రైతు భరోసా-పియం కిసాన్ కింద ఇప్పటి వరకూ 23వేల 875కోట్ల రూ.ల సాయం
• నాల్గవ విడత రైతు భరోసా-పియం కిసాన్ కింద 3 వేల 758 కోట్ల రూ.లు పంపిణి
• రైతులకు ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ లక్షా 10 వేల కోట్ల రూ.ల సహాయం
• 2 వేల కోట్ల రూ.లతో ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏర్పాటు
• జూన్ 6న రైతు రధం పధకం ప్రారంభం-సియంచే 3 వేల ట్రాక్టర్లు పంపిణీ
• అసని తుఫాన్ నష్టం అంచనాల ప్రక్రియ కొనసాగుతోంది-ప్రాధమిక అంచనాల ప్రకారం 6వేల హెక్టార్లతో పంటలు నష్టం
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి
అమరావతి,మే 16 (ప్రజా అమరావతి):ఈప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకం కింద ఇప్పటి వరకూ రైతులకు 23 వేల 875 కోట్ల రూ.ల సహాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ,సహకార,మార్కెటింగ్, ఆహారశుద్ధి శాఖామాత్యులు కాకాని గోవర్ధన రెడ్డి వెల్లడించారు.సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ రైతాంగానికి వివిధ పధకాల కింద లక్షా 10 వేల కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని పేర్కొన్నారు.వైయస్సార్ రైతు భరోసా-పియం కిసాన్ పధకాన్ని2019 అక్టోబరులో నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారని గుర్తు చేశారు.అప్పటి నుండి ప్రతి యేటా మూడు విడతలుగా 7 వేల 500 రూ.లు,4వేల రూ.లు,2వేల రూ.లు వంతున ప్రతి రైతుకు ఏడాదికి 13వేల 500 రూ.ల సహాయాన్ని అందిస్తున్నామని చెప్పారు.సీజన్ ప్రారంభం కాకముందే పంటల సాగుకు వీలుగా రైతులకు ఈపధకం కింద సహాయం అందించడం జరుగుతోందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి తెలిపారు.ఈఏడాదికి సంబంధించి తొలివిడత సహాయాన్ని సోమవారం ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో 3758 కోట్ల రూ.లను జమ చేశారని చెప్పారు.2019-20 ఏడాదిలో 46 లక్షల 69 వేల మంది రైతులకు రూ.6 వేల 173 కోట్లు,2020-21లో 51 లక్షల 59 వేల మంది రైతులకు రూ.6 వేల 928 కోట్లు,2021-22 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి 52లక్షల 38వేల మంది రైతులకు 7 వేల 16 కోట్ల రూ.లను జమచేయడం జరిగిందని మంత్రి గోవర్ధన రెడ్డి తెలిపారు.
ఈప్రభుత్వం అధికారానికి వచ్చాక రైతులకు సున్నావడ్డీ పధకం,పంటల బీమా వంటి వివిధ పధకాల ద్వారా ఇప్పటి వరకూ లక్షా 10వేల కోట్ల రూ.లను ఖర్చు చేయడం జరిగిందని మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి పేర్కొన్నారు.అదే విధంగా రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు వంటివి రైతులకు సకాలంలో అందిస్తున్నట్టు చెప్పారు.ఈప్రభుత్వం వచ్చాక 16 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు ఫల సాయం వచ్చిందని,48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా పండిందని మంత్రి మీడియాకు వివరించారు.
సకాలంలో వర్షాలు పడడం,పూర్తి స్థాయిలో సాగు నీరు అందించడంతో ఈప్రభుత్వం అధికారానికి వచ్చాక గత 35 మాసాల్లో రాష్ట్రంలో ఒక్క మండలాన్ని కూడా కరవు మండలంగా ప్రకటించ లేదని వ్యవసాయ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి స్పష్టం చేశారు.2వేల కోట్ల రూ.లతో ప్రత్యేకంగా ప్రకృతి వైపరీత్యాల నిధి(Calamity Fund)ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు.
జూన్ 6న సియం జగన్మోహన్ రెడ్డిచే రైతు రధం పధకం ప్రారంభం-3వేల ట్రాక్టర్లు పంపిణి
వ్యవసాయ యాంత్రీకరణ ప్రక్రియలో భాగంగా జూన్ 6వ తేదీన రైతు రధం పధకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి రైతులకు 3 వేల ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారని వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి వెల్లడించారు.
అసని తుఫాను పంట నష్టం అంచనా వేగవంతంగా జరుగుతోంది:మంత్రి కాకాని
రాష్ట్రంలో ఇటీవల సంభవించిన అసని తఫాను కారణంగా దెబ్బతిన్న పంటల నష్టం అంచనా ప్రక్రియ శరవేగంగా సాగుతోందని మంత్రి గోవర్ధన రెడ్డి చెప్పారు.ప్రాధమిక అంచనాల ప్రకారం సుమారు 6 వేల హెక్టార్లలో వ్యవసాయ,ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తోందని అన్నారు.నియమనిబంధనల ప్రకారం నష్టం అంచనాల ప్రక్రియ పూర్తికాగానే నష్ట పోయిన రైతులందరికీ తగిన నష్ట పరిహారాన్నిఅందించడం జరుగుతుందని మంత్రి గోవర్ధన రెడ్డి మీడియాకు వివరించారు.
addComments
Post a Comment