- అశోక్‌బాబు తప్పు చేశారు. దొంగ సర్టిఫికెట్ ఇచ్చారు
- పదోన్నతి పొందారు. అందుకే ఆయనను అరెస్టు చేశారు
- అయినా నిస్సిగ్గుగా చంద్రబాబు ఆయనను సమర్థిస్తున్నారు
- నిజానికి ఆ కేసును మా ప్రభుత్వం నమోదు చేయలేదు
- ఎన్నికల ముందు హామీ మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు
- కృష్ణా జిల్లాకు వంటవీటి పేరు పెట్టాలంటూ టీడీపీ రాజకీయం
- ఆనాడు వంగవీటి రంగాను హత్య చేసింది టీడీపీ నేతలే
- ఇప్పుడు ఆయన పేరుతో మళ్లీ రాజకీయం చేస్తున్నారు
- జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పు పడుతున్నారు
- పుట్టపర్తి, అన్నమయ్య జిల్లాల్లోనూ అనైతిక రాజకీయాలు
- తెలుగుదేశం పార్టీలో ఆ స్థాయిలో నాయకులు దిగజారారు
- అప్పులపైనా చంద్రబాబు నిస్సిగ్గు రాజకీయాలు
- బాబు తన 5 ఏళ్లలో రూ.3.70 లక్షల కోట్ల అప్పులు
- 67 ఏళ్లలో రాష్ట్ర అప్పు రూ.90 వేల కోట్లు మాత్రమే
- 5 ఏళ్లలో చంద్రబాబు అంతకు 4 రెట్లు అప్పులు చేశారు
- అయినా ప్రాజెక్టులు పూర్తి చేయలేదు. మౌలిక వసతులు లేవు
- కరోనా కష్టకాలంలోనూ మా ప్రభుత్వం ఏ ఒక్కటీ ఆపలేదు
- స్కూళ్లు, ఆస్పత్రులను సమూలంగా మారుస్తున్నాం
- రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) వెల్లడి
తాడేపల్లి, ఫిబ్రవరి 11 (ప్రజా అమరావతి): అశోక్‌బాబు తప్పు చేశాడు. టీడీపీ నాయకులు కొందరు, చంద్రబాబునాయుడు కూడా ఉదయం నుంచి ఈ రాష్ట్రంలో జరగరానిది ఏదో జరిగిపోయింది. నీతిమంతుడు, నిజాయితీపరుడు అశోక్‌బాబును అర్ధరాత్రి అరెస్టు చేయడం తప్పు. ఆయన ఏం తప్పు చేశాడని అంటున్నారు.
ఇంటర్ చదివి, నిస్పిగ్గుగా డిగ్రీ చదివానని దొంగ సర్టిఫికెట్ పెట్టి, వేరే వారికి రావాల్సిన ఉద్యోగం పొంది, ఆ తర్వాత ఉద్యోగ సంఘం నాయకుడై, 2013లో రాష్ట్రంలో విభజన భావోద్వేగాలు కొనసాగుతున్న సమయంలో, దాన్ని అడ్డం పెట్టుకుని ఉద్యోగ సంఘాల ముసుగులో చంద్రబాబునాయుడుకు, కిరణ్‌కుమార్‌రెడ్డికి విశ్వాసపాత్రుడిగా ప్రజలను నమ్మించి, ఆ తర్వాత చంద్రబాబునాయుడికి మద్దతు తెలిపి తద్వారా ఎమ్మెల్సీగా ఎన్నికైన అశోక్‌బాబు ఏం తప్పు చేశాడని సిగ్గు లేకుండా అడుగుతున్నారు.
ఇవన్నీ తప్పులు కావా?
దొంగ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పు కాదా? దానితో ఉద్యోగంలో ప్రమోషన్ పొందడం తప్పు కాదా? ఆ విధంగా వేరేవారికి రావాల్సిన అవకాశం అతడు అనుభవించడం తప్పు కాదా?.
నిజానికి ఆ కేసు మా ప్రభుత్వం వచ్చాక పెట్టలేదు. అశోక్‌బాబు సహ ఉద్యోగి ఒకరు ఆరోజు లెటర్ పెట్టాడు. దాన్ని పరిశీలించిన ఎన్నికల సంఘం, లోకాయుక్తకు ఆ కేసు అప్పగిస్తే, విచారించిన లోకాయుక్త ఆ తర్వాత కేసును సీఐడీకి బదలాయించింది. అశోక్‌బాబు దొంగ సర్టిఫికెట్ ఇచ్చాడని నిర్ధారణకు వచ్చిన తర్వాతే రాత్రి అరెస్టు చేస్తే, చంద్రబాబు తీవ్రంగా తప్పు పడుతున్నాడు. గట్టిగా మాట్లాడిన వారిని అరెస్టు చేస్తారా? అంటూ దొంగలన సమర్థిస్తూ, దొంగల ముఠా నాయకుడిగా చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.
ప్రభుత్వంపై నిందలు:
చంద్రబాబు కోసం అశోక్‌బాబు ఎన్ని నీచమైన పనులు చేశాడో ప్రజలందరికీ తెలుసు. నాడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇవాళ అవినీతిపరులను రక్షించడం కోసం ఎలా వ్యవహరిస్తుందో అంతా గమనిస్తున్నారు. అందుకే 23 సీట్లు మాత్రమే ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు. అయినా సిగ్గు శరం లేకుండా చంద్రబాబు దొంగలను వెనకేసుకొస్తూ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడు. అశోక్‌బాబు తప్పు చేశాడు.
ఇక్కడ ఉంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. నీ మాదిరిగా నాలుగు పేపర్లు డబ్బా కొట్టి, లేనిది ఉన్నట్లు చూపి అధికారంలోకి తీసుకొచ్చినట్లు, జగన్‌గారిని ఎవరూ తీసుకురాలేదు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.
కొత్త జిల్లాలపై రాజకీయం:
రాష్ట్రం ఇంకా బాగుండాలి. ప్రజలకు ఇంకా సేవ చేయాలని చెప్పి, ఎన్నికలకు ముందే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేస్తామని జగన్‌గారు ప్రకటించారు. గ్రామాల్లో రైతులకు సేవలందించడానికి భరోసా కేంద్రాలు ఏర్పాటే చేస్తామని కూడా చెప్పారు. అలాగే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయడంతో పాటు, రెవెన్యూ డివిజన్లు కూడా పెంచుతామని ఆనాడే జగన్‌గారు వెల్లడించారు.
ఆ దిశలోనే అన్నీ చేస్తూ, తాజాగా జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ చేస్తూ, పరిపాలనా సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తుంటే, దాన్ని చంద్రబాబు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? అన్నది చెప్పరు.
హిందూపురం జిల్లాను చేయడం తప్పు కాదట. దానికి సత్యసాయి జిల్లా పేరు పెట్టడం కూదా తప్పు కాదంటున్న అక్కడి ఎమ్మెల్యే, జిల్లా కేంద్రాన్ని హిందూపురంలో పెట్టాలని విచిత్రంగా వాదిస్తున్నాడు. మరి ఇక్కడ రాజధాని రాష్ట్రం మధ్యలో ఉంది కాబట్టి పెట్టామంటున్న చంద్రబాబు, అదే పుట్టపర్తి కూడా మధ్యలో ఉంది కాబట్టి, జిల్లా కేంద్రం చేస్తే కాదంటూ, కర్ణాటక సరిహద్దులో ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రం చేయాలని వాదిస్తున్నారు.
అదే విధంగా కడప జిల్లాను విడదీసి రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేస్తున్నారు. దాని మీద అభ్యంతరం లేదు కానీ, జిల్లా కేంద్రం మార్చాలంటున్నారు. నిజానికి భౌగోళికంగా అన్నీ చూసే రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. పరిపాలనా సౌలభ్యం కోసమే ఆ నిర్ణయం.
ఇంకా కోడిగుడ్డుకు ఈకలు పీకినట్లుగా, విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెట్టవద్దని, దాన్ని మచిలీపట్నకు పెట్టి, విజయవాడకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ, టీడీపీ నాయకులు నిస్సిగ్గుగా దీక్ష చేస్తే, కళ్లు లేని కబోధిగా చంద్రబాబు కూర్చున్నాడు. ఎన్టీఆర్‌కు ద్రోహం చేసి, వెన్నుపోటు పొడిచి, ఆయన పదవి పొందిన ద్రోహి చంద్రబాబునాయడు. ఎన్టీఆర్ చనిపోయి 25 ఏళ్లు గడిచినా, ఇప్పుడు కూడా ఆయనకు ద్రోహం చేస్తూ, జిల్లాకు ఆయన పేరు వద్దంటూ ఆ స్థాయికి దిగజారిపోయారు. ఆ విధంగా ఎన్టీఆర్ ద్రోహులు ఇవాళ టీడీపీలో ఉన్నారు.
ఎన్టీఆర్ నిమ్మకూరులో పుడితే, వంగవీటి రంగా కూడా అదే జిల్లాలోని కాటూరులోనే పుట్టారు కదా? ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఎన్టీఆర్ బంధువులు కోరితే, ఆ వెంటనే జగన్‌గారు ఒప్పుకున్నారు. జిల్లాల విభజన చేసి, ఎన్టీఆర్ పేరు పెడతానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి, ఎంతో పేరున్న విజయవాడకు ఎన్టీఆర్ పేరు పెడుతుంటే, అభ్యంతరం చెబుతున్నారు.
రంగాపై ప్రేమ ఉంటే?:
నిజానికి టీడీపీకి వంగవీటి రంగా మీద అంత అభిమానం ఉంటే, ఇన్నాళ్లూ వారు జిల్లాకు ఆ పేరు ఎందుకు పెట్టలేదు? మీరే ఆనాడు రంగాను చంపారు. ఆయన బొమ్మ పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు. ఆయన కుమారుడిని పార్టీలో చేర్చుకుని, వారిని రాజకీయంగా సమాధి చేయాలని చూస్తున్నారు. వంగవీటి రాధకు జిల్లాకు ఆయన తండ్రి పేరు పెట్టించుకోవాలనుకుంటే, ఆయన ఆ పని చేసుకోగలడు. అందుకు మీరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. రంగామీద ప్రేమ ఉంటే, పక్కనే ఉన్న మచిలీపట్నంకు ఆయన పేరు పెట్టాలని కోరేవారు. జగన్‌గారు క్రమంగా ఎదుగుతుంటే, దిక్కు తోచక ఇలాంటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.
మీ అంత అప్పులు చేయలేదు:
చంద్రబాబు ఇవాళ ఇంకోమాట అన్నారు. తాను అధికారం నుంచి దిగిపోయే నాటికి రూ.3.70 లక్షల కోట్ల అప్పు ఉంటే, అది ఇవాళ రూ.6 లక్షల కోట్లు దాటిందని, దానిపై శ్వేతపత్రం డిమాండ్ చేస్తున్నాడు. స్వాతంత్య్రానంతరం 67 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు కేవలం రూ.90 వేల కోట్లు మాత్రమే కాగా, 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక, ఆ 5 ఏళ్లలో రూ.3.70 లక్షల కోట్లు అప్పు చేశాడు. అంటే దాదాపు 4 రెట్లు అప్పు చంద్రబాబు తన 5 ఏళ్ల పాలనలో చేశాడు.
ఇప్పుడు మేము నీ మాదిరిగా అప్పులు చేసి ఉంటే, అవి ఏకంగా రూ.14 వేల కోట్లు దాటాలి. కానీ మా ప్రభుత్వం నీ మాదిరిగా అంత స్థాయిలో అప్పు చేయలేదు. మరి మీ కన్నా ఎక్కువ అప్పు చేశామా? లేక తక్కువ చేశామా?.
ఈ పనులు చేశాం:
మేము అప్పు చేసి రాష్ట్రంలో మౌలిక వసతులు కల్పించాం. స్కూళ్లు, ఆస్పత్రులు సమూలంగా మారుస్తున్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. సచివాలయాలు ఏర్పాటు చేశాం. రైతుల కోసం గోదాములు నిర్మిస్తున్నాం.
