4న ఏఎన్ యూ వేదికగా
'మహిళా పార్లమెంట్'
- మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి
అమరావతి (ప్రజా అమరావతి):
ఈనెల నాలుగో తేదీన జాతీయ మహిళా కమిషన్ భాగస్వామ్యంతో రాష్ర్టంలో 'జాతీయ మహిళా పార్లమెంట్'ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. గురువారం ఆమె కమిషన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వేదికగా మహిళా పార్లమెంట్ ను నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఉపముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పుష్పశ్రీ వాణి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, విడదల రజినీ, ఉండవల్లి శ్రీదేవితో పాటు పలువురు ఎమ్మెల్సీలు హాజరు కానున్నట్టు చెప్పారు. మహిళా పార్లమెంట్ లో భాగంగా మహిళా సాధికారత, బాలిక విద్య, వివాహ వయసు పెంపు, లింగసమానత్వం, మహిళా చట్టాల అమలు, చట్టాల్లో రావాల్సిన మార్పులు, మహిళల ఆరోగ్యం, భద్రత, రక్షణ తదితర అంశాల ప్రధాన అజెండాగా చర్చ కొనసాగనుందని వాసిరెడ్డి పద్మ వివరించారు. ఇందుకోసం ఇప్పటికే ఆయా సమస్యలు, అంశాలపై పనిచేస్తున్న ప్రభుత్వ, ఇతర ఎన్జీవో సంస్థలను ఆహ్వానించామని..ఆర్ధిక, సామాజిక, రాజకీయ,, విద్య, క్రీడలు, మీడియా, పారిశ్రామిక, సినిమా, కళలు తదితర రంగాలకు చెందిన మహిళలు పెద్ద ఎత్తున మహిళా పార్లమెంట్ కు హాజరు కానున్నట్లు చెప్పారు. చర్చించదగిన అంశాలపై నివేదికలు ఇప్పటికే తయారు చేశామని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్ కొనసాగనుందన్నారు. ఇందులో మహిళలకు సంబంధించిన అన్ని అంశాలపై పలు తీర్మానాలను ఆమోదించనున్నట్లు... వాటన్నింటినీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికల రూపంలో సమర్పించనున్నట్లు ఆమె వివరించారు. మహిళా పార్లమెంట్ లో పాల్గొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల నుంచి మహిళా ఉద్యోగులు, యూనివర్సిటీలు, కాలేజీలు, కస్తూర్బా బాలికల పాఠశాలలు, ఇతర ఎన్జీవోల నుంచి దాదాపుగా 500 మందికి పైగా ప్రతినిధులు రానున్నట్లు వెల్లడించారు. విలేకరుల సమావేశంలో మహిళా కమిషన్ సభ్యులు గజ్జల లక్ష్మి, కర్రి జయశ్రీ, గడ్డం ఉమ, బూసి వినీత, షేక్ రుకియాబేగం, కమిషన్ కార్యదర్శి శైలజ పాల్గొన్నారు.
addComments
Post a Comment