అనాది నుంచి నదీ తీరాల్లోనే నాగరికత వెల్లివిరిసింది.

 

బలభద్రపురం. తూ.గో.జిల్లా (praja amaravati);


*తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం, బలభద్రపురంలో గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌- క్లోర్‌ ఆల్కలీ మ్యానుఫ్యాక్చరింగ్‌ సైట్‌ ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌*.


*ముఖ్యమంత్రితో పాటు కార్యక్రమానికి హాజరైన ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార మంగళం బిర్లా*.


*ఈ సందర్భంగా కుమార మంగళం బిర్లా ఏమన్నారంటే..*:


అందరికీ నమస్కారం. ఇక్కడ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారికి ఘన స్వాగతం పలుకుతున్నాను. అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలందరికీ ప్రత్యేకంగా స్వాగతం చెబుతున్నాను.

మనందరికీ తెలుసు. ప్రపంచ చరిత్ర చూస్తే, అనాది నుంచి నదీ తీరాల్లోనే నాగరికత వెల్లివిరిసింది.



అదే కోవలో గోదావరి నది గురించి కూడా మనం ఎంతో ఘనంగా విన్నాం. ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఈ ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇవాళ ఇక్కడ ఈ పరిశ్రమను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీన్ని ఒక చరిత్రాత్మక ఘట్టంగా మేము భావిస్తున్నాము. పారిశ్రామిక రంగంలో ఆంధ్రప్రదేశ్‌ మరింత పురోగమించేలా ఆదిత్య బిర్లా గ్రూప్‌ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తుందని, ఆ దిశలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని  తెలియజేస్తున్నాను.

ఇవాళ ఇక్కడ బలభద్రపురంలో ప్రారంభిస్తున్న తొలి క్లోర్‌ ఆల్కలీ ఉత్పత్తి కేంద్రం మా రసాయన పరిశ్రమల వాణిజ్య విభాగంలోనూ, మా ఆదిత్య బిర్లా గ్రూప్‌లోనూ ఒక మైలురాయిలా నిల్చిపోనుంది. గత కొన్నేళ్లుగా వ్యాపార విస్తరణతో ముందుకు వెళ్తున్న ఆదిత్య బిర్లా గ్రూప్, అన్ని విధాలుగా ఎంతో అనుకూలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు కూడా తరలి వచ్చింది. ఇక్కడ మేము రెండు బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టాం. 

మా ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఆరు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అందులో ఒకటి సిమెంట్‌ ఉత్పత్తి. గ్రూప్‌నకు చెందిన అల్ట్రా టెక్‌ సిమెంట్‌ ఉత్పత్తిలో ఇక్కడ రెండు యూనిట్లు పని చేస్తున్నాయి. వాటి ఉత్పాదక సామర్థ్యం ఏటా 10 మిలియన్‌ టన్నులు. ఆదిత్య ఫ్యాషన్‌ రిటెయిల్‌ బిజినెస్‌. రాష్ట్రంలో 105 స్టోర్లు పని చేస్తున్నాయి. ఇటీవలే మా గ్రూప్‌ గార్మెంట్‌ ఉత్పత్తి కేంద్రానికి కడపలో గౌరవ ముఖ్యమంత్రి భూమి పూజ చేశారు. ఇది రాష్ట్రంలో మా తొలి గార్మెంట్‌ యూనిట్‌ కాగా, అందులో ఏటా 1.8 మిలియన్ల గార్మెంట్లు తయారు చేస్తాం. తద్వారా మంచి ఉపాధి అవకాశాలు కూడా కల్పించబోతున్నాం.

ఇక మా గ్రూప్‌నకు చెందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ (ఫైనాన్షియల్‌ బిజినెస్‌) కూడా రాష్ట్రంలో చెప్పుకోదగిన స్థాయిలో, చాలా బలంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 50 శాఖలు, దాదాపు 100 ఛానళ్ల ద్వారా పని చేస్తున్నాయి.

వీటన్నింటి కార్యకలాపాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో మా గ్రూప్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 10 వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. వారంతా కూడా మా ఆదిత్య బిర్లా గ్రూప్‌ కుటుంబ సభ్యులు. 

ఇవాళ ఇక్కడ ప్రారంభిస్తున్న క్లోర్‌ అల్కలీ ఉత్పత్తి కేంద్రం, రాష్ట్రంతోనూ, సీఎంగారితోనూ, ముఖ్యంగా ఇక్కడి ప్రజలతో మాకున్న అనుబంధానికి ప్రతీకగా నిలుస్తోంది. రాష్ట్రంలో వివిధ రంగాలకు సంబంధించి వ్యాపార కార్యకలాపాలకు విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు విశాలమైన తీర ప్రాంతం ఉంది. అలాగే మల్టీ మోడల్‌ కనెక్టివిటీ. మంచి సామర్థ్యం కలిగిన మానవ వనరులు, అత్యుత్తమ అర్హత, నైపుణ్యం కలిగిన కార్మికులు, ఉద్యోగులు (వర్క్‌ఫోర్స్‌) ఇక్కడ ఉన్నారు. అన్నింటికి మించి అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందించే ప్రభుత్వం, అధికారం యంత్రాంగం ఇక్కడ పెట్టుబడులకు ముఖ్య ఆకర్షణగా నిలుస్తున్నాయి. అందువల్ల పెట్టుబడుల రంగంలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. 

ఇక మంచి విజన్‌ కలిగిన యువ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు కూడా ఉన్నారు. అందుకే ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి, తూర్పు గోదావరి జిల్లాలో పారిశ్రామిక రంగం పురోగతిలో పాలు పంచుకుంటున్నందుకు ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఎంతో ఆసక్తి చూపుతోంది. 

రాష్ట్రంలో పెద్ద జిల్లాగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా, సాంస్కృతిక వికాస కేంద్రంగా కూడా విరాజిల్లుతోంది. ఇక్కడ మా యూనిట్‌ నెలకొల్పడంలో జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా, అడుగడుగునా అండగా నిల్చింది.

ఈ సందర్భంగా మా గ్రూప్‌నకు చెందిన రసాయన విభాగం, దాని వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియజేస్తున్నాను.

మా గ్రూప్‌ రసాయన విభాగం విశ్వవ్యాప్తంగా 2.4 బిలియన్‌ డాలర్ల ఆదాయం పొందుతోంది. భారత్, థాయిలాండ్, జర్మనీ, అమెరికాలో ప్రధానంగా పని చేస్తూ, దాదాపు 80 దేశాల్లో 1000కి పైగా ఉత్పత్తులు కొనసాగిస్తోంది. మా గ్రూప్‌ రసాయన విభాగంలో క్లోర్‌ ఆల్కలీ వ్యాపారం ముఖ్యమైంది కాగా, ఇది భారత్‌లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాం. దేశంలో ఇది అగ్రస్థానంలో ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా 15 అగ్ర కంపెనీల్లో ఒకటిగా నిలుస్తోంది.

ఇవాళ బలభద్రపురంలో ప్రారంభిస్తున్న ఈ యూనిట్‌ దేశంలో 8వది కాగా, ఇది దేశంలో తూర్పు, పశ్చిమ కారిడార్‌లో మా వ్యాపారాన్ని మరింత బలతోపేతం చేయడంలో కీలకంగా నిలవనుంది. క్లోర్‌ ఆల్కలీ పరిశ్రమల విభాగంలో ఆ తరహాలో (తూర్పు పశ్చిమ కారిడార్‌) ఇది తొలి యూనిట్‌. ఆ విధంగా బలభద్రపురం యూనిట్‌ ప్రత్యేకత గుర్తింపు పొందుతోంది. అంతే కాకుండా దేశంలో ఉన్న మిగతా అన్ని క్లోర్‌ ఆల్కలీ యూనిట్ల కంటే ఇక్కడ అత్యధికంగా ఉత్పత్తి కానుంది. ఏటా ఇక్కడ 1.5 లక్షల టన్నుల ఉత్పత్తి జరగనుంది. దేశీయంగానూ, విశ్వవ్యాప్తంగానూ ఇక్కడి ఉత్పత్తులు ఎగుమతి కానున్నాయి.

ఏ మాత్రం కాలుష్యానికి తావు లేకుండా, పూర్తి పర్యావరణ హితంగా ఉండే విధంగా ఈ యూనిట్‌ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే కాస్టిక్‌ సొడా అనేక పరిశ్రమల అవసరాలు తీర్చనుంది. 2019లో ఈ ప్లాంట్‌ పనులు మొదలుపెట్టాం. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌ వల్ల ప్రతికూల పరిస్థితులు తలెత్తినా పనులు కొనసాగించి పూర్తి చేశాం. జర్మనీ టెక్నాలజీతో, అత్యుత్తమ ప్రమాణాలతో, ప్రపంచ స్థాయిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఇదంతా సీఎం శ్రీ వైయస్‌ జగన్‌తో పాటు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం నిరంతర అండ, సహకారంతోనే సాధ్యమైంది. ఇక్కడ తొలుత రూ.1000 కోట్లు పెట్టుబడి పెడతామని, ఆ తర్వాత దశల వారీగా మొత్తం రూ.2500 కోట్లు పెడతామని చెప్పాం. ఇక్కడ ప్రాథమికంగా 1000 మందికి ఉపాధి లభిస్తుంది. అది క్రమంగా పెరిగి తుది దశలో మొత్తం 2400 మందికి ఉపాధి లభిస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వాటిలో స్థానికులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. 

రానున్న కొన్ని నెలల్లో ఈ ప్రాంతంలో పలు సామాజిక కార్యకలాపాలు కూడా నిర్వహించబోతున్నాం. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక అభివృద్ధి కోసం ఖర్చు చేయబోతున్నాం.

ఇక ఈ ప్లాంట్‌ ప్రారంభానికి మరో సందర్భం కూడా ఉంది. మా గ్రాసిమ్‌ కంపెనీ ఇప్పుడు 75వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. దేశ స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 10 రోజుల్లోనే, అంటే 1947లో మా తాతగారు జీడీ బిర్లా దాన్ని ప్రారంభించారు. అక్కడ మొదలైన మా ప్రస్థానం, ఆ తర్వాత మరిన్ని రంగాలకు విస్తరించింది.

ఆ దిశలోనే ఇవాళ బలభద్రపురం యూనిట్‌ కూడా ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాం. ఇక్కడ మా ప్లాంట్‌ ఏర్పాటుకు ప్రతి అడుగులో అండగా, నిల్చి ఎంతో సహకారం అందించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో ఈ బంధం ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ.. మరోసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.

Comments