అత్యాచార నిరోధక చట్టంపై ప్రతివారం గ్రామాల్లో సమావేశాలు
• మంత్రి మేరుగు నాగార్జున.
అమరావతి, జూన్ 29 (ప్రజా అమరావతి): ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఈ చట్టంపై అవగాహన పెంచడం ద్వారానే దళితులపై దాడులు తగ్గించడానికి, ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరును మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగానే నాగార్జున మాట్లాడుతూ, ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (పీసీఆర్) చట్టం ప్రకారంగా మండలాల్లో పని చేసే తహసీల్దారులు, ఎస్.ఐలు వారానికి ఒకసారి గ్రామాలకు వెళ్లి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎవరూ కూడా గ్రామాలకు వెళ్లడం లేదని, ఈ చట్టం గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం వస్తే దళితులపై దాడులు చేయకూడదనే విషయంగా అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదనే విషయంగా దళిత వర్గాలకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తహసీల్దార్లు, ఎస్.ఐలు వారంలో ఒక రోజు గ్రామాలకు వెళ్లి ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం కలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో విచారణ ఏళ్లతరబడిగా కొనసాగడం వల్ల సాక్షులను బెదిరించడం, కేసులు వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి తీసుకురావడం జరిగే అవకాశం ఉంటుందని, బాధితులకు న్యాయం జరగడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని చెప్పారు. ఈ కేసుల్లో విచారణను త్వరితగతిన ముగించి కోర్టుల్లో చార్జిషీట్లను దాఖలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా అత్యల్ప స్థాయిలోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయని, ఎక్కువ భాగం కేసులు కోర్టుల్లో వీగిపోవడం జరుగుతోందని నాగార్జున తెలిపారు. అతి తక్కువ శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడటం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు. ఈ సందర్భంగానే సీఐడీకి చెందిన అధికారులు మాట్లాడుతూ, కోర్టుకు వచ్చిన ఎస్సీలతో తాము ఏసు క్రీస్తును పూజిస్తామని,చర్చ్ లకు వెళ్తామని, తమ ఇంట్లో బైబిల్ ఉందని చెప్పించడం జరుగుతోందని తద్వారా వారు బీసీ-సీ వర్గానికి చెందిన క్రైస్తవులని ఎస్సీలు కాదని నిరూపించి కోర్టుల్లో కేసులు కొట్టివేసేలా చేస్తున్నారని, అనేక కేసుల్లో దీన్ని గమనించామని చెప్పారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, భగవంతుడిని ఆరాధించడానికీ, మతానికీ ముడిపెట్టకూడదని ఇలాంటి కారణాలతో కొట్టి వేసిన కేసుల వివరాలను తీసుకొస్తే ముఖ్యమంత్రి అనుమతితో అలాంటి కేసులను రీ ఓపెన్ చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద బాధితులు అందించాల్సిన పరిహారం, ఉద్యోగ ఉపాధుల కేటాయింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు డీఓ లెటర్లు రాయాలని నాగార్జున అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే డీఎస్పీలను నియమించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీల పై జరిగే దాడుల విషయంగా 24 గంటలూ ఫిర్యాదులను స్వీకరించే కాల్ సెంటర్ ను సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దీన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు. కాగా పీసీఆర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తీసుకుంటున్న వినూత్న చర్యలను గురించి సీఐడీ అధికారులు మంత్రి నాగార్జునకు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐడీ పీసీఆర్ ఎస్పీ రత్న, జేడీ ప్రాసిక్యూషన్ అజయ్ ప్రేమ్ కుమార్ తో పాటుగా సాంఘిక సంక్షేమశాఖ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment