- జీవ వైవిధ్యం పై సచివాలయంలో మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
అమరావతి (ప్రజా అమరావతి):
రాష్ట్రంలో జీవ వైవిధ్యంను పరిరక్షించేందుకు ఏర్పాటు చేసిన బయో డైవర్సిటీ బోర్డ్ నిబంధనలను అన్ని పరిశ్రమలు, సంస్థలు ఖచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. సచివాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బయో డైవర్సిటీ యాక్ట్ - 2002 సవరణలపై కేంద్రం నుంచి వచ్చిన ప్రతిపాదనలను అధికారులు మంత్రికి వివరించారు. దేశ వ్యాప్తంగా జీవ వైవిధ్యంను పరిరక్షించేందుకు నిర్ధేశించిన ఈ చట్టంలో పలు సవరణలు తీసుకువస్తూ పార్లమెంట్ ప్రతిపాదనలు చేసిందని, దానిపై అన్ని రాష్ట్రాల బోర్డ్ లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి తమ సిఫారస్ లను పంపాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్బంగా కేంద్రం చేసిన సవరణల వల్ల ఏర్పడే పర్యవసానాలు, రాష్ట్రంలో జీవ వైవిధ్యంపై అనుసరిస్తున్న విధానాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వివరించారు. అనంతరం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పలు ప్రభుత్వరంగ విభాగాలకు చెందిన నిపుణులతో కూడిన బోర్డ్ ఈ సవరణలపై చర్చించి, ప్రజలకు మేలు చేసేలా, పర్యావరణం, జీవ వైవిధ్యానికి విఘాతం లేకుండా సహేతుకమైన ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు. మానవాళి మనుగడతో పాటు జీవ వైవిధ్యంను కూడా కాపాడుకోవాలని, ప్రజల్లో ఈ మేరకు అవగాహనను పెంచాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్, (అటవీ, పర్యావరణం), డాక్టర్ బిఎంకె రెడ్డి (ఎపి బయో డైవర్సిటీ బోర్డ్ చైర్మన్), డాక్టర్ డి.నళిని మోహన్ (పిసిసిఎఫ్, మెంబర్ సెక్రటరీ), చిరంజీవి చౌధరి (పిసిసిఎఫ్), బికె సింగ్ (ఎండి, ఎఫ్ బిసి), డి.ప్రమీల (ఆత్మ డైరెక్టర్), కె.బాలాజీనాయక్ (హార్చీకల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్), డాక్టర్ పివి చలపతిరావు (ఇఎఫ్ ఎస్ ఇటి) తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment