*- గ్లామర్ తో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న కొడాలి నాని
*
*- ప్రభుత్వంలోనూ కలిసొచ్చిన జగన్ - కొడాలి సెంటిమెంట్*
*- స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లోనూ వైసీపీ వరుస విజయాలు*
*- మూడేళ్ళుగా వైసీపీకి పెరుగుతూ వస్తున్న ఓటింగ్ శాతం*
*- జగన్ పై కొడాలి నానికి ఏ మాత్రం తగ్గని ఆరాధనా భావం*
*- ఎన్టీఆర్ అభిమానులతోనూ కొడాలికి అవినాభావ సంబంధం*
*- ఎన్టీఆర్ బంధు వర్గాన్ని జగన్ దగ్గరకు తీసుకెళ్ళిన కొడాలి*
*- ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటులోనూ కొడాలి నాని కీలకపాత్ర*
*- బాబు లోగుట్టు కొడాలికి ఎరుకన్నది జగమెరిగిన సత్యం*
*- టీడీపీని భూస్థాపితం చేసే దిశగా కొడాలి నాని అడుగులు*
గుడివాడ, ఏప్రిల్ 9 (ప్రజా అమరావతి): రాష్ట్ర రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ నాని తన గ్లామర్ తో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. గత 30 ఏళ్ళలో కొడాలి నాని అంచెలంచెలుగా ఎదగడానికి ఆయనకు ఉన్న గ్లామర్ కారణమన్నది జగమెరిగిన సత్యం. సహచర మంత్రిగా పనిచేసిన పేర్ని వెంకట్రామయ్య (నాని) ఒక సందర్భంలో కొడాలి నానికి సినిమా స్టార్ కు మించి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. అంతటి గ్లామర్ కల్గిన కొడాలి నాని సీఎం జగన్మోహనరెడ్డితో కలవడం కూడా ప్రభుత్వానికి కలిసొచ్చింది. జగన్ - కొడాలి నాని కాంబినేషన్ ను సెంటిమెంట్ గా భావించే వారూ ఉన్నారు. కరోనా సంక్షోభంలోనూ సంక్షేమాన్ని సీఎం జగన్మోహనరెడ్డి అమలు చేస్తుండగా, కొడాలి నాని మాత్రం వాటికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రతిపక్షాలను తనదైన శైలిలో కట్టడి చేస్తూ వచ్చారు. గత మూడేళ్ళలో రాష్ట్రంలో పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, కార్పోరేషన్, ఉప ఎన్నికలు జరిగాయి. కొడాలి నాని అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. దీంతో కొడాలి నాని సెంటిమెంటు పార్టీ, ప్రభుత్వంలోనూ బలం చేకూరుతూ వచ్చింది. ఒక దశలో టీడీపీ ఎన్నికల నుండి వైదొలిగే పరిస్థితి కూడా వచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ మూడేళ్ళలో గణనీయంగా పెరుగుతూ రావడం విశేషం. మంత్రి పదవిని చేపట్టిన కొడాలి నాని గత మూడేళ్ళ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చారు. ఎక్కడికి వెళ్ళినా చిన్నా, పెద్దా తేడా లేకుండా కొడాలి నానిని కలిసేందుకు, ఆయనతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎక్కువగా ఆసక్తి చూపడం కన్పిస్తుంది. రాజకీయ సభలు, సమావేశాల్లో పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహాన్ని కనబర్చేవి. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ఏడాది పొడవునా కొడాలి నానిని కలిసేందుకు గుడివాడ పట్టణానికి ఎంతో మంది అభిమానులు వస్తూనే ఉంటారు. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాల్లో కొడాలి నాని ఫ్లెక్సీలు పెద్దఎత్తున దర్శనమిస్తుంటాయి. అటువంటి కొడాలి నానికి సీఎం జగన్ పై ఆరాధనా భావం ఏ మాత్రం తగ్గడం లేదు. తొలిసారి ఎమ్మెల్యేగా గెల్చినపుడు దివంగత రాజశేఖరరెడ్డిని దగ్గరగా చూసి ఆయనకు అభిమానిగా మారిపోయారు. జగన్ ను అక్రమ కేసుల్లో నిర్బంధిస్తే రెండేళ్ళ ముందుగానే ఎమ్మెల్యే పదవిని వదులుకుని ఆయన వెంట నడిచారు. నేటి వరకు తెలుగుదేశం పార్టీ వైపు కన్నెత్తి చూడకుండానే చంద్రబాబుకు, ఆయన పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. తమకన్నా సీఎం జగన్ ఎక్కువగా బాధపడుతున్నారంటూ ఆయనపై ఉన్న ఆరాధనా భావాన్ని కొడాలి నాని మరోసారి బయటపెట్టుకున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో ప్రజాపంపిణీ వ్యవస్థపై సీఎం జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీ మేరకు పౌరసరఫరాల శాఖను నడిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ డోర్ డెలివరీ విధానానికి నాంది పలికారు. డోర్ డెలివరీ డెమో వాహనాన్ని గుడివాడ ఆటోనగర్లో తయారు చేయించి జగన్ ను మెప్పించారు కొడాలి నాని. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులతోనూ మంత్రి కొడాలి నానికి మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు వచ్చిన సీఎం జగన్ దగ్గరకు ఎన్టీఆర్ బంధువులు, గ్రామస్థులను తీసుకువెళ్ళారు. అధికారంలోకి వస్తే ఎన్టీఆర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేస్తానని సీఎం జగన్ తో ప్రకటన చేయించారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పడడానికి మంత్రి కొడాలి నాని కీలకపాత్ర పోషించారు. ఎన్టీఆర్ అభిమానులతో కలిసి గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఎదుట ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కొడాలి నాని క్షీరాభిషేకం చేయడంతో పాటు నిమ్మకూరులో భారీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం జగన్ అనుమతి కూడా తీసుకున్నారు. ఇదే సమయంలో చంద్రబాబు లోగుట్టు కూడా కొడాలి నానికే ఎరుక అని రాష్ట్ర ప్రజలందరితోనూ అనిపించుకోవడం వెనుక కన్పించని శత్రువుతో పెద్ద యుద్ధమే చేశారన్నది కూడా జగమెరిగిన సత్యం. ఎన్టీఆర్ కు జరిగిన ద్రోహాన్ని వివరిస్తూ ఆయన అభిమానులతోనే తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడంతో పాటు చంద్రబాబు, లోకేష్ లను రాజకీయ సమాధి చేసే దిశగా కొడాలి నాని అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
addComments
Post a Comment