ధైర్యశాలి 'శ్రావణి'ని అభినందించిన 'వాసిరెడ్డి పద్మ'

 ప్రచురణార్ధం


ధైర్యశాలి 'శ్రావణి'ని అభినందించిన 'వాసిరెడ్డి పద్మ'


అమరావతి (ప్రజా అమరావతి): 

డ్యూటీ ముగించుకుని రాత్రిపూట ఇంటికి బైక్ పై వెళుతుండగా అడ్డగించి వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ధైర్యశాలి శ్రావణిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభినందించారు. గతేడాది అక్టోబరులో చోటుచేసుకున్న ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ కావడంతో.. ధైర్యశాలి శ్రావణి గురించి వాసిరెడ్డి పద్మ ఆరాతీసి, శుక్రవారం ఆమెతో ఫోన్ లో మాట్లాడారు. ఆరోజు జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.  డైరీ ఉద్యోగిగా పనిచేస్తూ, విధులు ముగించుకుని ఒంటరిగా బైక్ పై వస్తున్న తనను గన్నవరం సమీపాన కీసరపల్లి వద్ద ఓ ఆటో డ్రైవర్ అడ్డగించాడని శ్రావణి చెప్పారు. అంతలో అటుగా వస్తున్న రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర నేత బోరుగడ్డ అనీల్ ఈ ఆకతాయి వేధింపును గమనించి తనకు అండగా నిలిచి పోలీసులకు ఫోన్ చేశారని.. అప్పటికే తాను కోపంతో ఆ అకతాయికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఎదిరించినట్లు శ్రావణి వివరించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ ఆమె ధైర్యసాహసాన్ని మెచ్చుకున్నారు. సాటి మహిళలకు ఆదర్శంగా నిలిచావంటూ ప్రశంసించారు. మహిళా కమిషన్ కార్యాలయంలో కలిసేందుకు శ్రావణిని ఆహ్వానించారు. ఆమెకు తాను అండగా ఉంటానని  వాసిరెడ్డి పద్మ భరోసానిచ్చారు. మహిళ కష్టాల్లో ఉన్న పరిస్థితిని గమనించి సకాలంలో స్పందించి అండగా నిలిచిన రిపబ్లికన్ పార్టీ నేత బోరుగడ్డ అనీల్ ను మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అభినందించారు.

Comments