విద్యార్ధులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నాం
పాము కాటుతో విద్యార్ధి మృతి దురదృష్టకరం
ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
విజయనగరం, మార్చి 04 (ప్రజా అమరావతి):
పాము కాటుకు గురై కురుపాం మహాత్మా జ్యోతిరావుపూలే గురుకుల కళాశాలలో విద్యార్ధి మృతి చెందడం విచారకరమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. పాముకాటుకు గురైన విద్యార్ధులను ఉప ముఖ్యమంత్రి శుక్రవారం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ఉదయాన్నే వెళ్లి పరామర్శించారు. విద్యార్ధులకు అందిస్తున్న చికిత్స గురించి వైద్యులతో ఆరా తీశారు. ఆసుపత్రిలోనే వుంటూ విద్యార్ధులకు అందిస్తున్న చికిత్సను పర్యవేక్షిస్తున్న జాయింట్ కలెక్టర్ డా.ఆర్.మహేష్ కుమార్ ఉప ముఖ్యమంత్రికి చికిత్స వివరాలను తెలిపారు.
పాముకాటుకు గురైన విద్యార్ధులకు వైద్యసహాయం అందించడంలో ఎక్కడా లోపం జరగలేదని పాముకాటుకు గురైన వెంటనే కురుపాంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు విద్యార్ధులను తరలించి ప్రాథమిక చికిత్స అందించారని చెప్పారు. అనంతరం వైద్యుల సూచన మేరకు ముగ్గురినీ మరింత మైరుగైన చికిత్స కోసం పార్వతీపురంలోని ఏరియా ఆసుపత్రికి తరలించగా వారు కూడా తమ శాయశక్తులా విద్యార్ధులకు చికిత్స అందించారని, విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రికి తరలించాలని వారు సూచించగా, తల్లిదండ్రుల అంగీకారంతో ముగ్గురు విద్యార్ధులను విజయనగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. విజయనగరంలో ఆసుపత్రికి తీసుకువచ్చే లోపే మార్గమధ్యంలోనే రంజిత్ కుమార్ అనే విద్యార్ధి మరణించారని వివరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన ఇద్దరు విద్యార్ధుల్లో ఒకరు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని, మరో విద్యార్ధి పరిస్థితి నిలకడగానే వుందన్నారు. విద్యార్ధులు ఇద్దరికీ మెరుగైన వైద్యసహాయం అందించేలా ఇప్పటికే జిల్లా అధికారులను ఆదేశించామని, వారిద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.
addComments
Post a Comment