కానీ నీవేం చేశావు. గ్రాఫిక్స్ రిలీజ్ చేశావు. పోలవరం పూర్తవుతుందని ప్రచారం చేశావు. కనీసం 10 «శాతం కూడా పనులు కూడా చేయకుండా, గ్రాఫిక్స్ చూపించి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా, రైతులకు కూడా బకాయిలు చెల్లించకుండా పదవి నుంచి దిగిపోయావు.
కోవిడ్‌తో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే, అందరినీ జగన్‌గారు ఆదుకున్నారు. అన్ని వర్గాలకు మేలు చేసే పనులు చేస్తున్నారు. కాబట్టి ఆయన ప్రజలకు మాత్రమే జవాబుదారి. మీ మాదిరిగా దొంగల ముఠా నాయకుడిగా కాదు.
మీకేం అర్హత ఉంది?:
ఇవాళ రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఒకరు మాట్లాడుతున్నారు. ఆయన పేరు ఎత్తడానికి మీకేం అర్హత ఉంది? ఆయన రాజకీయాల్లో ఉన్నారా? మేము కూడా ఖర్జూరనాయుడు పేరు ఎత్తితే ఊర్కుంటారా?
ఉద్యోగ సంఘాల ముసుగులో దొంగ మాటలు చెబితే ఊర్కునేది లేదు.
అశోక్‌బాబు తప్పు చేశాడు. అందుకే ఆయనను అరెస్టు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆయనను కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటారు. అంతేతప్ప, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏ మాత్రం ఉండదు.
ఆనాడు అడ్డుకున్నారు:
చంద్రబాబునాయుడు సిగ్గుతో తల దించుకోవాలి. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండాలి. అభివృద్ధితో పాటు, అధికార వికేంద్రీకరణ కూడా జరగాలని జగన్‌గారు కాంక్షించారు. ఆ మేరకే బిల్లులు కూడా పెట్టాం. దాన్ని కోర్టుకు పోయి ఆపింది టీడీపీ. ఆనాడు మండలిలో కూడా బిల్లును అడ్డుకున్నారు. గ్యాలరీలో కూర్చుని మండలి ఛైర్మన్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఆనాడు బిల్లు ఆపగలిగారు. ఇప్పుడు మళ్లీ బిల్లు పెడతాం. ప్రజల ఆమోదం మేరకు మూడు రాజధానులు చేసి తీరుతాం.
జీఓతోనే సరి:
జగన్‌గారికి దొడ్డిదారులు తెలియవు. దొంగ తెలివితేటలు లేవు. స్టేలు తెచ్చుకోవడం తెలియదు. అవన్నీ చంద్రబాబుకు ఉన్నాయి.
2015లో తాను ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ నిజానికి ఆ మాట ఉద్యోగులు చెప్పాలి. కానీ వారు ఆ మాటలు అనడం లేదు. ఆ తర్వాత మరో ఫిట్‌మెంట్ 2018లో ఇవ్వాలి కదా. కానీ 2019 వరకు చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేదు. కానీ అది ఇవ్వకుండా ఐఆర్ ఇస్తున్నట్లు కేవలం జీఓ మాత్రమే ఇచ్చారు.
అదే జగన్‌గారు సీఎం అయ్యాక, 27 శాతం ఐఆర్ ఇచ్చారు. చంద్రబాబు మాదిరిగా జీఓ మాత్రమే ఇచ్చి ఊర్కోలేదు. రావాల్సిన తేదీ నుంచి ఐఆర్ వర్తింప చేశారు. రైతు రుణమాఫీ చేస్తానన్న చంద్రబాబు, కేవలం జీఓ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఉద్యోగులకు కూడా ఐఆర్ ఇస్తున్నట్లు జీఓ ఇచ్చి, ఊర్కుంటే జగన్‌గారు వచ్చాక ఇచ్చారు.
చంద్రబాబుకు రెండు, మూడు డబ్బా ఛానళ్లు ఉన్నాయి. వాటిని నమ్ముకుంటే ప్రజలు నమ్ముతారన్న నమ్మకంతో ఉన్నారు. అందుకే విపరీత ప్రచారం మినహా, వాస్తవ అమలు లేదు.
చంద్రబాబుకు దమ్ముంటే:
చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టును ఏటీఎం మాదిరిగా వాడుకుంటున్నారని స్వయంగా ప్రధానిగారు చెప్పారు. చంద్రబాబుకు నిజంగా ధైర్యం, దమ్ము ఉంటే, తాను అవినీతికి పాల్పడలేదని అనుకుంటే నల్ల చొక్కా వేసుకుని, ఢిల్లీలో ప్రధాని నివాసం వద్ద బైఠాయించి ప్రధానిని నిలదీయాలి. అంతేతప్ప, మమ్మల్ని అడగడం కాదు.
సినీ పరిశ్రమ మేలు కోరే..:
సినిమా టికెట్ల రేట్లు పెంచినా, తగ్గించినా, సినీ పరిశ్రమ కోసం మంచి పనులు చేసినా.. ఇలా ఏది చేసినా కూడా చంద్రబాబుకు, ఆయనకు మద్దతు ఇచ్చే ఎల్లో మీడియాకు తప్పుగానే కనిపిస్తుంది.
గతంలో సినిమా టికెట్ల రేట్లు పెంచమని ఆ పరిశ్రమ కోరితే, చంద్రబాబు 5 ఏళ్లూ కమిటీ కూడా ఏర్పాటు చేయలేదు. దాంతో వారు కోర్టును ఆశ్రయించారు. మరి అప్పుడు ప్రభుత్వం చేసింది తప్పు కాదా?
బెనిఫిట్‌షోల పేరుతో ఇష్టారాజ్యంగా టికెట్ ధరలు నిర్ణయిస్తే, అది సరికాదంటూ సీఎంగారు కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయమన్నారు. పరిశ్రమలో అందరితో మాట్లాడడం సాధ్యం కాదు కాబట్టి, పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవితో సీఎంగారు మాట్లాడారు. ఆ తర్వాత అందరితో చర్చించి, అందరికీ ప్రయోజనం కలిగేలా నిర్ణయానికి వస్తే, దాన్నీ తప్పు పడుతున్నారు.
చర్చల్లో ఎవరినీ బెదిరించలేదు. సీఎంగారికి ఏమైనా ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉన్నాయా? చంద్రబాబు తన పాలనలో సినీ పరిశ్రమ కోసం చేసిందేమీ లేదు. కేవలం తన స్వప్రయోజనాలు, ఆయన తొత్తుల ప్రయోజనాలు, కొందరు వ్యక్తుల మేలు కోసమే ఆయన పని చేశారు.
జగన్‌గారికి ఆ విధంగా ఏ స్వార్థం లేదు.
అసత్య ఆరోపణలు:
చంద్రబాబుకు ఏ విధంగానూ ప్రజల మద్దతు లేదు. అందుకే ఇలా మీడియాను, వ్యవస్థలను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడు. లేనిపోని ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు. కాసినో అని, కోడి పందాలు అని, అశోక్‌బాబుకు అక్రమంగా అరెస్టు చేశారంటూ.. ఇలా అర్ధం లేని విమర్శలు చేస్తున్నాడు. అశోక్‌బాబుకు అర్ధరాత్రి అరెస్టు చేశాడంటున్నాడు. మరి అర్ధరాత్రి కనిపించే చంద్రుడి పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నాడు. సూర్యుడి పేరు పెట్టుకోవచ్చు కదా?.
గుడివాడలో నా కన్వెన్షన్‌లో కాసినో నిర్వహించానని, ఎల్లో మీడియా 15 రోజులు విపరీతంగా దుష్ప్రచారం చేశారు. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఎందుకంటే అందులో వాస్తవం లేదు కాబట్టి.
రాష్ట్ర సమస్యలపై మా పార్టీ ఎంపీలు చాలాసార్లు పార్లమెంటులో ప్రస్తావించారు. అదే టీడీపీ ఎంపీలు ఎంతసేపూ చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే మాట్లాడారు. వారికి ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలు పట్టలేదు.. అని ప్రెస్‌మీట్‌లో మంత్రి కొడాలి నాని వివరించారు.
addComments
Post a Comment