ధాన్యం అమ్మిన రైతులకు ఈనెల 20 నుండి సొమ్ము చెల్లింపు ప్రారంభం
• మిల్లర్లతో సంబంధం లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే సొమ్ము చెల్లింపు
• హమాలి,రవాణా చార్జీలను పిఏసిఎస్ ల ద్వారా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తోంది
• క్వింటాల్ కామన్ రకానికి 1940 రూ.లు,గ్రేడ్-ఎ రకం 1960 రూ.లు మద్దత్తు ధర
• 37లక్షల టన్నులు కొనాలని అంచనా కాగా ఇప్పటికే 14.37లక్షల టన్నులు కొన్నాం
• 6.99 లక్షల మంది రైతులు ఇకెవైసి చేసుకోవాల్సి ఉండగా ఇప్పటికే 5.47 లక్షల మంది రైతులు ఇకెవైసి చేసుకోగా ఇంకా లక్షా 52 వేల మంది చేసుకోవాల్సి ఉంది
• ప్రత్యేక డ్రైవ్ ద్వారా పూర్తిస్థాయిలో ఇకెవైసిలు పూర్తి చేసేలా జెసిలను ఆదేశించాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు
అమరావతి,19 మే (ప్రజా అమరావతి):రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం అమ్మిన రైతులకు ఈనెల 20 వతేది శుక్రవారం నుండి రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము చెల్లించే ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర పౌరసరఫరాల శాఖామాత్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు.గురువారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధాన్యంలో దోపిడి అని ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వచ్చిన వార్త నిరాదారం,అవాస్తవమని ఆయన ఖండించారు. ప్రభుత్వం రైతుకు మేలు చేయాలనే లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పారదర్శకంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని దీనిలో మిల్లర్ల పాత్రేమీలేదని స్పష్టం చేశారు.ఎవరైతే ధాన్యాన్ని విక్రయించారో ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో సొమ్ము చెల్లించడం జరుగుతుందని చెప్పారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తెచ్చి అమ్మిన రైతులకు అందుకయ్యే రవాణా,హమాలీ చార్జీలను కూడా ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ప్రభుత్వమే చెల్లిస్తోందని మంత్రి నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనాలని ఒక అంచనా కాగా ఇప్పటికే 14 లక్షల 37వేల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా ఎంత ధాన్యం వచ్చినా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కామన్ రకం ధాన్యం కింటాల్ కు 1940 రూ.లు,ఎగ్రేడ్ రకం ధాన్యానికి 1960 రూ.ల మద్ధత్తు ధరతో కొనుగోలు చేయడం జరుగుతోందని తెలిపారు.6 లక్షల 99 వేల మంది రైతులు ఇకెవైసి చేసుకోవాల్సి ఉండగా ఇప్పటి వరకూ 5 లక్షల 47 వేల మంది రైతులు ఇకెవైసి చేసుకున్నారని ఇంకా లక్షా 52 వేల మంది చేసుకోవాల్సి ఉందని అన్నారు.అన్ని జిల్లాల్లోను ఇకెవైసిని ప్రత్యేక డ్రైవ్ ద్వారా యుద్ద ఫ్రాతిపదికన పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే జిల్లా సంయుక్త కలక్టర్లు,పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించిన్నట్టు పౌరసరఫరాల శాఖమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమీషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ ధాన్యం అమ్మే రైతు వారి పంటకు సంబంధించి ఇకెవైసి పూర్తయితే తప్ప వారికి సొమ్ము చెల్లించడానికి వీలుండదని స్పష్టం చేశారు.ఇప్పటికే ఇకెవైసి చేసుకున్న రైతులకు ఎలాంటి సమస్యలేదని కొత్తగా ధాన్యం అమ్మే రైతులు మాత్రం ఇకెవైసి చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తేమ 17 శాతం వరకూ అనుమతిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.ధాన్యాన్ని అమ్మిన రైతు బ్యాంకు ఖాతాకే సొమ్ము చెల్లిస్తుండడంతో మిల్లర్ల పాత్రేమి దీనిలో ఉండదని గిరిజా శంకర్ స్పష్టం చేశారు.గత తుఫానుతో దెబ్బతిన్న ధాన్యం కొనుగోలుకు మరిన్ని మినహా ఇంపులు ఇవ్వాలని కేంద్రానికి వ్రాశామని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యాన్ని ఏవిధంగా కొనాలనే దానిపై అన్ని రైతు భరోసా కేంద్రాల సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ,అవగాహనా కార్యక్రమాలను నిర్వహించామని కమీషనర్ గిరిజా శంకర్ స్పష్టం చేశారు. ఎక్కడైనా మిల్లర్లు రైతులను తప్పుదారి పట్టించి మోసం చేయాలనే ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు.ఇప్పటికే విజయనగం జిల్లాల్లో ముగ్గురు మిల్లర్లపై చర్యలు తీసుకున్నామని ఆయన మీడియాకు వివరించారు.
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ ఇక్రాప్ బుకింగ్ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని జెసిలను ఆదేశించినట్టు చెప్పారు.అలాగే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఇకెవైసిని పూర్తి చేయాలని ఆదేశించామని ఇకెవైసి లేకున్నా ధాన్యం కొనుగోలుకు ఎలాంటి ఆటంకం లేదని వీరపాండ్యన్ స్పష్టం చేశారు.
addComments
Post a Comment