*మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయం*...
**అక్క చెల్లెమ్మలకు ఆర్థిక దన్ను**
*సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో డ్వాక్రా మహిళల్లో ఆనందోత్సవాలు*...
**రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష**
కడప, మే 5 (ప్రజా అమరావతి): రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించి, మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయంగా అక్కచెల్లెమ్మల జీవితాల్లో వెలుగులు నింపడానికి నిత్యం కృషి చేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ శాఖ మంత్రి అంజాద్ బాష పేర్కొన్నారు.
గురువారం తెలుగు గంగా కాలనీ లోని అంగడి వీధిలో పట్టణ పేదరిక నిర్ములన సంస్థ ఆద్వర్యంలో సున్నా వడ్డీ పథకం కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష, జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ అవినాష్ రెడ్డి,కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి,నగర మేయర్ సురేష్ బాబు,నగర డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి,,ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి,జెడ్పిటీసి నరేన్ రామంజనేయరెడ్డి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
వై.యస్.ఆర్ జిల్లా సున్నా వడ్డీ పథకంలో భాగంగా 2021- 22 ఆర్థిక సంవత్సరానికి కమలాపురం నియోజకవర్గ పరిధిలోని 474 స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ1.0893 కోట్ల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్. బి అంజాద్ బాష మాట్లాడుతూ....భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా...ఏ ముఖ్యమంత్రులు సాధించలేని మహిళా సాధికారత ను కేవలం మూడేళ్లలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సాధించే దిశగా అడుగులు వేస్తూ అనేక అభివృద్ధి పథకాలను వారి పేరిట రూపొందించడం జరిగిందన్నారు. కుల,మత,పార్టీలకతీతంగా అర్హత ప్రామాణికంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న భారతదేశంలో ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అన్నారు.గత ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి రైతులను,డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు రుణమాఫీ చేస్తానని చెప్పి మాటతప్పడం జరిగిందన్నారు. అయితే పాదయాత్ర లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 2 పేజీల మ్యానిఫెస్టో ప్రకటించి దాన్ని పవిత్ర గ్రంథంగా భావించి మూడేళ్లలో 95% సంక్షేమ పథకాలను ఇచ్చిన మాట ప్రకారం అమలు చేశారన్నారు. కరోనా కష్టకాలంలో మన రాష్ట్రానికి ఆదాయం తగ్గి పోయినప్పటికీ ఎక్కడా కూడా సంక్షేమ పథకాలను ఆపలేదన్నారు. పేద ప్రజలకు అమలుచేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలపై ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై చేస్తున్న విష ప్రచారాన్ని ప్రజలందరూ తిప్పికొట్టాలన్నారు. పేద,బడుగు బలహీన వర్గాలకు ఉచిత ఇళ్ళు ఇచ్చేందుకు ప్రభుత్వ భూములే కాక ప్రైవేటు భూములు కొనుగోలు చేసి మహిళల పేరిట ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మనదని అన్నారు.
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నేడు నేరుగా వారి ఖాతాలో జమచేయడం సంతోషానిచ్చిందన్నారు.స్వయం సహాయక సంఘాల అక్కాచెల్లెమ్మలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర లో చూసి చలించిపోయిన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి వారి ఉజ్వల భవిష్యత్ కోసం వైఎస్సార్ సున్నా వడ్డీ,వైయస్సార్ చేయూత వైయస్సార్ ఆసరా వంటి పథకాలను రూపొందించారన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా మహిళా సాధికారత మెరుగుపడి పేద మహిళల యొక్క ఆర్థిక పురోగతికి దోహదపడుతుందని తెలిపారు.మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది వారి కుటుంబాలు ఆనందంగా ఉండానే ఉద్దేశంతో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు.అన్ని సంక్షేమ పథకాలకు ఎలాంటి మధ్య దళారులు లేకుండా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు.వీటి ద్వారా స్వయం సహాయక సంఘాలు చిన్నతరహా వ్యాపారాలు చేసుకొని వడ్డీ భారం లేకుండా లాభదాయకంగా మెరుగైన జీవనం సాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మహిళలకు అండగా ఉంటుందన్నారు.
జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ....
గత ప్రభుత్వాలు మహిళా అభివృద్ధి పట్ల మాట నిలబెట్టుకోలేక పోయాయన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సాధించలేని మహిళా సాధికారతను మూడు సంవత్సరాల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేశారన్నారు. సమాజంలో, కుటుంబంలో మహిళలకు గౌరవప్రదమైన ప్రాధాన్యత కల్పించడం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు వారి పేరు మీద చేపట్టడం జరిగిందన్నారు.గత ప్రభుత్వం డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశాయన్నారు.అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఇచ్చిన మాటకు కట్టుబడి మహిళల అభివృద్ది చెందాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలను అందించారన్నారు.
జిల్లా కలెక్టర్ విజయ రామరాజు మాట్లాడుతూ....
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే మహిళల ఖాతాల్లో జమచేసిన డబ్బును చిన్నతరహా వ్యాపారాలు చేసుకొని స్వయం ఉపాధి సాధించే విధంగా ఖర్చు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యక్రమాలలో మహిళలకు పెద్ద పీట వేస్తూ ప్రాధాన్యతనిస్తోందని ఈ సందర్భంగా తెలిపారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ...
మహిళా సంఘాలు ఘనంగా నిర్వహించుకుంటున్న సున్నా వడ్డీ పథకం లో ప్రజా ప్రతినిధులందరు పాలు పంచుకోవడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు.ప్రపంచవ్యాప్తంగా ఒక రోజు మహిళా దినోత్సవం జరుపుకుంటే
మన రాష్ట్రంలో మాత్రం 365 రోజులు మహిళా దినోత్సవాల రూపంలో సంక్షేమ పథకాలను పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నామన్నారు. మహిళలు అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి వారి కాళ్ళమీద నిలబడి స్వయం ఉపాధి పొంది అభివృద్ధి చెందే విధంగా తోడ్పాటునందిస్తుందని తెలిపారు.
నగర మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ...
గత ప్రభుత్వ హయాంలో ఉచిత హామీలు ఇచ్చి అక్కాచెల్లెళ్లకు రుణమాఫీ చేస్తామని నమ్మించి మోసం చేశారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట కోసం కరోనాను కష్ట కాలంలో కూడా ఎన్ని ఇబ్బందులు వున్నా అక్కాచెల్లెళ్ల గురించి ఆలోచించి ఆర్థిక భరోసా ఇచ్చే విధంగా వైఎస్సార్ చేయూత,సున్నా వడ్డీ పథకం,అమ్మఒడి వంటి పథకాలను తీసుకుని వచ్చి ప్రతి అక్క చెల్లెమ్మల ఖాతాలో కోట్ల రూపాయలు జమ చేస్తున్నారన్నారు.సుదీర్ఘ పాదయాత్రలో అందరినీ కలిసి ప్రజల కష్టాలు తెలుసుకొని వారందరి కోసం నవరత్నాల పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
కమలాపురం ఎమ్యెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..
పండుగ వాతావరణంలో సున్నా వడ్డీ పథకాన్ని జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో అమలు కావడం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా కాకుండా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా, అన్నగా, తమ్మునిగా,కొడుకుగా మనవడి గా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. మూడేళ్ళ పాలనలో మన ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి, సుపరిపాలన మిగతా రాష్ట్రాలన్నింటికి ఆదర్శం అన్నారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేసి మహిళల కు పంచి పెట్టారు.
ఈ కార్యక్రమంలో మెప్మా పిడి రామ్మోహన్ రెడ్డి,ఏపీ.ఎం.ఐ.పి పిడి మధుసూదన్ రెడ్డి,కో ఆప్షన్ మెంబర్ ప్రసాద్ రెడ్డి, డాక్టర్ గోపి,జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ సంబటూరి ప్రసాద్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ పులి సునీల్, నగర కార్పొరేటర్లు, వైఎస్సార్సీపి నాయకులు ,జిల్లా అధికారులు,తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment