ఆత్మకూరు, జూన్ 1 (ప్రజా అమరావతి):--
ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు
పక్కాగా చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కె వి ఎన్ చక్రధర బాబు వెల్లడించారు.
ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి శ్రీ కేవిఎన్ చక్రధర్ బాబు నియోజకవర్గంలో బుధవారం విస్తృతంగా పర్యటించి ఓటు హక్కు వినియోగం పై విద్యార్థులను చైతన్య పరచడంతో పాటు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అధికారులు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.
తొలుత ఆత్మకూరు పట్టణంలోని ఆనం సంజీవ రెడ్డి డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్వీప్ కార్యక్రమంలో పాల్గొని యువత మేల్కొని ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అనంతరం పట్టణంలోని బస్టాండ్ సెంటర్ నుండి ఓటు హక్కు వినియోగం పై అవగాహన ర్యాలీ ని జిల్లా ఎన్నికల అధికారి ప్రారంభించి అందులో పాల్గొన్నారు. ఈ ర్యాలీ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల వరకు సాగింది.
ఆ పాఠశాలలో ఏర్పాటుచేసిన 138, 139, 141 పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.
పట్టణంలోని ఆది ఆంధ్ర పాఠశాలలో ఏర్పాటుచేసిన 146, 147 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే అనుమసముద్రంపేట మండలంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ఏర్పాటు చేసిన 164, 165 పోలింగ్ కేంద్రాలను, జిల్లా పరిషత్ మాధ్యమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన 166, 167 168, 169 పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాలు, వృద్ధులు దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన సౌకర్యాలు, ఓటరుగా నమోదు చేసుకునేందుకు వున్న యాపు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనుమసముద్రంపేట మండలం హసనాపురంలో ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను ఎన్నికల అధికారి తనిఖీ చేసి అక్కడి రిజిస్టర్ ను పరిశీలించారు. మద్యం, నగదు, పెద్ద ఎత్తున ఇంటికి కావలసిన నిత్యావసర సరుకులు తరలిస్తున్న వాహనాలను తనిఖీ చేసి సీజ్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఐ లు శ్రీసుభాని, శ్రీవెంకటేశ్వర్లు కు సూచించారు.
అనంతరం సంగం మండలం తలుపూరుపాడు గ్రామంలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన 198 పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మీడియాతో మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి జారీచేసిన మార్గదర్శకాలు ప్రకారం ఈ- సువిధ యాప్ ద్వారా ఆన్లైన్లో కూడా నామినేషన్లు స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ర్యాలీలు మైకులు వంటి వివిధ రకాల అనుమతుల కోసం కూడా ఈ -సువిధ ద్వారానే దరఖాస్తులు చేయవచ్చని వాటిని 24 గంటల్లోగా పరిశీలించి సింగిల్ డెస్క్ ద్వారా అనుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు చేసేందు కోసం 250 మంది ఉద్యోగులను నియమించామన్నారు. వీరితో 16 బృందాలను ఏర్పాటు చేసి జిల్లా నలుమూలల ముఖ్యమైన ప్రాంతాల్లో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేసి అక్రమ పద్ధతుల్లో రవాణా చేస్తున్న మద్యం, నగదు వంటి ఇతర సామాగ్రిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టకుండా చేసేందుకు, ప్రజలను భయాందోళనకు గురి కాకుండా ఉండేందుకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపడుతున్నామన్నారు. ఐదు కంపెనీల కేంద్ర భద్రతా దళాలు, రాష్ట్ర ప్రత్యేక పోలీసు దళాలు జిల్లాకు త్వరలో వస్తున్నాయన్నారు. నియోజకవర్గంలో గుర్తించిన 122 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో భద్రత, ఈవీఎంలు, స్ట్రాంగ్ రూముల భద్రత కోసం వీరిని వినియోగిస్తామన్నారు. అంతేకాకుండా 50% పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వీడియోగ్రఫీ చేయడంతోపాటు సూక్ష్మ పరిశీలకులు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 23వ తేదీ ఉపఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కలిగించి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కోసం అవగాహన ర్యాలీలు స్వీప్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేకించి యువ ఓటర్లను చైతన్య పరుస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు విలువ తెలుసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వారి కోసం ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు వేసవి కాలం అయినందున మంచినీరు, మజ్జిగ, నీడ వంటి సదుపాయాలను కూడా కల్పిస్తున్నామన్నారు. అంతేకాకుండా వారు ఓటు హక్కును వినియోగించుకునేందు కోసం వారి ఇంటి వద్దకే వచ్చి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధంగా ఫారం 12 డి దరఖాస్తులు సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని వారు ఈనెల 3వ తేదీలోగా సద్వినియోగం చేసుకోవాలన్నారు. నియోజకవర్గంలో తొమ్మిది వేల మందికి పైగా దివ్యాంగులు, వృద్ధులు ఉన్నారని ఇప్పటికే 78 మంది దివ్యాంగులు, 89 మంది 80 సంవత్సరాల పైబడి ఉన్న వృద్ధులు దరఖాస్తు చేసుకుని ఉన్నారన్నారు. నియోజకవర్గంలో 279 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, 1250 ఓటర్ల కంటే అధికంగా ఉంటే అనుబంధ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జిల్లాకు త్వరలో ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు రానున్నారన్నారు. వారు ప్రజలకు, అభ్యర్థులకు అందుబాటులో ఉండి ఫిర్యాదులు గాని, సూచనలు గాని స్వీకరిస్తారన్నారు. ఇందుకోసం వారి ఫోన్ నెంబర్లు, ఈ మెయిల్ ఐడి లు త్వరలో తెలియజేస్తామన్నారు. ఎన్నికల యాజమాన్య ప్రణాళిక తయారు చేశామని, జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు 22 మందిని వివిధ ఎన్నికల విభాగాలకు నోడల్ అధికారులుగా నియమించామన్నారు. జిల్లా కలెక్టరేట్ లో 24 గంటలు పనిచేసే విధంగా ఒక కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఎవరైనా సరే 1950 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఏమైనా ఫిర్యాదులు చేయవచ్చన్నారు. ఎన్నికల సంఘం సి-విజిల్ యాప్ ను వినియోగంలోకి తెచ్చిందని ప్రతి ఓటరు దాని వినియోగించుకొని ఏమైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కోవిడ్ నిబంధనలు విధిగా పాటిస్తూ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులందరికీ కోవిడ్ మూడవ డోసు వేయడం జరుగుతుందన్నారు.
ఈ పర్యటనలో జిల్లా ఎన్నికల అధికారి వెంట స్వీప్ నోడల్ అధికారి శ్రీ షణ్ముఖ కుమార్, ఆత్మకూరు ఇన్చార్జి ఆర్డిఓ శ్రీ టి బాపిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీ రమేష్ బాబు, ఆత్మకూరు తహసిల్దార్ శ్రీ సోమ్లా నాయక్, అనుమ సముద్రం పేట తహసిల్దార్ శ్రీ సీతారామయ్య ,సంగం ఇన్చార్జి ఎంపీడీవో శ్రీమతి హేమలత, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసులు కరస్పాండెంట్ సుబ్బారెడ్డి ఎస్సైలు బి ఎల్ వో లు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.
addComments
Post a Comment