పేదల సంక్షేమంలో రాజీపడం
ప్రజల శ్రేయస్సే ముఖ్యమంత్రి లక్ష్యం
రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ
సచివాలయ వ్యవస్థ ప్రయోజనాలను వివరించిన మంత్రి
దిశ యాప్ పనితీరును ప్రయోగాత్మకంగా పరీక్షించిన బొత్స
గజపతినగరం (విజయనగరం), మే 07 (ప్రజా అమరావతి) ః
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ, పేదల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడేది లేదని, సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని, రాష్ట్ర విద్యాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. పథకాల ద్వారా పేద ప్రజలకు మేలు చేస్తుంటే, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. గజపతినగరం మండలం తుమ్మికాపల్లిలో రూ.40లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయాన్ని, రూ.21.80లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని, రూ.18లక్షలతో నిర్మించిన ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామసభలో, గ్రామ సచివాలయ వ్యవస్థ పనితీరును, దానివల్ల కలిగిన ప్రయోజనాలను ప్రత్యక్షంగా, వివరించారు. మహిళా పోలీస్, ఎఎన్ఎం, గ్రామ సర్వేయర్, డిజిటల్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ తదితర సచివాలయ కార్యదర్శుల విధులను వారిచేతే చెప్పించి, వారి ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను, అంకెలతో సహా వివరించారు. అవి అందుతున్నాయా లేదా అని ప్రజలను ప్రశ్నించగా, పథకాలన్నీ తమకు అందినట్లు ప్రజలు హర్షద్వానాలతో తెలిపారు. పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. ఎవరికైనా పథకాలు అందకపోతే, తన దృష్టికి తేవాలని సూచించారు. పింఛన్లు, జగనన్న ఇళ్లు తదితర కొన్ని పథకాలు తమకు అందలేదని, గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వాటిపై సచివాలయ కార్యదర్శులను ప్రశ్నించి, కారణాలను తెలుసుకున్నారు. పథకాలు అందలేదని చెప్పిన గ్రామస్తులంతా, అర్హుల జాబితాలో ఉన్నారని, వారికి జూన్‌లో ఆయా పథకాలు అందుతాయని చెప్పారు. కుల, మత, వర్గ విబేధాల్లేకుండా, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. గర్భిణులు, బాలింతలు, పిల్లలకు అందిస్తున్న పోషకాహారం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, పిఎంఇవై, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక పై ఆరా తీశారు. వారు చెప్పినవి నిజంగా ప్రజలకు చేరుతున్నాయో లేదోనని, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బెల్టుషాపులను రహస్యంగా ఎక్కడైనా నడుపుతుంటే, మహిళా పోలీసు దృష్టికి తీసుకురావాలని సూచించారు. దిశ యాప్ పనితీరును మంత్రి ప్రయోగపూర్వకంగా పరిశీలించారు. గ్రామానికి చెందిన ఒక మహిళచేత, దిశ యాప్ ద్వారా ఫోన్ చేయించగా, వెంటనే అటునుంచి సమాధానం రావడంతో సంతృప్తి చెందారు.
సచివాలయ వ్యవస్థ తమ ప్రభుత్వానికి కళ్లు,చెవులు లాంటిదని మంత్రి బొత్స పేర్కొన్నారు. వలంటీర్ల సేవలను ప్రశంసించారు. ప్రజా సమస్యల పరిష్కారంపట్ల తమ ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తోందని, అందుకే సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి, 11 మంది కార్యదర్శులను ప్రజలకు సేవచేసేందుకు ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావివ్వకుండా, అత్యంత పారదర్శకంగా అర్హులందరికీ పథకాలను అందిస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంత పారదర్శకంగా పనిచేయలేదని అన్నారు. ఏ నమ్మకంతో ముఖ్యమంత్రి జగన్‌మోహనరెడ్డి ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారో, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, మరింత కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని సచివాలయ సిబ్బందిని, వలంటీర్లను మంత్రి కోరారు. ప్రతీ మహిళా దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏళ్లతరబడి పేరుకుపోయిన భూ సమస్యల పరిష్కారానికి, భూ సర్వే చేపట్టడం జరిగిందని, ఇదొక చరిత్రాత్మక నిర్ణయమని మంత్రి పేర్కొన్నారు.
ఎంపి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలన్నీ తూచతప్పకుండా నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డికి దక్కిందన్నారు. మహిళల సంక్షేమం, వారి ఆర్థిక పురోభివృద్దికి రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. సుమారు రూ.500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను విజయనగరంలో నిర్మిస్తున్నారని, భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఎంఎల్‌సి ఇందుకూరి రఘురాజు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలోనే సమస్యల పరిష్కారానికి ఇదొక వారధి లాంటిదని పేర్కొన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీలకు కట్టుబడి, నవరత్నాలను అమలు చేస్తూ, పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. గజపతినగరం శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య మాట్లాడుతూ, బాపూజీ కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలముందుకు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డిదేనని ప్రశంసించారు. సుమారు 500 రకాల సేవలను అందిస్తూ, ఇప్పుడు సచివాలయాలు పరిపాలనలో ఎంతో కీలకంగా మారాయని పేర్కొన్నారు. మహిళల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతోందని చెప్పారు. సుమారు రూ.150కోట్లతో జాతీయ రహదారిని మరమ్మతు పనులు జరుగుతున్నాయని, దాదాపు రూ.12 కోట్లతో వివిధ గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడం జరుగుతోందని చెప్పారు. గజపతినగరం నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. డిగ్రీ కళాశాలకు మౌలిక వసతులను కల్పించి, సిబ్బందిని నియమించాలని, తోటపల్లి బ్రాంచ్ కెనాల్‌ను పూర్తి చేయాలని ఎంఎల్ఏ కోరారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, ఎంపిపి బెల్లాన జ్ఞానజ్యోతి, జెడ్‌పిటిసి గార తవుడు, ఎఎంసి ఛైర్మన్ వి.ముత్యాలనాయుడు, సర్పంచ్ బెల్లాన త్రినాధరావు, మండల ప్రత్యేకాధికారి ఎస్.అప్పలనాయుడు, తాశీల్దార్ అరుణకుమారి, ఎంపిడిఓ కిషోర్, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసి సభ్యులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment