నల్లగొండలో భారీగా పట్టుబడ్డ గంజాయి.. నిందితుల్లో గ్రామ సర్పంచ్..!

 *నల్లగొండలో భారీగా పట్టుబడ్డ గంజాయి.. నిందితుల్లో గ్రామ సర్పంచ్..!


*నల్లగొండ (ప్రజా అమరావతి);

సులువుగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో గంజాయి సరఫరా చేస్తున్న ఓ ముఠా నల్లగొండ జిల్లా పోలీసులకు అడ్డంగా దొరికింది. రెండు చోట్లలో 481 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురి నిందితులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రెమారాజేశ్వరి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌కు చెందిన గుడ్లారామ్ వెంకటనారాయణ గతం నుంచే గంజయిని సరఫరా చేస్తుండేవాడు. ఇతడిపై ఏపీలో ఓ కేసు కూడా ఉంది. ఈ వ్యాపారం కొనసాగించేందుకు హైదరాబాద్ లోని టోలీచౌక్‌లో పాణిపూరి వ్యాపారం చేసే బాణోతు రమేష్‌ను వెంకటనారాయణ పరిచయం చేసుకున్నాడు. సులువుగా డబ్బు సంపాదించవచ్చని, రెండు కేజీల గంజాయి ప్యాకెట్‌ను విక్రయిస్తే రూ. 500 కమిషన్ ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. తన సోదరుడైన సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం అంగీర గ్రామానికి చెందిన శాంతి కుమార్‌కు బాణోతు రమేష్ ఈ విషయాన్ని వివరించాడు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ మండలం అంగీర గ్రామ సర్పంచ్ బాణోత్ పుండలిక్, బాణోత్ వెంకట్‌కు గంజాయి సరఫరా విషయం చెప్పాడు.

సర్పంచ్ పుండలిక్ మహారాష్ట్రలోని సోలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామానికి చెందిన పూలవ్యాపారి రాహుల్ గుడ్సేకు గంజాయిని విక్రయించడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. వారంతా ఒక ముఠాగా ఏర్పడగా, రాహుల్ గుడ్సే వారి వద్దనుంచి గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రలో పలు దఫాలుగా విక్రయించాడు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామానికి చెందిన కారు డ్రైవర్ పబ్బాల సూర్యప్రకాశ్ తనకు పనికల్పించాలని పాత పరిచయంతో వెంకట్ నారాయణను కోరాడు. దీంతో వెంకట్ నారాయణ సూర్యప్రకాశ్‌ను కారు తీసుకొస్తే పనికల్పిస్తానని చెప్పారు. సూర్యప్రకాశ్ కారు తీసుకు రాగా భద్రాచలం వెళ్లి సత్తిబాబు అనే వ్యక్తిని కలవాలని చెప్పగా, అతను అక్కడి వెళ్లాడు. సత్తిబాబు, సూర్యప్రకాశ్ ఇరువురూ భద్రచలానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒరిస్సా రాష్ట్రంలోని మల్కాజిగిరి దగ్గర గంజాయిని తీసుకుని బయలుదేరారు.

తిరిగి వచ్చే క్రమంలో సత్తిబాబునుని భద్రాచలం దగ్గర దింపి, హైదరాబాద్ వస్తుండగా, నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో ఉన్న పంజాబీ హోటల్ దగ్గర గంజాయిని అప్పజెప్పేందుకుకు రాగా, అక్కడ వెంకట నారాయణ, రమేష్ అతడి స్నేహితులు సిద్ధంగా ఉన్నారు. ముందస్తు సమాచారంతో చిట్యాల, టాస్క్ పోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు. వెంకటనారాయణ పరారు కాగా, సూర్యప్రకాశ్‌తో పాటు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి సుమారు రూ.50 లక్షల విలువైన 460 కిలోల గంజాయితో పాటు 3 కార్లు, రూ.4 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద 21 కేజీలు..

ఒడిస్సాకు చెందిన సుఖంత్ పాడియామి, నీలకంఠ సొంత రాష్ట్రం నుంచి గంజాయిని బస్సులో తరలిస్తుండగా నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్ టోల్ గేట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి రూ.2.10లక్షల విలువైన 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఢిల్లీకి చెందిన మరో ఇద్దరు నిందితులు దీపు సంకార్, రాజును అరెస్టు చేశారు.

Comments