రైతన్నకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమచేసిన రైతుభరోసా నగదు

 

నెల్లూరు, మే 15 (ప్రజా అమరావతి): జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సన్నద్ధమవుతున్న రైతన్నకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం జమచేసిన రైతుభరోసా నగదు


ఎంతగానో ఉపయోగపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీ కెవిఎన్ చక్రధర్ బాబు పేర్కొన్నారు. 


 సోమవారం ఉదయం ఏలూరు జిల్లాలోని గణపవరం  నుంచి వైఎస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్  నిధులను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి రైతుల ఖాతాల్లో జమచేసి వర్చువల్ గా నిర్వహించిన కార్యక్రమానికి నెల్లూరు కస్తూర్భా కళాక్షేత్రంలో నుంచి జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన సమయంలో సోమశిల, కండలేరు జలాశయాలను మన జిల్లాలోనే ఉంచి జిల్లా రైతాంగానికి ముఖ్యమంత్రి ఎంతో మేలు చేశారని, ఈ  వ్యవసాయ సీజన్ కు ముందుగానే నీటిని విడుదల చేయాలని నిర్ణయించడం,  రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను జమ చేయడం ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యుత్ కొరత ఉన్నా రాష్ట్రంలోని రైతులకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్, ఆక్వా రైతులకు సబ్సిడీపై  విద్యుత్తును ముఖ్యమంత్రి అందిస్తున్నారని, రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, యంత్ర పరికరాలు మొదలైన సేవలను రైతు భరోసా కేంద్రంగా సకాలంలో అందజేస్తున్నామని చెప్పారు. అసని తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు వీలైనంత త్వరలోనే నష్టపరిహారాన్ని వారి ఖాతాలో జమ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. జిల్లాలో వైయస్సార్ రైతు భరోసా-పిఎం కిసాన్ నాలుగో ఏడాదికి సంబంధించి  మొదటి విడత నగదును 2,05,587 మంది రైతుల ఖాతాల్లోకి  రూ. 113 కోట్లను ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా జమ చేసినట్లు పేర్కొన్నారు. నాలుగో ఏడాది మొదటి విడత రూ. 7500కు సంబంధించి నేడు  5500 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని, పీఎం కిసాన్ కింద ఈనెలాఖరులో మరో రెండు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు చెప్పారు.

 కార్యక్రమానికి ముందుగా కస్తూర్బా కళాక్షేత్రం ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన కూరగాయలు, యంత్ర పరికరాల స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు.


 ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ శ్రీమతి స్రవంతి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ శ్రీ దొడ్డంరెడ్డి నిరంజన్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీ వీరి చలపతి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ సుధాకర్ రాజు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీమతి అనిత, మత్స్య, పశుసంవర్ధక శాఖల జాయింట్ డైరెక్టర్లు శ్రీ నాగేశ్వర రావు, శ్రీ మహేశ్వరుడు ఉద్యానవన శాఖ అధికారి శ్రీ శ్రీనివాస రావు, ఏపీఎంఐపి అధికారి సి సుభాని,  వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 


రైతుల అభిప్రాయాలు

.......................... 

అప్పులు చేయడం లేదు

- సాధినేని గోపాల్, ఆమంచర్ల

...........................

మా గ్రామంలో నాతో పాటు చాలా మంది సన్న,చిన్నకారు రైతులుఎక్కడా అప్పు చేయకుండా ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతూ వ్యవసాయం చేసుకుంటున్నాము. వ్యవసాయ ఖర్చులకు ఇబ్బందులు పడకుండా, మేము ఎవరి దగ్గర వడ్డీలకు అప్పులు చేయకుండా రైతు భరోసా డబ్బులను పొలం ఖర్చులకు వాడుకుంటున్నాము. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న ముఖ్యమంత్రికి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. 


రైతు భరోసా కేంద్రాలతో ఎంతో ప్రయోజనం

- పోతురాజు దయాకర్, మినగల్లు

 ............................

 -  రైతు భరోసా కేంద్రాలు ద్వారా నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు మాకు అందుబాటులో తక్కువ ధరకు అందిస్తున్నారు.  క్రమం తప్పకుండా రైతు భరోసా డబ్బులను జమ చేయడం తో ఉపయోగంగా ఉంది. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లప్పుడు మాకు ముఖ్యమంత్రిగా ఉండాలని  కోరుకుంటున్నాను. 


365 రోజులు కూరగాయలను పండిస్తున్నాను

- ముప్పాళ్ళ నిర్మలమ్మ, ఆరిమేనుపాడు

..................................................

నేను మాకు ఉన్న ఐదు ఎకరాల పొలంలో వరి, నిమ్మ పంటలను సాగు చేస్తూ, సంవత్సరమంతా కూరగాయలు కూడా పండిస్తున్నాను.  నేను ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాల ద్వారా లబ్దిపొందాను. వైయస్సార్ రైతు భరోసా పథకం ద్వారా నా ఖాతాలో ప్రతిసారి డబ్బులు వస్తున్నాయి. ఈ డబ్బులను వ్యవసాయ ఖర్చులకు ఉపయోగించుకుంటున్నాను. మాకు అన్ని విధాల సాయం చేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 

Comments