జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది

  అమలాపురం  23 మే, (ప్రజా అమరావతి): 

        నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో  మొట్టమొదటి జిల్లా సమీక్షా కమిటీ సమావేశం అర్థవంతం ఫలవంతంగా జరిగిందని జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంద


ని జిల్లా ఇంచార్జ్ మంత్రి, మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు జోగి రమేష్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కొంకాపల్లి క్షత్రియ కళ్యాణ మండపంలో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ పాలనా సౌలభ్యం కొరకు ప్రజల వద్దకే పాలన పేరిట తొలుత గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయని తదుపరి జిల్లాల పునర్విభజన జరిగిందని ఆయన తెలిపారు. ప్రశాంత వాతావరణంలో  జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు అనువైన సూచనలు గౌరవ మంత్రులు శాసనమండలి శాసనసభ్యులు ఇచ్చారని ఆయన తెలిపారు. సమావేశంలో ఖరీఫ్ 2022 సన్నద్ధత కార్యాచరణ ప్రణాళిక పైన, జూన్ 1 నుంచి ఖరీఫ్ సీజన్ ముందస్తు సాగు నీటి విడుదల, గృహ నిర్మాణంలో పురోగతి, పంచాయతీరాజ్ పనులు నాడు-నేడు పాఠశాలు, వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఆధునీకరణ మరియు అభివృద్ధి పనులు పురోగతిపై క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా ఇంచార్జి మంత్రివర్యులు మాట్లాడుతూ రైతు సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధిని కాంక్షించి మూడో పంట అపరాల సాగు చేసుకునేలా సీఎం సూచించారని జూన్ ఒకటో తేదీ నుండి సాగునీటిని విడుదల చేయడం ద్వారా మూడవ పంట అపరాల సాగుకు అవకాశాలు ఏర్పడతాయన్నారు. నూతనంగా ఏర్పడిన కోనసీమ జిల్లాలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా గృహనిర్మాణ స్థలాల ఫిల్లింగ్ తదితర సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించి గృహ నిర్మాణాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జూన్ 1వ తేదీ నుండి  జలవనరుల శాఖ అధికారులు సాగునీటి విడుదల చేస్తారని, అందుకు అనుగుణంగా వ్యవసాయ అధికారులు రైతులను రైతు భరోసా కేంద్రాలు ద్వారా చైతన్య పర్చడంతోపాటు రైతు భరోసా కేంద్రాలలో విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు, సూక్ష్మ పోషకాలు, రైతుల డిమాండ్ అనుగుణంగా సిద్ధ పరచాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు ఒక మంచి పరిపాలన దిశగా అడుగు ముందుకు వేస్తూ జిల్లాను అన్ని అంశాలలో ముందంజలో నిలపాలని సూచించారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి పలు సంక్షేమ కార్యక్రమాలు రైతుల కొరకు ప్రవేశపెట్టి వారి అభ్యున్నతే రాష్ట్ర పురోగతిగా భావించి ముందుకు సాగుతున్నారన్నారు. పంచాయతీ రాజ్ పరిధిలోని రోడ్ల మరమ్మతులకు టెండర్లు పిలిచి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కోనసీమ జిల్లాలో అపారమైన వనరులు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో నిలిపేందుకు అధికారులు ప్రత్యేక చొరవతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా జిల్లా బలోపేతానికి చర్యలు గైకొనాలన్నారు. ధాన్యం కొనుగోలు సొమ్ములు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుమారు రెండు కోట్ల మేర నిలిచిపోయాయని వాటిని సరిదిద్దే పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. కోనసీమ జిల్లా అంచెలంచెలుగా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పినిపే విశ్వరూప్ మాట్లాడుతూ కోనసీమ జిల్లా ప్రకృతి పరంగా సహజ వనరులు అపారంగా ఉన్న మూలంగా బలోపేతం కాగలదన్నారు జిల్లా పేరు మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల గడువు ఇచ్చిందని ఈ లోగా ప్రజానీకం తమ అభిప్రాయాలను అభ్యంతరాలను తెలియజేయాలని ఆయన తెలిపారు. గడువు నిండిన పిమ్మట ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమం సినిమాటోగ్రఫీ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ సామాజిక న్యాయ బేరి వైయస్సార్ సీపీ బస్సు యాత్ర కార్యక్రమం ఈనెల 26వ తేదీ నుండి 29వ తేదీ వరకు శ్రీకాకుళం జిల్లా నుండి అనంతపురం జిల్లా వరకు జరగనున్నదని తెలిపారు. సామాజిక న్యాయానికి అద్దంపట్టే రీతిలో  సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు తేట తెల్లం చేయడం జరుగుతుందన్నారు. 25 క్యాబినెట్ మంత్రులులో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కేటాయించడం ,రాజ్యసభ స్థానాలు నాలుగు కేటాయించడం, శాసనమండలి చైర్మన్ గా ఎస్సీ అభ్యర్థిని, వైస్ చైర్మన్ గా మైనారిటీ అభ్యర్థిని, శాసనసభ చైర్మన్ గా బీసీ అభ్యర్థిని కేటాయించిందన్నారు. 672 బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ లు 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్ లు కేటాయించి రాష్ట్రప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తోందన్నారు. సామాజిక న్యాయం అనేది గౌరవ ముఖ్యమంత్రి జగన్ వల్లే సాకారమైనదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా  సామాజిక న్యాయ బేరీ వైఎస్సార్ సీపీ బస్సు యాత్ర పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ బస్సు యాత్ర ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో మరింతగా ఆత్మరక్షణ, ఆత్మగౌరవాన్ని నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం   ప్రత్యేక చొరవ చూపుతొందన్నారు. జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా మాట్లాడుతూ కోనసీమ జిల్లా ప్రాథమిక రంగానికి పొటెన్షియల్ ఉన్న జిల్లా అని పేర్కొన్నారు. జిల్లా అన్ని విధాలుగా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. 

       ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు, స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ, శాసనమండలి సభ్యులు చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, ఇళ్ళ వెంకటేశ్వరరావు శాసనసభ్యులు రాపాక వరప్రసాదరావు ,కొండేటి చిట్టిబాబు వేగుళ్ళ జోగేశ్వరరావు ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర, డిఆర్వో సిహెచ్. సత్తిబాబు, జడ్పీ సీఈఓ ఎం వి వి సత్యనారాయణ, వ్యవసాయ శాఖ జెడి వై. ఆనంద కుమారి,  పంచాయతీరాజ్ చంటిబాబు, డి ఈ ఓ ఎన్ వి రవి సాగర్,  పౌరసరఫరాలు డి ఎం ఆర్. తనూజ, జిల్లా పౌరసరఫరాల అధికారి కె వి ఎస్ ఎం ప్రసాద్ నాగేశ్వర నాయక్ ,ఆర్ డి ఓ వసంతరాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Comments