నాణ్యతా ప్రమాణాలే ధ్యేయంగా పని చేయండి....

 నాణ్యతా ప్రమాణాలే ధ్యేయంగా పని చేయండి....



  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్

 తాడేపల్లి (ప్రజా అమరావతి);     క్వాలీటీ కంట్రోల్ బృందాల క్షేత్ర పర్యటనలు ఉపాధి హామీ పనుల నాణ్యతా ప్రమాణాలు పెంచే లక్ష్యంగా ఉండాలని, నిధులు తిరిగి రాబట్టడమే ఉద్దేశ్యంగా ఉండకూడదని, క్వాలీటీ కంట్రోల్ వింగ్ అంటే మెరుగైన ఫలితాల సాధన విభాగ౦గా ఉండాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ అన్నారు. గురువారం అంటే 24-2-2022న తాడేపల్లిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన 13 జిల్లాల క్వాలీటీ కంట్రోల్ సిబ్బంది సమావేశంలో ఆయన మాట్లాడారు.  


ఈ సందర్భంగా  కమిషనర్  మాట్లాడుతూ ఉపాధి హామీలో జరుగుతున్న ప్రతి పనిని జాగ్రత్తగా పరిశీలించి నివేదికలు రూపొందించాలని, రికార్డులో ఉన్న వివరాలకు భౌతికంగా పరిశీలించిన పనులకు మధ్య అంతరాలు ఉన్నప్పుడు తరచుగా పర్యటించి తప్పులు పునరావృతం కాకుండా చూడాలని  క్వాలీటీ కంట్రోల్ సిబ్బందికి సూచించారు. ప్రారంభానికి ముందే పని ప్రదేశాలను సందర్శించి(కాంకరెంట్ క్వాలీటీ ఇన్స్పెక్షన్) నాణ్యతా ప్రమాణాలతో పనులు జరిగేలా క్షేత్ర సిబ్బందికి దిశానిర్దేశం ఇవ్వాలని అంటూ  జాబ్ ఛార్ట్ లోని మార్గదర్శకాలకు అనుగుణంగా మిగిలిపోయిన పనుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తామని కమిషనర్ చెప్పారు. 

సమావేశానికి హాజరైన సీనియర్, జూనియర్ క్వాలీటీ కంట్రోల్ అధికారులతో పేరు పేరునా మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల నాణ్యతా ప్రమాణాలకు ప్రతి ఒక్కరు బాధ్యులేనని, తరచుగా సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ జిల్లాల్లో పటిష్టమైన క్వాలీటీ కంట్రోల్ యంత్రంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని, రాష్ట్ర స్థాయి క్వాలీటీ కంట్రోల్ ప్రత్యేక బృందాలు పునః సందర్శన చేస్తారని లోటుపాట్లు ఉన్నట్లయితే సంబంధిత సిబ్బందిపై  కఠిన చర్యలు తీసుకుంటామని,  అలాగే ఇకపై స్వయంగా  ప్రతి జిల్లాలో రెండు రోజుల పాటు క్షేత్ర సందర్శన చేస్తానని, పనుల పరిశీలన సమయంలో ఫిర్యాదులు వచ్చినట్లయితే అక్కడికక్కడే చర్యలు తీసుకుంటానని 13 జిల్లాల క్వాలీటీ కంట్రోల్ సిబ్బందిని కమిషనర్ కోన శశిధర్ హెచ్చరి౦చారు.  

ప్రభుత్వ ప్రతిష్ట ఉద్యోగుల పనితీరును బట్టే ఉంటుందని, పని చేసే ఉద్యోగులకు గుర్తింపు గౌరవం ఎప్పుడూ ఉంటుందని, కిందిస్థాయిలో క్వాలీటీ కంట్రోల్ విభాగం జరిపే  పర్యవేక్షణలు   ఉన్నతాధికారులకు   కళ్ళు, చెవుల్లా౦టివని, క్వాలీటీ కంట్రోల్ సిబ్బంది   విస్తృత పర్యటనలు జరపాలని, అలాగే కిందిస్థాయి వారికి అవగాహన సమావేశాలు తరచుగా  నిర్వహించి  తద్వారా పనులు జరుగుతున్నప్పుడే పర్యవేక్షణలు జరిపి లోటుపాట్లను సరిదిద్దుకోవచ్చని, పనులు జరిగిన వెంటనే ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లయితే పనుల నాణ్యతా ప్రమాణాలు పెరుగుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ చెప్పారు.     

ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య మాట్లాడుతూ భూమి అభివృద్ధి, రోడ్డుకిరువైపులా మొక్కలు నాటడం, పండ్ల తోటల పెంపకం, ప్రభుత్వ సంస్థలు అభివృద్ధి,  గ్రామీణ రహదారులు, చిన్న నీటి పారుదల పునరుద్ధరణ పనులను ప్రత్యేక దృష్టి సారించి  పరిశీలించాలని, క్వాలీటీ కంట్రోల్ రిజిష్టర్లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. 

చీఫ్ క్వాలీటీ కంట్రోల్ అధికారి సివి. సుబ్బారెడ్డి మాట్లాడుతూ క్షేత్ర పర్యటనల అనంతరం నివేదికలు తాయారు చేసేటప్పుడు ఎం. బుక్, పని ప్రదేశంలోని వాస్తవాలను టాస్కుల వారీగా నమోదు చేయాలని, క్షేత్ర పర్యటన సమయంలో గ్రామ సభ తీర్మానం, సాంకేతిక ఆమోదం వంటి పత్రాలపై ధృవీకరణ సంతకాలు ఉన్నాయో లేదో పరిశీలించాలని, డిమాండ్ అప్లికేషన్, మాస్టర్ రోల్స్, పే ఆర్డర్, మెటీరియల్ వోచర్లు  పత్రాలపై సంబంధిత సిబ్బంది సంతకాలు ఉన్నాయో లేదో ఖచ్చితంగా పరిశీలించాలని  13 జిల్లాల ఎస్.క్యూ.సి.ఓ, జెక్యూసిఓలకు సూచించారు.

Comments