి తరహాలో మంత్రి కొడాలి నాని తీర్చిదిద్దనున్నారు. సుమారు ఏడాదిన్నర కాలంలో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
దీన్నిబట్టి మంత్రి కొడాలి నాని మాటల మంత్రి కాదని ప్రత్యర్థులకు సైతం ధీటుగా జవాబు చెప్పినట్టు అయింది. వరుసగా నాలుగు సార్లు గుడివాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం, ఈసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో కొడాలి నానిపై ప్రజలు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే మంత్రి కొడాలి నాని పనిచేస్తున్నారు. దశాబ్దాలుగా కలగానే మిగిలిన గుడివాడ ఆర్టీసీ బస్టాండ్, ఫ్లైఓవర్ నిర్మాణాలను ప్రారంభించగలిగారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం గుడివాడ పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. గుడివాడ పట్టణంలోని పామర్రు రోడ్ లో గుడివాడ- భీమవరం, గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ లు ఉన్నాయి. రైళ్ల రాకపోకల సందర్భంగా భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఆటో నగర్ ప్రజలతోపాటు గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే గుడివాడ పట్టణం నుండి పామర్రు, మచిలీపట్నం ప్రాంతాల నుండి వచ్చే వాహనాలు భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర ట్రాఫిక్ లో ఇరుక్కు పోతున్నాయి. దీంతో రెండు రైల్వే ట్రాక్ లపై ఫ్లై ఓవర్ లను నిర్మించాలన్న డిమాండ్ చాలా కాలంగా కొనసాగుతూ వస్తోంది. మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి ఎన్నిక కావడం, వరుసగా నాలుగు సార్లు గుడివాడ ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఫ్లైఓవర్ నిర్మాణం ఒక కొలిక్కి వచ్చింది. గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణానికి కృషి చేస్తానని ఎంపీ బాలశౌరి మంత్రి కొడాలి నానికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. దీనిలో భాగంగా అనేకసార్లు గుడివాడలో ఫ్లైఓవర్ నిర్మాణం అంశాన్ని ఎంపీ బాలశౌరి పార్లమెంట్ దృష్టికి తీసుకు వచ్చారు. ఫ్లై ఓవర్ నిర్మించే ప్రాంతంలో బైపాస్ రోడ్డు ఉంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు రావు. అయినప్పటికీ గుడివాడ పట్టణంలోని భీమవరం, మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల దగ్గర నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రజల సమస్యలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి ఎంపీ బాలశౌరి తీసుకువెళ్లారు. సమస్యను అర్థం చేసుకున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్-3 గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ దగ్గర, లెవెల్ క్రాసింగ్ గేట్ నెంబర్- 52 విజయవాడ- భీమవరం రైల్వే ట్రాక్ దగ్గర ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ తయారు చేసి నేషనల్ హైవే డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వానికి పంపేందుకు నిర్వహించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశారు. మొదట రూ.220 కోట్లకు అనుమతులు వచ్చాయి. మంత్రి కొడాలి నాని సూచనలను కూడా పరిగణనలోకి తీసుకోవడంతో రూ.317.22 కోట్లకు అనుమతులు తీసుకోవాల్సి వచ్చింది. ఫ్లైఓవర్ నిర్మాణానికి అవసరమైన 1.2 హెక్టార్ల భూమికి కేంద్ర ప్రభుత్వం రూ.45 కోట్ల నిధులను మంజూరు చేయనుంది. ఇదిలా ఉండగా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నుండి గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడు వరకు ఫ్లైఓవర్ వరకు నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం గుడివాడ- భీమవరం, గుడివాడ- మచిలీపట్నం రైల్వే ట్రాక్ ల మీదుగా 2.9 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. మార్గమధ్యంలో గుడివాడ పట్టణంలోని బైపాస్ రోడ్, మచిలీపట్నం వైపు వెళ్లే రోడ్డు, ఆటోనగర్ రోడ్డు ఉన్నాయన్నారు. మూడు వైపుల నుండి వచ్చే వాహనాలను కలుపుతూ ఫ్లైఓవర్ డిజైన్ లో కొన్ని మార్పులు, చేర్పులు కోరామన్నారు. వీటిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎంపీ వల్లభనేని బాలశౌరి తీసుకు వెళ్లారని తెలిపారు. భావితరాలు ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు. మచిలీపట్నం వైపు నుండి, బైపాస్ రోడ్డు నుండి, ఆటోనగర్ వైపునుండి వచ్చే వాహనాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. గుడివాడ పట్టణం పెద్ద కాలువ సెంటర్ లో మచిలీపట్నం వెళ్లే రోడ్డు వద్ద ఒక ర్యాంపు, ఓల్డ్ బైపాస్ రోడ్డు వద్ద మరో ర్యాంపును నిర్మిస్తామని తెలిపారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న ఎంపీ బాలశౌరికి కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుండి ఎంపీ బాలశౌరికి అత్యధిక మెజార్టీనివ్వాలని మంత్రి కొడాలి నాని విజ్ఞప్తి చేశారు.
addComments
Post a Comment