*అపరిష్కృత సమస్యలపై దృష్టి కేంద్రీకరించండి*
*డివిజన్ స్థాయి సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి
*పని తీరు బాగుండకపోతే మెమోలు జారీ చేయక తప్పదని హెచ్చరిక
విజయనగరం, మే 04 (ప్రజా అమరావతి) ః జిల్లాలో వివిధ పనులకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని, పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి అధికారులను ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటంలో విఫలమైన వారికి మెమోలు జారీ చేయక తప్పదని హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె విజయనగరం ఆర్డీవో భవానీ శంకర్ తో కలిసి మంగళవారం డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. పేదలందరికీ ఇళ్లు, ఓటీఎస్ ప్రక్రియ, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్వహణ, భూ సంబంధిత అంశాలు, రేషన్ కార్డుల మంజూరు, వెల్ నెస్ సెంటర్లు, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణాలు, భూ కేటాయింపులు, ప్రభుత్వ భూమలు పరిరక్షణ తదితర అంశాలపై ఆమె సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుదీర్ఘంగా అపరిష్కృతం కాని సమస్యలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని, ప్రత్యేక కార్యాచరణ ద్వారా త్వరితగతిన పరిష్కరించాలని నిర్దేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట్ల బోర్డులు, కంచె ఏర్పాటు చేయాలని చెప్పారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలకు స్థల కేటాయింపుల విషయంలో కొన్ని చోట్ల ఇంకా పెండింగ్ ఉందని, పరిశీలించి త్వరితగతిన స్థలాలు కేటయించాలని సంబంధిత మండల స్థాయి అధికారులను ఆదేశించారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులకు స్థలాలు కేటాయించి త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. రేషన్ కార్డుల జారీలో, రేషన్ పంపిణీలో ప్రణాళికాయుత చర్యలు తీసుకోవాలని, ఎండీయూ ఆపరేటర్లను నియమించాలన్నారు. జిల్లాలో రేషన్ పొందలేకపోతున్న ఒంటరి మహిళలు, ప్రత్యేక అవసరాలు కలిగిన, హెచ్.ఐ.వి., ఇతర వ్యాధి గ్రస్తుల వివరాలను అందజేయాలని సంబంధిత సివిల్ సప్లై డీటీలను కలెక్టర్ ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని చోట్ల ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఇంకా పనులు ప్రారంభం కాని చోట్ల సంబంధిత ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు మెమోలు జారీ చేయాలని సంబంధిత ఎంపీడీవోలకు కలెక్టర్ సూచించారు. బీయాండ్ ఎస్.ఎల్.ఎ.కు ముందే స్పందన వినతులను పరిష్కరాలని చెప్పారు.
*సచివాలయ ఉద్యోగులతో ప్రత్యేకంగా మాట్లాడండి*
పథకాలు అమలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై ఆయా సచివాలయాల ఉద్యోగులతో మండల స్థాయి అధికారులు ప్రత్యేకంగా మాట్లాడాలని కలెక్టర్ ఆదేశించారు. పెండింగ్ సమస్యల పరిష్కారంలో అనుసరించాల్సిన విధానాలపై మార్గదర్శకాలు జారీ చేయాలని చెప్పారు. పనులు త్వరితగిన పూర్తి అయ్యేలా వారికి సరైన అవగాహన కల్పించాలని సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను నిర్ణీత కాలంలో చేరుకొనేలా వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
సమావేశంలో డీఆర్వో ఎం. గణపతిరావు, ఆర్డీవో బీహెచ్. భవానీ శంకర్, గ్రామీణ నీటి సరఫరా ఎస్.ఈ. శివానంద్ కుమార్, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ప్రత్యేక అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, హౌసింగ్ ఏఈలు, ఏపీవోలు, సివిల్ సప్లై డీటీలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment