రెండేళ్ళలో వెయ్యి ఆలయాలు నిర్మిస్తాం

 రెండేళ్ళలో వెయ్యి ఆలయాలు నిర్మిస్తాం



– అప్పలాయగుంటలో టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, శాసన సభ్యురాలు శ్రీమతి రోజా

తిరుపతి 4 మార్చి (ప్రజా అమరావతి): ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు రాబోయే రెండేళ్ళలో తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన, ఎస్సీ, బిసి ప్రాంతాల్లో వెయ్యి ఆలయాలు నిర్మిస్తామని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.
వడమాలపేట మండలం అప్పలాయగుంటలో రూ 3 కోట్ల 40 లక్షలతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపాన్ని ఎమ్మెల్యే శ్రీమతి రోజా తో కలసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలోను, అనంతరం మీడియాతోను చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

ఎమ్మెల్యే శ్రీమతి రోజా వినతి మేరకు అప్పలాయగుంటలో రూ.3 కోట్ల 40 లక్షలతో మూడు అంత‌స్తుల్లో క‌ల్యాణ మండ‌పం నిర్మించామన్నారు.

సకల సదుపాయాలతో, తక్కువ అద్దెకు 700 మంది ఆహ్వానితులతో ఇక్కడ పెళ్ళి చేసుకోవచ్చన్నారు. ఆలయంలో రూ.2 కోట్ల 25 లక్షలతో ప‌లు అభివృద్ధి ప‌నులు చేపట్టామన్నారు.

ఎమ్మెల్యే అభ్యర్థన మేరకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరిలో దేశమ్మ ఆలయ అభివృద్ధికి రూ. కోటి 20 లక్షలు, పుత్తూరు ద్రౌపతి ఆలయ అభివృద్ధికి రూ కోటి 25 లక్షలు, నిండ్రలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి రూ.కోటి 70 లక్షలు మంజూరు చేశామన్నారు. పుత్తూరు లో శివాలయం కోనేరు అభివృద్ధి కి రూ 25 లక్షలు మంజూరు చేశామని, మరిన్ని అభివృద్ధి పనులకోసం నిధులు మంజూరు చేస్తామని శ్రీ సుబ్బారెడ్డి తెలిపారు. నగరిలో టీటీడీ కళ్యాణమండపం మంజూరు చేస్తామని చెప్పారు.
శాసనసభ్యురాలు శ్రీమతి రోజా మాట్లాడుతూ, చెన్నై నుంచి భక్తులు నడుచుకుంటూ వచ్చి అప్పలాయగుంటలో స్వామివారి దర్శనం చేసుకుని తిరుమలకు పోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు. టీటీడీ కళ్యాణమండపాల్లో పెళ్లి చేసుకుంటే వధూవరులకు స్వామివారి ఆశీస్సులు లభించినట్లేనన్నారు. అప్పలాయగుంటలో అన్ని సౌకర్యాలతో, తక్కువధరతో పెళ్ళి చేసుకునేలా టీటీడీ కళ్యాణమండపం నిర్మించడం సంతోషమన్నారు.ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమని శ్రీమతి రోజా చెప్పారు. కళ్యాణ మండపం మంజూరు చేసి, నిర్మాణం పూర్తి చేయించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

టీటీడీ కళ్యాణ మండపంలో పెళ్ళి చేసుకుంటే స్వామివారి కృప, కటాక్షాలు లభించినట్లేనని టీటీడీ ధర్మ కర్తల మండలి సభ్యులు శ్రీ పోకల అశోక్ కుమార్ చెప్పారు. అప్పలాయగుంటలో టీటీడీ అన్ని వసతులతో మంచి కళ్యాణమండపం నిర్మించిందని ఆయన చెప్పారు.

జెఈవో లు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి బాయి, ఎస్ఈలు శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీ సత్యనారాయణ, అదనపు సివి ఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఈఈ శ్రీ నరసింహమూర్తి, విజిఓ శ్రీమనోహర్, మండల పరిషత్ అధ్యక్ష్యురాలు శ్రీమతి విజయలక్ష్మి, సర్పంచ్ శ్రీ శేషాద్రి రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Comments