.
*- సచివాలయంలో ఎర్రచందనంపై మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష*
*- ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం*
*- రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లతో పటిష్ట నిఘా*
*- ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకుని స్మగ్లింగ్ కు చెక్*
*- టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తాం, సిబ్బంది కొరత లేకుండా చూస్తాం*
*- త్వరలో కర్ణాటక, తమిళనాడు పోలీస్, అటవీశాఖలతో సమన్వయ సమావేశాలు*
*- అవసరమైతే పొరుగు రాష్ట్రాల మంత్రుల స్థాయి సమావేశం కూడా నిర్వహిస్తాం*
*- రాష్ట్రంలో ప్రస్తుతం 5376.043 మెట్రిక్ టన్నుల సీజ్ చేసిన ఎర్ర చందనం నిల్వలు*
*- వీటిని విక్రయించేందుకు సిఐటిఇఎస్ మేనేజ్ మెంట్ అథారిటీ అనుమతి కోరాం*
*- ఈ నిల్వలను విక్రయించడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుంది.*
*- దీని ద్వారా వచ్చే సొమ్ము నుంచి 30 శాతం వరకు ఎర్రచందనం కన్సర్వేషన్ కు వినియోగించుకోవచ్చు*
*: మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి*
అమరావతి (ప్రజా అమరావతి):
ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు త్వరలోనే సరిహద్దు రాష్ట్రాల అటవీ, పోలీస్ అధికారులతో సమన్వయ సమావేశాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన శాఖమంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. సచివాలయంలో అటవీ, పోలీస్ అధికారులతో ఎర్రచందనంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తక్షణం పక్కరాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు పోలీస్, అటవీశాఖలతో ఉన్నతాధికారుల స్థాయి సమన్వయ సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. సీఎం శ్రీ వైయస్ జగన్ గారితో చర్చించి అవసరమైతే పొరుగు రాష్ట్రాల మంత్రుల స్థాయి సమావేశం కూడా వీలైతే మన రాష్ట్రంలో కానీ, లేదా తమిళనాడు, కర్ణాటకలో కానీ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడమే ధ్యేయంగా ప్రభుత్వపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో స్మగ్లర్ల సమాచారంను పంచుకోవాలని, పాత నేరస్తుల కదలికలపై మరింత నిఘా పెంచాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో 5.30 లక్షల హెక్టార్ లలో ఎర్రచందనం నిల్వలు ఉన్నాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. కడప, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో విస్తరించి ఉన్న ఎర్రచందనం నిల్వలు స్మగ్లర్ల బారిన పడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్ పోస్ట్ లతో నిఘాను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకుని స్మగ్లింగ్ కు పూర్తిస్థాయిలో చెక్ పెట్టాలని కోరారు. ఎర్రచందనంపై ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ను బలోపేతం చేస్తామని, సిబ్బంది కొరత లేకుండా చూడటంతో పాటు అవసరమైన అన్ని వనరులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో అనుమానిత ప్రాంతాల్లో కూంబింగ్ ను ముమ్మరం చేయాలని, పట్టుబడిన వారిపై పిడి యాక్ట్ కింద కేసులు నమోదు చేసి, కఠిన శిక్ష పడేలా చూడాలన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 5376.043 మెట్రిక్ టన్నుల సీజ్ చేసిన ఎర్ర చందనం నిల్వలు ఉన్నాయని తెలిపారు. వీటిని విక్రయించేందుకు సిఐటిఇఎస్ మేనేజ్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి కోరామని వెల్లడించారు. నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు వచ్చిన తరువాత ఈ నిల్వలను విక్రయించడం ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుందని, దీని ద్వారా వచ్చే రెవెన్యూ నుంచి 30 శాతం వరకు ఎర్రచందనం కన్సర్వేషన్ కు వినియోగించుకోవచ్చని తెలిపారు.
2015-22 వరకు ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ 1852 నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసిందని, దీనిలో 1375 చార్జిషీట్ లను దాఖలు చేయగా మరో 477 కేసుల్లో చార్జిషీట్ దాఖలు చేయాల్సి ఉందని వీటిని కూడా వెంటనే ఎగ్జిక్యూట్ చేయాలని అన్నారు. అలాగే అక్రమ రవాణాకు వినియోగించిన 1762 వాహనాలను సీజ్ చేసి, వాహనదారులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అటవీశాఖ ఆధ్వర్యంలో మొత్తం 193 బేస్ క్యాంప్ లు ఉంటే, వాటిల్లో ఎర్ర చందనం అక్రమ రవాణాని నియంత్రించేందుకు 86 బేస్ క్యాంప్ లను ఏర్పాటు చేశామని, అవసరమైతే వీటి సంఖ్యను పెంచుకునే అంశాన్ని పరిశీలిస్తామని అన్నారు. మొత్తం 52 స్ట్రయికింగ్ ఫోర్స్ లు ఉంటే ఎర్రచందనం నిల్వలు ఉన్న ప్రాంతంలో 30 స్ట్రయికింగ్ ఫోర్స్ లు పనిచేస్తున్నాయని, అలాగే 121 చెక్ పోస్ట్ లు ఉంటే, ఎర్ర చందనం నిల్వలు ఉన్న ప్రాంతాల్లో 50 చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేసి నిఘాను కొనసాగిస్తున్నామని తెలిపారు. స్మగ్లింగ్ ని నియంత్రించేందుకు అనుమానిత ప్రాంతాల్లో 42 హై రిజల్యూషన్ కెమేరాలను అటవీశాఖ ఏర్పాటు చేసిందని, దీనితో పాటు శాటిలైట్ ఇమేజ్ లు, సెన్సార్ యంత్రాలు, డ్రోన్ ల వినియోగం, జియో రిఫరెన్సింగ్ వంటి పరిజ్ఞానంను కూడా వినియోగించుకోవాలని కోరారు. అలాగే వాహనాల నంబర్ ప్లేట్ లను గుర్తించేందుకు ఆటోమేటిక్ కెమేరాలు, పాత నేరస్తులను గుర్తించేందుకు ఫేస్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్, వెహికిల్, కార్గో స్కానర్ ల ఏర్పాటును ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని అన్నారు.
ఈ సమీక్షలో నీరబ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ (అటవీ, పర్యావరణం), ప్రతీప్ కుమార్, అటవీదళాల అధిపతి (పిసిసిఎఫ్), ఆర్పీ ఖజూరియా (పిసిసిఎఫ్), అడిషనల్ పిసిసిఎఫ్ (విజిలెన్స్) గోపీనాథ్, సెంథిల్ కుమార్, డిఐజి టాస్క్ ఫోర్స్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment