ప్రతిభావంతుల గుర్తింపు, ప్రోత్సాహం కోసమే స్పోర్ట్స్ క్లబ్ ల ఏర్పాటు
క్రీడాంధ్రప్రదేశ్ లక్ష్యంగా 2022 స్పోర్ట్స్ పాలసి తీసుకురానున్నాం: మంత్రి ఆర్ కె రోజా
తిరుపతి, ఏప్రిల్ 21 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో మారుమూల ప్రాంతాలలో ప్రతిభ గల క్రీడాకారుల గుర్తింపు లక్ష్యంగా 2022 క్రీడా పాలసీ తీసుకురానున్నట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాలు, యువజన సర్వీసులు, క్రీడల శాఖమాత్యులు ఆర్ కె రోజా అన్నారు. గురువారం ఉదయం స్థానిక ఎస్.వి.యు.సెనేట్ హాల్ నందు గ్రామీణ స్థాయి స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు పై స్పోర్ట్స్ అథారిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ డా.వాణి మోహన్, విసి మరియు సాప్ ఎం.డి. ప్రభాకరరెడ్డి లతో కలసి మంత్రి అధ్యక్షతన జరిగిన సమీక్షకు జిల్లాలోని పిడీలు, క్రీడా సంఘల ప్రతినిధులు హాజరయ్యారు.
గౌ. క్రీడా శాఖ మంత్రి మాట్లాడుతూ తామి మంత్రిగా మొదటి రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రపదేశ్ (శాప్) సమీక్ష తిరుపతి శ్రీవారి పాదాల చెంత ఏర్పాటు చేయడం సంతోషంగా వుందని శాప్ ద్వారా ప్రతిభగల క్రీడా కారులను గుర్తించి ప్రోత్సాహం ఇవ్వడమే లక్ష్యంగా క్రీడల పాలసీ తీసురానున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రికెట్ ఆటగాడుగా స్పోర్ట్స్ పై అవగహన వున్న నేపద్యంలో త్వరలో క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్ది అందరూ మనవైపు తిరిగి చూసేలా పిల్లలకు చదువుతోపాటు, క్రీడల పై ప్రోత్సాహం కల్పించనున్నామని అన్నారు. గ్రామీణ, మండల స్థాయి స్పోర్ట్స్ క్లబ్ ల ఏర్పాటుతో పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రోత్సాహం కల్పించిన వారు అవుతామని, అందుకే నేడు ఈ సమీక్ష అని, చీఫ్ కోచ్ లు, పిడి లు, క్రీడా సంఘాల నాయకుల సలహాలు సూచనులు తీసుకుని ఒక విధానపరమైన పాలసీ తీసుకురానున్నామని తెలిపారు. ప్రార్థించే చేతులుకన్నా, సహాయం చేసే చేతుల మిన్న అని ఎంతో మంది టోర్నమెంట్లు ఏర్పాటు చేస్తున్నారని, గుర్తింపు లేనందున ప్రతిభ చాటుకోలేని వారు ఏంతో మంది వున్నారని, అందుకే శాప్ ద్వారా ఒకే తాటి పైకి తెచ్చి గుర్తింపు వచ్చేలా చేయడానికే ఈ సమీక్ష అని అన్నారు. నేను కూడా ముఖ్యమంత్రి జన్మ దినాన్ని పురస్కరించుకుని ఒక విద్యార్థినిని దత్తత తీసుకుని చదివించడం, గ్రామీణ క్రీడలు నిర్వహించి ప్రోత్సహించడం, ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని సౌకర్యాలు కల్పించడం వంటివి చేస్తున్నానని అన్నారు. దాతలు ఈ క్రీడా క్లబ్ లకు సహకారం అందించి ప్రోత్సహించాలని, త్వరలో జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన సర్పంచ్ లకు, ఎంపిడిఓ లకు, మున్సిపల్ కమీషనర్ లకు, చైర్మన్ లకు, మేయర్ లకు సమీక్ష నిర్వహించి క్రీడా ప్రతిభ వెలికి తీసే ప్రయత్నంలో క్రీడా మైదానాలు గుర్తించడం, ఎక్కడికక్కడ ప్రతిభ గల వారిని ప్రోత్సహించడం వంటివి చేపట్టనున్నామని తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారులైనా! ఒలంపియాడ్ ప్రతిభ గల పి.వి.సింధు అలాగే మన జిల్లా వాసి, నా స్వస్థలం అయిన భాకరాపేట కు చెందిన హాకీ క్రీడాకారిణి రజని, శ్రీకాంత్ వంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించిందని, వీరిని కూడా గతంలో మనం ముందుగా గుర్తించలేదని, మెడల్స్ సాధించిన తరువాతే గుర్తించామని, అందుకే క్రీడా క్లబ్ ల ఏర్పాట్లతో ప్రతిభ గల వారిని గుర్తించి క్రీడాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యం అని అన్నారు. గత 3 సం.లుగా జాతీయ స్థాయిలో మెడల్స్ అందుకున్న వారికి ప్రోత్సాహకంగా 1,428 మంది క్రీడాకారులకు రూ.4.58 కోట్లు అందించామని తెలిపారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలలో ఎస్.సి ల కొరకు సోషల్ వెల్ఫేర్ శాఖ సహకారంతో క్రీడా కళాశాల ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. శాప్ ద్వారా జాతీయ క్రీడల పోటీలు, ప్రతి సంవత్సరం జిల్లాలలో సిఎం కప్ పోటీలు మండల, రాష్ట్ర స్థాయిలో నిర్వహణ, స్పోర్ట్స్ క్లబ్ ల ఏర్పాట్లతో అథ్లెటిక్స్ క్రీడల ప్రోత్సాహం, పాటశాలల్లో కళాశాలల్లో విద్యతో పాటు క్రీడల ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వలన దేహదారుడ్యం బాగుండి ఆరోగ్యవంతులుగా ఉంటారని అన్నారు.
సమావేశం ప్రారంభంలో ప్రిన్సిపాల్ సెక్రటరీ డా. వాణీ మోహన్, విసి మరియు ఎండి శాప్ ప్రభాకర్ రెడ్డి పవర్ పాయింట్ ద్వారా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రపదేశ్ నిర్వహిస్తున్న క్రీడలను, అందిస్తున్న ప్రోత్సాహాలు, మెడల్స్ ను వివరించి విద్యార్థులకు క్రీడల ప్రోత్సాహం ఇవ్వగలిగితే 50 సం. వయసు తరువాత కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని వివరించారు.
ఈ సమీక్ష ప్రారంభానికి ముందు ఎస్.వి యూనివర్సిటీ నందు గల శ్రీవారి ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఈ సమీక్షలో శాప్ అధికారులు రామ కృష్ణ, మహేష్, సి ఇ ఓ మురళి కృష్ణ, చీఫ్ కోచ్ లు బాలాజీ, ఉమా శంకర్, ఏ ఓ జయరామయ్య, వివిధ కళాశాలల పి డి లు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment