న్యూఢిల్లీ – ఏప్రిల్ 2, (ప్రజా అమరావతి);
ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఘనంగా శుభకృత్ సంవత్సర ఉగాది ఉత్సవాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్ (ఏ.ఆర్.సీ) హిమాన్షు కౌశిక్ ల ఆధ్వర్యంలో శుభకృత్ నామ సంవత్సర ఉగాది ఉత్సవములు నేడు ఆంధ్రప్రదేశ్ భవన్ లో ప్రారంభమయ్యాయి. ఏ.పీ భవన్ పరిసరాల్లో ఏర్పాటు చేసిన ఏ.పీ మార్క్ ఫెడ్, ఏ.పీ సివిల్ సప్లైస్, ఆప్కోస్, డ్వాక్రా, గిరిజన్ కో-ఆపరేటివ్ కార్పొరేషన్ (జీ.సీ.సీ), లేపాక్షి సంస్థల అంగళ్లను పీ.ఆర్.సీ, ఏ.ఆర్.సీ ప్రారంబించారు. ఆయా అంగళ్లలో లభించే వివిధ ఉత్పత్తులను పరిశీలించి, వాటి గూర్చి తెలుసుకున్నారు. అనంతరం మజ్లిస్ ఆర్ట్ ఫోరంకు సంబంధించిన కళాఖండాల ప్రదర్శనను ప్రారంభించారు.
మొదటగా టీ.టీ.డీ కళాకారుల నాదస్వరంతో కార్యక్రమం ప్రారంభమైనది. పీ.ఆర్.సీ, ఏ.ఆర్.సీ లు జ్యోతిప్రజ్వలన గావించిన అనంతరం వేదపండితులు వారిరువురిని మంత్రోచ్చారణలతో ఆశీర్వదించారు. తదనంతరం వేదపండితులు పంచాంగ శ్రవణం గావించారు. ఈ శుభకృత్ నామ సంవత్సరంలో వర్షాలు బాగా పడి, పంటలు బాగా పండుతాయని పండితులు తెలిపారు. ఈ ఏడాదిలో దీపావళి రోజున సూర్య గ్రహణం, కార్తీక పౌర్ణమి రోజున చంద్ర గ్రహణం ఏర్పడనున్నాయని వెల్లడించారు.
అరకు గిరిజన కళాకారులచే థింసా నృత్య ప్రదర్శన ఉత్సవములకు విచ్చేసిన వారిని ఎంతో ఆకట్టుకుంది. చిన్నారులు తమ చిత్రలేఖన ప్రవీణ్యతను ప్రదర్శించి బహుమతులు పొందారు. వినాయక నాట్య మండలి (సురభి) కళాకారులు ‘మాయా బజార్’ నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.
ఆంధ్రప్రదేశ్ భవన్ అంతా అంగరంగవైభవంగా విద్యుతదీపాలతో, పుష్పాలతో అలంకరించారు. ప్రజలు ఈ కార్యక్రమానికి తండోపతండాలుగా వచ్చారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవములలో ఉదయం 10.30, మధ్యాహ్నం 2, రాత్రి 10.30 కు ఆర్.ఆర్.ఆర్ చలనచిత్రం మూడు షోలు ప్రదర్శిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో నోరూరించే ఆంధ్ర రుచులు, పిండి వంటలకు సంబందించిన వివిధరకాల అంగళ్లు మరియు వస్తుప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఉత్సవములకు హాజరయ్యేవారికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలైన అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ కనకదుర్గ, కాణీపాకం దేవస్థానాల వారి ప్రసాదాలు, ఉగాది పచ్చడి, ఉచిత ఆంధ్ర సంప్రదాయ విందు భోజన వితరణను ఆంధ్రప్రదేశ్ భవన్ అధికారులు ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి విచ్చేసిన వారికి వేద పండితులు, జ్యోతీష్యులు ఉచితంగా జాతకం విశేషాలను తెలియజేశారు.
addComments
Post a Comment