*చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి
*
*పారిశ్రామికవేత్తలకు అనువుగా..పరిశ్రమలకు నెలవుగా...*
*అనంతపురం, శ్రీ సత్యసాయిల్లో విరివిగా పారిశ్రామిక భూములు*
*విద్యుత్ , నీరు, రోడ్డు వంటి సదుపాయాలతో సకలం సిద్ధం*
*ఓ వైపు బెంగళూరు..మరోవైపు హైదరాబాద్ ఉండడం మరింత లాభదాయకం*
*కరవుసీమ నుంచి పారిశ్రామికసీమగా మారనున్న అనంతపురం*
అమరావతి, ఏప్రిల్, 26 (ప్రజా అమరావతి): చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు విరబూయనున్నాయని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. వేలాది ఎకరాలలో పరిశ్రమలు కళకళలాడనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కరవుసీమ ఇకపై పారిశ్రామిక సీమగా అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. పారిశ్రామికవేత్తలకు అనువుగా...పరిశ్రమలకు నెలవుగా అనంతపురం, హిందుపురం ప్రాంతాలు మారనున్నట్లు ఛైర్మన్ తెలిపారు. విద్యుత్, నీరు, రోడ్డు వంటి సకల సదుపాయాలున్న భూములు పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతున్నాయన్నారు. ఓ వైపు బెంగళూరు, మరో వైపు హైదరాబాద్ వంటి మహా నగరాలకు సమీపంగా ఉండడం మరింత లాభదాయకమన్నారు. పుట్టపర్తి విమానాశ్రాయం సమీపంలోని ఐదు గ్రామాల పరిధిలో ఏకంగా 3615.84 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని ఏపీఐఐసీ గుర్తించిందని ఛైర్మన్ తెలిపారు. కప్పలబండ, బీడుపల్లి, బ్రామనపల్లి,పుట్టపర్తి, ఎనుమలపల్లి గ్రామాలలోని భూములన్నీ పారిశ్రామికవేత్తలు కోరుకునే విధంగా జాతీయ రహదారి పక్కనే ఉన్నట్లుగా ఆయన వివరించారు. కప్పలబండలో ఇప్పటికే 50 ఎకరాలలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కు ఏర్పాటైందని, మరో 53 ఎకరాలలో మరో పారిశ్రామిక పార్కు ఏర్పాటు కూడా పూర్తి చేసినట్లు ఛైర్మన్ వెల్లడించారు. అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం టేకులోడు గ్రామంలో కూడా పారిశ్రామిక భూములు పుష్కలంగా ఉన్నట్లు తెలిపారు. 230 ఎకరాలకు పైగా ఉన్న ఏపీఐఐసీ భూములలో టేకులోడు వద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి స్పష్టం చేశారు. మరో 880 ఎకరాల భూములను గుర్తించి వాటినీ స్వాధీనం చేసుకునేందుకు ఏపీఐఐసీ ప్రణాళిక పూర్తి చేసింది. బెంగళూరు విమానాశ్రయం కేవలం 92 కి.మీ దూరంలో ఉన్న టేకులోడు వద్ద డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటుకు ఏపీఐఐసీ కసరత్తు చేస్తోంది.
*24 గంటలూ నీరు, నిరంతరాయంగా విద్యుత్ : ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*
నాణ్యమైన విద్యుత్, నీరు అందిస్తే ఎంత ధరైనా చెల్లించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకువస్తున్నారని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. అన్నింటి కంటే మౌలికవసతులు ప్రధానమనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనను ఏపీఐఐసీ ఆచరణలో పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏపీఐఐసీ భూములలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనతోపాటు నాణ్యమైన విద్యుత్, నీరు నిరంతరాయంగా అందించే విధంగా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ భూములను జాతీయ రహదారులకు అనుసంధానం చేస్తూ అంతర్గత రహదారుల అభివృద్ధి, ఉమ్మడి మురుగునీటి శుద్ధి వంటి ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని గుడిపల్లిలో ఇప్పటికే 1800 ఎకరాల భూములను గుర్తించి, అందులో ఇప్పటికే 1111 ఎకరాల భూమిని ఏపీఐఐసీ అభివద్ధి చేసింది. ఇప్పటికే జిల్లాలో చిన్న, సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించే విధంగా మూడు ఎంఎస్‌ఎంఈ పార్కులను ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. అనంతపురం జిల్లా కోటిపి, రాప్తాడు, కప్పలబండలో ఈ పార్కులను అభివృద్ధి చేయడానికి ఏపీఐఐసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం మొత్తం రూ.18.11 కోట్లు వ్యయం చేయనున్నట్లు ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. రూ.7.46 కోట్లతో కోటిపి ఎంఎస్‌ఎంఈ పార్కు, రూ.4.83 కోట్లతో రాప్తాడు పార్కు, రూ.5.82 కోట్లతో కప్పలబండ పార్క్‌లను అభివృద్ధి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్కొక్కటి సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కులలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
addComments
Post a Comment