ఎస్సీ గురుకులాల్లో చిత్తూరు జిల్లా టాప్ • పదవ తరగతి పరీక్షల్లో 92శాతం ఉత్తీర్ణతఎస్సీ గురుకులాల్లో చిత్తూరు జిల్లా టాప్

పదవ తరగతి పరీక్షల్లో 92శాతం ఉత్తీర్ణత

రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం ఫలితాలు సాధించిన ఎస్సీ గురుకులాలు

మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి

అమరావతి, జూన్ 6 (ప్రజా అమరావతి): ఎస్సీ గురుకులాలకు చెందిన పదవ తరగతి విద్యార్థులలో రాష్ట్రవ్యాప్తంగా 69 శాతం మంది ఉత్తీర్ణతను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. జిల్లాల వారీగా చూస్తే చిత్తూరు జిల్లాకు చెందిన గురుకులాలు టాప్ లో ఉన్నాయని, ఆ జిల్లాకు చెందిన గురుకులాల విద్యార్థులు శాతం 92 ఉత్తీర్ణతను సాధించారని వివరించారు.

రాష్ట్రంలో పదవ తరగతి ఫలితాలను ప్రకటించిన నేపథ్యంలో సోమవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున డా.బీ.ఆర్.అంబేద్కర్ ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు సాధించిన ఫలితాలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 గురుకులాల ద్వారా మొత్తం 13,649 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలను రాయగా వారిలో 9435 మంది ఉత్తీర్ణులయ్యారని చెప్పారు. గురుకుల విద్యార్థుల ఉత్తీర్ణత 69 శాతం ఉన్నప్పటికీ కొన్ని జిల్లాలకు చెందిన గురుకులాలు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణతను సాధించగలిగాయని తెలిపారు. చిత్తూరు జిల్లాకు చెందిన గురుకులాలు 92శాతం,  పార్వతీపురం జిల్లాలోని గురుకులాలు 88శాతం, నంద్యాల జిల్లాకు చెందిన గురుకులాలు 86 శాతం, ప్రకాశం జిల్లాకు చెందిన గురుకులాలు 82 శాతం ఫలితాలను సాధించాయని నాగార్జున పేర్కొన్నారు. వైయస్సార్ కడప, శ్రీకాకుళం, నెల్లూరు, కాకినాడ, గుంటూరు, ఏలూరు, బాపట్ల జిల్లాలకు చెందిన గురుకులాలు 70శాతం పైబడి ఫలితాలను సాధించాయన్నారు. ప్రకాకాశం జిల్లా మార్కాపురం లోని బాలికల గురుకులం, చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, రామకుప్పం బాలుర గురుకులాలు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చోలంగిపేట బాలికల గురుకులాలు పదోతరగతి పరీక్షల్లో 100శాతం ఉత్తీర్ణతను సాధించాయని తెలిపారు. 99%, 98% ఫలితాలను కూడా పలు గురుకులాలు సాధించాయని చెప్పారు. కాగా ఎస్సీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులలో అల్లూరి సీతారామరాజు జిల్లా విద్యార్థులు 86 శాతం, శ్రీకాకుళం విద్యార్థులు 70 శాతం ఫలితాలను సాధించారన్నారు. ఎస్సీ హాస్టళ్లకు చెందిన విద్యార్థులలో 8263 మంది పదవ తరగతి పరీక్షలకు హాజరు కాగా వారిలో 4095 మంది ఉత్తీర్ణులు అయ్యారని నాగార్జున వివరించారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 

Comments