ఆత్మకూరు ఉప ఎన్నికకు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ల డాటా ఎంట్రీకి అవకాశం


 ఆత్మకూరు ఉప ఎన్నికకు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ల డాటా ఎంట్రీకి అవకాశం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా 

అమరావతి, మే 31 (ప్రజా అమరావతి):  ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ఫార్ము, అఫిడవిట్ లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు మరియు నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు www.suvidha.eci.gov.in  పోర్టల్ ద్వారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. 

ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికను ఈ ఏడాది జూన్ 23 న నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 25 న ఉప ఎన్నికల ప్రణాళికను జారీచేసినట్లు ఆయన తెలిపారు.  ఉప ఎన్నికల ప్రకటనతో ఈ నెల 25 నుండి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, అన్నిరాజకీయ పార్టీలు అప్పటి నుండి ఎన్నికల నియమావళిని తూ.చ.తప్పక పాటించాలని ఆయన కోరారు. 

ఈ ఉప ఎన్నికకు సంబందించి నామినేషన్ల దాఖలు జూన్ 6 లోగా చేసుకోవాల్సి ఉందని, నామినేషన్ల పరిశీలన జూన్ 7 జరుగుతుందని,  ఉప సంహరణకు జూన్ 9  చివరి తేదీ అని ఆయన తెలిపారు. జూన్ 23 న ఉదయం 7.00 గంటల నుండి  సాయంత్రం 6.00 గంటల వరకూ ఈ ఉప ఎన్నిక జరుగుతుందని, ఓట్ల లెక్కింపు  జూన్ 26 న జరుగుతుందని, ఈ ఉప ఎన్నిక ప్రక్రియ మొత్తం  జూన్ 28 లోపు పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. 

ఈ ఏడాది జనవరి 5 నాటికి ప్రచురించబడ్డ  తుది ఓటర్ల జాబితా ప్రకారం, తదుపరి  జూన్ 6 తేదీ 3.00 గంటల వరకు ఓటర్ల జాబితాలో పేర్లను నమోదు చేసుకున్న ఓటర్లను కూడా ఈ ఎన్నికలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.   ఆత్మకూరు శాసన సభా నియెజక వర్గానికి సంబందించి మే 29 నాటికి మొత్తం 2 లక్షల 16 వేల 5 మంది జనరల్, సర్వీసు ఓటర్లు నమోదు అయిఉన్నట్లు ఆయన తెలిపారు. 

ఆత్మకూరు శాసన సభా నియోజక వర్గం పరిధిలో 278 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, ప్రతి 1250 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ చొప్పున అదనంగా ఒక  తాత్కాలిక ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉప ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు సంబందిత రాజకీయ పార్టీలు కూడా పోటీ చేసే అభ్యర్థి యొక్క క్రిమినల్  యాంటిసిడెంట్స్ను ప్రచార కాలంలో మూడు సందర్బాల్లో పలు వార్తాపత్రికలు, టి.వి.చానళ్లల ద్వారా ప్రచారం చేయాలసి ఉందన్నారు. నామినేషన్ల ఉప సంహరణకు మొదటి నాలుగు  రోజులలోపు ఒక సారి, ఐదో రోజు నుండి ఎనిమిదో రోజు మధ్య మరో సారి మరియు తొమ్మిదో రోజు నుండి చివరి రోజు ప్రచారం లోపు ( పోల్ తేదీకి రెండవ రోజు ముందు) మరో సారి అభ్యర్థుల యొక్క క్రిమినల్  యాంటిసిడెంట్స్ను పలు వార్తాపత్రికలు, టి.వి.చానళ్లల ద్వారా ప్రచారం చేయాల్సి ఉందని అన్ని పార్టీల ప్రతినిధులకు ఆయన సూచించారు. కోవిడ్ నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాలను ఈ ఎన్నికల నిర్వహణలో తప్పక పాటించాల్సి ఉంటుందన్నారు.  ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలు, స్టార్ క్యాంపెయినర్లు కోవిడ్ మార్గదర్శకాలను ఏ మాత్రం అతిక్రమించినా సరే, తదుపరి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకొనేందుకు ఎటు వంటి అనుమతులు ఇవ్వబోమని ఆయన స్పష్టంచేశారు.

ఈ ఉప ఎన్నిక నిర్వహణకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలక్టర్  కె.వి.ఎన్. చక్రధరబాబు జిల్లా ఎన్నికల అధికారిగా,  జాయింట్ కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ రిట్నరింగ్ అధికారికా వ్యవహరిస్తారన్నారు. ఈ ఉప ఎన్నిక కు సంబందించి వీరితో పాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్  సిహెచ్.విజయరావు ను కూడా సంప్రదించవచ్చని ఆయన అన్నారు. 

  

Comments