నెల్లూరు, జూన్ 5 (ప్రజా అమరావతి) : ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో 100 మొక్కలను నాటాలనే గొప్ప సంకల్పంతో ముందుకు సాగాల
ని, నాటిన ప్రతి మొక్కను కాపాడుకుంటూ, ఆ మొక్క వద్ద ప్రతి ఏడాది ఒక సెల్ఫీ తీసుకుని గుర్తుగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పిలుపునిచ్చారు.
ఆదివారం ఉదయం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించగా, నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి కె.వి.ఆర్ పెట్రోల్ బంకు, ఎం జి బి మాల్ మీదుగా నెల్లూరు నగర పాలక సంస్థ కార్పొరేషన్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా మున్సిపల్ పార్కు సమీపంలో మొక్కలను నాటిన కలెక్టర్, అనంతరం నిర్వహించిన సభలో మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లావ్యాప్తంగా ఆదివారం పదివేల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఈ దిశగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, కార్యాలయాల్లో విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. పర్యావరణంలో వస్తున్న అనేక మార్పుల వలన ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకుంటున్నాయని, ఈ వైపరీత్యాల నుంచి మానవ మనుగడకు ఆధారమైన భూమాతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ప్రకృతి వనరులు కాపాడుకునేందుకు నీటి, విద్యుత్ వినియోగం తక్కువగా వాడాలని, వృధాను అరికట్టాలని, అడవులను విరివిగా సంరక్షించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ఆయిల్ కంపెనీల ప్రతినిధులను కలెక్టర్ అభినందించారు.
ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ జాహ్నవి, డిఎఫ్ఓ శ్రీ షణ్ముఖ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రాజశేఖర్, కార్పొరేషన్ ఎస్ఈ సంపత్ కుమార్, డిఈ పద్మజ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment