రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి..విజయవాడ (ప్రజా అమరావతి);


*రక్తదానం చేయండి.. ప్రాణదాతలు కండి..*


- *రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు.. : సెర్ప్ సీఈవో ఎ.ఎమ్.డి. ఇంతియాజ్*. 

- *ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రాణదాతలకు సన్మానం*.. 


ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా అత్యధికంగా రక్తదానం చేసిన ప్రాణదాతలుగా నిలిచినవారిని ఘనంగా సన్మానించారు. విజయవాడలో ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేషన్ భవన్ లో గల సెర్ప్ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా సెర్ప్ సీఈవో ఎ.ఎమ్.డి ఇంతియాజ్, ఇండియన్ రెడక్రాస్ సోసైటీ ఎన్టీఆర్ జిల్లా ఛైర్మన్ డా. జి. సమరం హాజరయ్యారు. నెల్లూరుకు చెందిన పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా ఎ.ఎమ్.డి. ఇండియాజ్ మాట్లాడుతూ.. రక్తం ఏ ప్రయోగశాలలోను తయారు చేయలేమని, రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదని అన్నారు. నలుగురికి సహాయం చేసినప్పుడు కలిగే అనుభూతి మరే ఇతర కార్యక్రమంలో కనిపించదన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అందరూ సమానమే అనే భావన ‘రక్తం’ సూచిస్తుందన్నారు. రక్తదానం గొప్ప సంతృప్తినిస్తుందన్నారు.  మనం ఆరోగ్యంగా ఉండాలని, ఇతరులకు రక్తదానం చేస్తామనే ధైర్యం కలిగి ఉండాలన్నారు.  అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని చెప్పారు. 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు ఉన్న వ్యక్తులు అందరూ రక్తదానం చేయవచ్చని సూచించారు. ఈ రోజు రక్తదాతలను గుర్తించి, వారికి సన్మానించడం సుదినమని, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షులు మురళీ మోహన్ రాజుకి అభినందనలు తెలిపారు. 

డాక్టర్ జి. సమరం మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల  జీవితకాలం పెరుగుతుందని, బీపీ, షుగర్, హార్ట్ ఎటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే అవకాశం చాలా తక్కువని తెలిపారు. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడగలిగామనే సంతృప్తి రక్తదానంతో కలుగుతుందన్నారు. రెడ్ క్రాస్ సోసైటీ  30 శాతం బ్లడ్ యూనిట్స్ ప్రభుత్వానికి ఉచితంగా అందజేస్తుందని తెలిపారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ సోసైటీ నిర్వహణ ఖర్చులు భరిస్తే.. అడిగిన ప్రతిఒక్కరికీ ఉచితంగా బ్లడ్ సరఫరా చేస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 272 మిలియన్ యూనిట్స్ రక్తం అవసరమవుతుంటే.. 30 మిలియన్ యూనిట్స్ కొరత ఉంటుందని తెలిపారు. 119 దేశాల్లో రక్తం తీవ్రకొరత ఉందన్నారు. భారత్ దేశంలో 13.5 మిలియన్ యూనిట్స్ అవసమవుతుంటే.. 10.9 మిలియన్ యూనిట్స్ మాత్రమే లభ్యమవుతుందన్నారు.    యువకులు రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు గుర్తించాలని సూచించారు. యువత రక్తదానం చేసే విధంగా రెడ్‌ క్రాస్‌ సొసైటీ ప్రతినిధులు మంచి అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదానాన్ని చేయండి.. ప్రాణదాతలుకండి.. మానవత్వం చాటుకోండి అని పిలుపునిచ్చారు. 


*ప్రాణదాత అవార్డు గ్రహీతలు*.. 

అత్యధికంగా రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్, మెమోంటో, శాలువాతో సత్కరించారు. నెల్లూరుకి చెందిన డా. పడమందల ముత్తు (58 సం) తన 36 ఏళ్ల ప్రయాణంలో 73 సార్లు రక్తదానం చేశారు. పల్నాడు జిల్లా బెల్లకొండకి చెందిన 26 సంవత్సరాల వయస్సు గల మద్దు మల్లిఖార్జున అనే యువకుడు గత ఆరేళ్లలో 49 సార్లు రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు.. నంద్యాల జిల్లా బేతంచర్లకి చెందిన ఎస్. హానీఫ్ భాషా అనే దివ్యాంగుడు 43 సార్లు రక్తందానం చేసి మంచి మనసున్న వ్యక్తిగా చాటుకున్నాడు. జి. శ్రీకృష్ణ (తాడేపల్లి) - 40 సార్లు, ఉమామహేశ్వర రావు (పాలకంపాడు) 39సార్లు రక్తదానం చేశారు. మంగళగిరి అడిషనల్ కమాండెంట్ ఇ.యస్. సాయిప్రసాద్ 38 సార్లు రక్తదానం చేసి తన ఉన్నతాధికారుల నుంచి సెల్యూట్ పొందారు. వీరితోపాటు కె.బాలమురళి, షేక్ ఖాజా, శ్రీమతి ఎమ్. మాధవీలత, వై. అంజని ప్రాణదాత అవార్డులు పొందిన వారిలో ఉన్నారు. 

ఈ కార్యక్రమంలో స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీ డా. ఇళ్ల రవి, మంగళగిరి డీఎస్పీ యన్.బి,యమ్. మురళీకృష్ణ, జమ్మలమడుగు రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు వై. చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Comments