ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది..


విజయవాడ (ప్రజా అమరావతి);

*ఇంటర్మీడియేట్ పరీక్షా  ఫలితాలలో 72 శాతం  ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.. 


*పరీక్షా ఫలితాలలో బాలికలదే పై చేయి.. 

*రాష్ట్రంలో క్రొత్తగా 884 జూనియర్ కళాశాలలు ప్రారంభిస్తున్నాం.. 

*ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగష్టు 3 నుండి 12 వరకు సప్లిమెంటరీ పరీక్షలు.. 

*పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాబ్ లు అందించనున్నాం.. 

*అమ్మ ఒడి కార్యక్రమం క్రింద విద్యార్థులకు లాప్ టాప్ లు అందించాలని నిర్ణయించాం.. 

-రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ.. 

ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో 72% ఉత్తీర్ణత సాధించి కృష్ణా జిల్లా రాష్ట్రంలో  మొదటి స్థానంలో నిలిచిందని, బాలురు కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించారని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ అన్నారు.  

విజయవాడ మురళీ ఫార్చ్యూన్ హోటల్ లో బుధవారం ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను మంత్రి విడుదల చేసారు.  ఈ సందర్భంగా మంత్రి  బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 8 లక్షల 69 వేల 59 మంది రెగ్యులర్ విద్యార్థులు, 72 వేల 299 మంది ఒకేషనల్ కోర్సు విద్యార్థులు పరీక్షలు వ్రాయగా వారిలో మొదటి సంవత్సరానికి సంబంధించి 54% మంది, రెండవ సంవత్సరానికి సంబంధించి 61% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.  మొత్తం ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో బాలురు కంటే బాలికలే పై చేయిగా నిలిచారని, మొదటి సంవత్సరంలో బాలురు 49% ఉత్తీర్ణత సాధిస్తే, బాలికలు 60% ఉత్తీర్ణత సాధించారని, రెండవ సంవత్సరంలో బాలురు 54% ఉత్తీర్ణత సాధిస్తే బాలికలు 68% ఉత్తీర్ణత సాధించారని మంత్రి అన్నారు.  ఉమ్మడి జిల్లాల్లో కృష్ణా జిల్లా 72% తో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవగా, కడప జిల్లా 50% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచిందని మంత్రి అన్నారు.  పరీక్షా ఫలితాల కొరకు ఇంటర్మీడియేట్ బోర్డు వెబ్ సైట్ www.bie.ap.gov.in,, https://examresults.ap.nic.in  ను సందర్శించి ఫలితాలను పొందవచ్చన్నారు.  ఇందుకు గాను పాస్ వర్డ్ JM@SR$M22s గా గుర్తించాలని మంత్రి తెలిపారు. 

ఇంటర్మీడియేట్ పబ్లిక్ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించామని 2022 మే 6 నుండి మే 25 వరకు పరీక్షలు నిర్వహించగా, మే 18 నుండి జూన్ 14 వరకు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించామన్నారు.  మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ పరీక్షలకు 4 లక్షల 45 వేల 604 మంది పరీక్షలు వ్రాయగా 2 లక్షల 41 వేల 591 మంది ఉత్తీర్ణత సాధించారని, రెండవ సంవత్సరానికి సంబంధించి 4 లక్షల 23 వేల 455 మంది పరీక్షలు వ్రాయగా 2 లక్షల 58 వేల 449 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు.  విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25వ తేదీ నుండి జులై 5వ తేదీ వరకు అవకాశం కల్పించామని మంత్రి అన్నారు.  ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లమింటరీ పరీక్షలు నిర్వహిస్తున్నామని జులై 8వ తేదీ లోగా పరీక్ష ఫీజు చెల్లించ వలసి ఉంటుందని సప్లమింటరీ పరీక్షలు ఆగష్టు 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు నిర్వహిస్తారని మంత్రి అన్నారు.  ప్రాక్టికల్ పరీక్షలు ఆగష్టు 17 నుండి 22 వరకు జిల్లా హెడ్ క్వార్టర్ లలో నిర్వహిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

రాష్ట్రంలో క్రొత్తగా 884 జూనియర్ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభిస్తున్నామని మంత్రి అన్నారు.  విద్య పై ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనేక  సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి అన్నారు.  రాష్ట్రంలో 679 మండలాలు ఉన్నాయని ప్రతీ మండలం లోను రెండు జూనియర్ కళాశాలలు ఉండాలనే ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి వరకు ఉన్న హై స్కూల్ లను జూనియర్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు.   ఉన్న సిబ్బందిని సర్దుబాటు చేస్తామని అవసరమైతే క్రొత్తగా నియామకాలు చేపడతామని మంత్రి అన్నారు.  కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులకు విద్యా బోధన అందిస్తున్నామని తల్లి తండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని ప్రభుత్వం భరోసా ఇస్తుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాద్యమంతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్  మెరుగు పరుచుటకు బైజూ సంస్థతో mou ప్రభుత్వం కుదుర్చుకుందని మంత్రి అన్నారు.  విద్యా రంగంలో పేరున్న బైజూ సంస్థ రాష్ట్రంలో 35 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందించడానికి ముందుకు వచ్చిందని ఈ కార్యక్రమాన్ని అంతటినీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద చేపట్టిందని మంత్రి అన్నారు.  రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాబ్ లు అందించనున్నామని మంత్రి అన్నారు.  అమ్మ ఒడి కార్యక్రమం క్రింద విద్యార్థులకు లాప్ టాప్ లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈనెల 27 న నిర్వహించే అమ్మ ఒడి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని ప్రకటిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

ఇంటర్మీడియేట్ పరీక్షా ఫలితాలలో కొన్ని జిల్లాలలో ఉత్తీర్ణత శాతం తక్కువ రావడానికి కారణాలను విశ్లేషిస్తున్నామని మెరుగైన ఫలితాలు సాధించే విధంగా  కృషి చేస్తామని ఇందుకు విద్యా శాఖ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 

ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి. రాజశేఖర్, ఇంటర్మీడియేట్ విద్యా మండలి సెక్రటరీ మరియు కమిషనర్ ఎమ్.వి. శేషగిరి బాబు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జి.వి. ప్రభాకర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   


Comments