రమ్య హత్య కేసులో దోషికి
తొమ్మిది నెలల్లో ఉరిశిక్ష
- ఇది 'దిశ' చట్టం స్ఫూర్తి.
- మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందన
అమరావతి (ప్రజా అమరావతి):
గుంటూరులో ఉన్మాది కత్తిపోట్లకు బలైన రమ్య హత్యకేసు నిందితునికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునివ్వడం సర్వత్రా హర్షణీయమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఇది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'దిశ' చట్టం స్ఫూర్తిగా ఆమె స్పష్టం చేశారు. కోర్టు తుదితీర్పు వెలువడగానే శుక్రవారం ఆమె మీడియా ముందు స్పందించారు. ఘటన జరిగిన ఆరు రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయడం.. హత్యకేసు నిందితుడికి తొమ్మిది నెలల్లో ఉరిశిక్ష ఖరారనేది రికార్డ్ బ్రేక్ అన్నారు. మహిళల కేసుల్లో అత్యంత వేగంగా విచారణలు, శిక్షలు ఖరారవడమనేది సత్వర న్యాయానికి మార్గమన్నారు.
మహిళా సంక్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'దిశ' చట్టాన్ని తేవడంతో పాటు రమ్య హత్య ఘటనపై ఆయన తీవ్రంగా చలించి బాధిత కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకున్నారని వివరించారు. కేసు విచారణ, చార్జిషీట్ పూర్తి చేయడంలో ముఖ్యమంత్రి సూచనలతో పోలీసులు పకడ్బందీగా సాక్ష్యాలను సేకరించారని వాసిరెడ్డి అన్నారు. ప్రత్యేక కోర్టు శరవేగంతో విచారణ, శిక్ష ఖరారు వెనుక పోలీసుల శ్రమ,
మహిళల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తుందన్నారు. ఈ కేసు విచారణ పట్ల పోలీసు యంత్రాంగం కృషిని.. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని స్వయాన జాతీయ ఎస్సీ కమిషన్ సైతం మెచ్చుకుందని ఆమె గుర్తు చేశారు. దోషికి కోర్టు విధించిన ఉరిశిక్ష శరవేగంగా అమలు చేసే వరకు మహిళాలోకం, సమాజం బాధ్యత తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ పిలుపునిచ్చారు.
addComments
Post a Comment